కారు... విమానం...కాళ్లతో నడిపేస్తున్నారు!

చేతికి చిన్న గాయమైతేనే హమ్మో, హుష్షో అనుకుంటాం. పనులన్నీ వాయిదా వేస్తాం. కానీ రెండు చేతుల్లేకపోయినా, కాళ్లతోనే వీళ్లిద్దరూ చక్రాలు తిప్పుతున్నారు. జిలుమోల్‌ మారియట్‌ థామస్‌ కాళ్లతో కారు డ్రైవ్‌ చేస్తుంటే, జెసికా కాక్స్‌ ఏకంగా విమానాన్నే నడిపేస్తున్నారు. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని సవాల్‌ చేసి, సాధ్యంకానిది లేదని నిరూపించారు. తమలాంటివాళ్లకి మార్గదర్శకులయ్యారు...

Updated : 24 May 2024 06:55 IST

చేతికి చిన్న గాయమైతేనే హమ్మో, హుష్షో అనుకుంటాం. పనులన్నీ వాయిదా వేస్తాం. కానీ రెండు చేతుల్లేకపోయినా, కాళ్లతోనే వీళ్లిద్దరూ చక్రాలు తిప్పుతున్నారు. జిలుమోల్‌ మారియట్‌ థామస్‌ కాళ్లతో కారు డ్రైవ్‌ చేస్తుంటే, జెసికా కాక్స్‌ ఏకంగా విమానాన్నే నడిపేస్తున్నారు. పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని సవాల్‌ చేసి, సాధ్యంకానిది లేదని నిరూపించారు. తమలాంటివాళ్లకి మార్గదర్శకులయ్యారు...

లైసెన్స్‌ కోసం ఆరేళ్ల పోరాటం... 

జిలుమోల్‌ మారియట్‌ థామస్‌ది కేరళలోని ఇడుక్కి. రెండు చేతుల్లేకుండా పుట్టిన కూతురి వైకల్యం చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. దాన్నుంచి కోలుకుని ఆమెను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చారు. అయినా జిలుమోల్‌పై విధి చిన్నచూపు చూసింది. తనకు ఏడేళ్లప్పుడు తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారు. జిలుమోల్‌ ఒంటరిగా మిగిలింది. ఆడపిల్ల, అందులోనూ రెండు చేతుల్లేవు. దీంతో ఎవరూ దగ్గరకు తీయలేదు. అప్పుడే ఓ డాక్టరు ముందుకొచ్చి ఆమె సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే తన పనులన్నింటికీ కాళ్లనే ఉపయోగించడం నేర్చుకుంది జిలుమోల్‌. ఎవరిపైనా ఆధారపడకుండా సాధనతో స్వతంత్రంగా జీవించడమెలాగో నేర్చుకుంది.  

కల తీరేలా...

‘చిన్నప్పటి నుంచి ఎవరైనా కారు నడుపుతుంటే నాకూ నడపాలనిపించేది. నా కలను చెబితే అందరూ నవ్వేవారు. నీవల్ల కాదనేవారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా నా ప్రయత్నాలు మొదలుపెట్టా. మాకు దగ్గరలోని డ్రైవింగ్‌ స్కూల్‌కెళ్లి, కారు నడపడం నేర్పమని అడిగా. నా మాటలెవరూ నమ్మలేదు. చివరకు నా పట్టుదల చూసి శిక్షకుడు జోపన్‌ ఒప్పుకొన్నారు. అలాగే నా గురించి తెలిసిన వీఐ ఇన్నొవేషన్స్‌ అనే సంస్థ నిర్వాహకులు మారుతి సెలెరియో కారుకు స్టీరింగ్, గేరు, బ్రేక్స్‌ని కాళ్లతో డ్రైవ్‌ చేయడానికి వీలుగా మార్పులు చేసి అందించారు. అలా శిక్షణ మొదలుపెట్టా’నంటుంది జిలుమోల్‌.

అభ్యంతరంతో...

మొదట కాళ్లతో స్టీరింగ్‌ తిప్పడం జిలుమోల్‌కు కష్టంగా ఉండేది. సాధనతో మూడు నెలలకు గేరు మార్చడం, వాయిస్‌ కమాండ్స్‌తో ఇండికేటర్లు, వైపర్లు, లైట్లు వంటివి ఆపరేట్‌ చేస్తూ వేగంగా కారు నడపడం నేర్చుకుంది. లైసెన్సు కోసం ఇడుక్కి జిల్లా ఆర్టీవో ఆఫీసుకెళ్లింది. అర్హతలేదని థామస్‌ను తిప్పి పంపించేశారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా అదే మాట. దాంతో లైసెన్స్‌ ఇప్పించమని కేరళ హైకోర్టులో ఈమె పిటిషన్‌ వేసింది. కోర్టు జోక్యం చేసుకొని ఆర్టీవో అధికారుల సమక్షంలో జిలుమోల్‌కు డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించింది. అప్పుడు కూడా అభ్యంతరం చెప్పారు.

‘ఈసారి రాష్ట్ర వికలాంగుల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. ఈ విభాగం ఆర్టీవోను సంప్రదించింది. ఆరేళ్ల పాటు ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నా పోరాటానికి ఈ మధ్యే ఫలితం దక్కింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చేతులమీదుగా లైసెన్సు అందుకున్నా. కాళ్లతో కారు నడిపి లైసెన్సు తీసుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచా’నంటున్న జిలుమోల్‌కు బాల్యం నుంచి చిత్రకళపై ఆసక్తి. కాళ్లతోనే పలురకాల చిత్రలేఖనాలకు ప్రాణం పోస్తూ, ఎమ్‌ఎఫ్‌పీఏ అసోసియేషన్‌లో సభ్యురాలైంది. గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొంది యానిమేషన్‌ కెరియర్‌లో అడుగుపెట్టిన 33 ఏళ్ల జిలుమోల్‌... ఎందరికో స్ఫూర్తిదాయకం. 


కృత్రిమ చేతులు వద్దని..!

న్‌వేపై విమానాన్ని ల్యాండ్‌ చేసి బయటకొచ్చింది జెసికా కాక్స్‌. అక్కడున్నవారంతా ఒకటే చప్పట్లు. ఎందుకంటే కేవలం కాళ్లతోనే విమానాన్ని నడిపిన తొలి మహిళగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది మరి. ఈమెది అమెరికాలోని సియెరా విస్టా. పుట్టుకతోనే జెసికాకు చేతుల్లేవు. అయినా అమ్మానాన్న నూరిపోసిన ధైర్యంతో స్కూల్‌కెళ్లేది. తోటి పిల్లల హేళనలను పట్టించుకునేది కాదు. కాళ్లతోనే తన పనులన్నీ చేసుకోవడంతో పాటు చదువులోనూ ముందుండేది. ‘అమ్మానాన్నలు నాకు కృత్రిమ చేతులు ఏర్పాటు చేసినా సౌకర్యంగా లేక వినియోగించలేకపోయా. అన్నయ్య, అక్కలతో కలిపి అమ్మ నన్నూ తైక్వాండో శిక్షణలో చేర్చితే అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. ఈ విద్య నా స్వీయరక్షణకు అవసరమని అమ్మ చెప్పింది. అందుకే ఇందులో నైపుణ్యం సాధించాలనుకున్నా. చేతుల్లేకపోతే ఈ యుద్ధవిద్యలో శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయలేం. అయినా పట్టుదలతో సాధన చేసేదాన్ని. చేతితో ఇవ్వాల్సిన కిక్‌ను నేను కాళ్లతోనే ఇచ్చి ప్రత్యర్థిని మట్టి కరిపించడం నేర్చుకున్నా. ఇందులో బ్లాక్‌బెల్ట్, రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌ని సాధించా’నంటుంది జెసికా. 

శిక్షకులు లేకపోతేనేం...

ఆపై కాళ్లతోనే కారు నడపడం నేర్చుకుంది. లైసెన్స్‌నూ అందుకుంది. స్కూబా డైవింగ్‌లోనూ నైపుణ్యం సాధించింది. ఓసారి ఆకాశంలో ఎగురుతున్న విమానం ఆమెలో ఆసక్తిని కలిగించింది. ఫ్లైట్‌ నడపడంలో శిక్షణ తీసుకోవాలంటే తనకి నేర్పడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాళ్లతో నడప గలిగే సౌకర్యాలున్న విమానం కూడా లేదు. సర్టిఫికేషన్, లైసెన్స్‌ వంటివీ కష్టమే. ‘దాంతో మరింత పట్టుదలగా పరిశోధించడం మొదలుపెట్టా. అలా ఓ ఏడాదికి ఒక వింటేజ్‌ విమానం గురించి తెలిసింది. శిక్షకుడూ దొరికితే ట్రైనింగ్‌లో చేరా. ఆ తర్వాత కాళ్లతోనే నడపగలిగే సాంకేతికతతో ఓ కాలేజీ విద్యార్థుల బృందం ‘ఆర్‌వీ-10’ సింగిల్‌ ఇంజిన్‌ విమానాన్ని నాకోసం తయారుచేసింది. 2004లో దాన్ని తొలిసారిగా నడిపా. పైలట్‌ సర్టిఫికెట్‌ రావడానికి నాలుగేళ్లు పట్టింది. మరో మూడేళ్ల శిక్షణతో 2011లో తేలికపాటి క్రీడా విమానాన్ని నడిపేందుకు అర్హత పొందా’ అంటోంది జెసికా.   

తైక్వాండో ఛాంపియన్‌...

జెసికా ‘రైట్‌ఫుటెడ్‌ ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌’ ఎన్జీవో స్థాపించి, ప్రసంగాలతో తనలాంటివారిలో స్ఫూర్తిని నింపుతోంది. ‘ఎర్కోప్‌ 415-సీ’ విమానంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్జీవో తరఫున కృషి చేస్తోంది. ‘అందరిలాగే నేను కూడా ఉంటే, విమానం నడపడం, తైక్వాండో ఛాంపియన్‌కావడం వంటివి చేసేదాన్ని కాదేమో. వైకల్యంతో పుట్టడంవల్లే ఇవన్నీ సాధిస్తున్నాను. వైకల్యాన్ని అంగీకరించాలి. మనం ప్రత్యేకమని భావించాలి. పుట్టడమెలా ఉన్నా.. సాధనలతో మనల్ని మనం నిరూపించుకుంటే ఇతరులకూ స్ఫూర్తినిచ్చినవాళ్లమవుతా’మని చెప్పే 41 ఏళ్ల జెసికా సైకాలజీలో డిగ్రీ చదివింది. చేతుల్లేకుండా విమానాన్ని నడిపి ప్రపంచంలోనే లైసెన్సు తీసుకున్న తొలి పైలట్‌గానూ నిలిచింది. ‘పైలట్స్‌ ఛాయిస్‌’ వంటి అవార్డులూ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మహిళా ఏవియేటర్‌గా నిలిచింది. ఈమెపై తీసిన ‘రైట్‌ ఫుటెడ్‌’ డాక్యుమెంటరీ పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డులు అందుకుంది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్