TV Stars: ఇరవైల్లోపే లగ్జరీ ఇళ్లకు ఓనర్లైపోయారు!

‘మనకంటూ సొంత ఇల్లుండాలి..’ అనేది ప్రతి ఒక్కరి కల. దీన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతాం.. సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని పక్కన పెడతాం. అలా పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో ఇల్లు కొనుక్కోవాలన్నా ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. అయితే ఈ కలను చాలా చిన్న వయసులోనే నెరవేర్చుకుంది....

Updated : 04 Jan 2023 18:32 IST

(Photos: Instagram)

‘మనకంటూ సొంత ఇల్లుండాలి..’ అనేది ప్రతి ఒక్కరి కల. దీన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతాం.. సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని పక్కన పెడతాం. అలా పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో ఇల్లు కొనుక్కోవాలన్నా ఏళ్లకేళ్లు సమయం పడుతుంది. అయితే ఈ కలను చాలా చిన్న వయసులోనే నెరవేర్చుకుంది బాలీవుడ్‌ బుల్లితెర నటి రుహానికా ధావన్‌. ‘రూహీ భల్లా’గా ఎంతోమందికి సుపరిచితమైన ఈ యంగ్‌ బ్యూటీ.. కేవలం 15 ఏళ్ల వయసులోనే విలాసవంతమైన విల్లా కొనేసింది. తన సుదీర్ఘ ఆశయాల్లో నుంచి ఒకటి నెరవేరిందంటూ.. తాజాగా సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోయిందీ చిన్నది. ఇలా తనొక్కర్తే కాదు.. మరికొంతమంది బుల్లితెర తారలు కూడా చిన్న వయసులోనే ఇంటి యజమానులైపోయారు. మరి, ఇంత చిన్న వయసులోనే సొంతిల్లు వీరికి ఎలా సాధ్యమైంది? వాళ్లనే అడిగేద్దాం రండి..!

‘రూహీ భల్లా’గా పాపులర్!

రుహానికా ధావన్‌.. తన అసలు పేరు కంటే ‘రూహీ భల్లా’గానే ఆమె హిందీ ప్రేక్షకులకు సుపరిచితం. బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులకు ‘యే హై ముహబ్బతే’ (Ye Hai Mohabbatein) సీరియల్‌ గురించి చెప్పక్కర్లేదు. అందులో హీరోహీరోయిన్ల కూతురిగా, ‘రూహీ భల్లా’ పాత్రలో బాల నటిగా మెప్పించింది రుహానికా. తన అందం, క్యూట్‌నెస్‌, ఆకట్టుకునే హావభావాలతో ఉత్తరాదినే కాదు.. దక్షిణాది టీవీ ప్రేక్షకుల ఇంట్లో అమ్మాయిగా ఒదిగిపోయిందీ యంగ్‌ బ్యూటీ. తన నట ప్రతిభతో చిన్న వయసు నుంచే సంపాదన మొదలుపెట్టిన రూహీ.. భవిష్యత్తులో పలు సుదీర్ఘ లక్ష్యాల్ని నిర్దేశించుకుందట! అందులో సొంతిల్లు కూడా ఒకటని, అది ఇటీవలే నెరవేరిందంటూ సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుందీ క్యూట్‌ బ్యూటీ.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..!

తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ చక్కనమ్మ.. ఇటీవలే తాను ముంబయిలో ఇల్లు కొనుగోలు చేసినట్లు అందరితో పంచుకుంది. ‘ఆ దేవుడి దయ, మా అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఇటీవలే నా సొంతింటి కల నెరవేరింది. పదిహేనేళ్ల వయసులోనే కొత్త ఇంటిని కొనుగోలు చేయడం చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తోంది. మా అమ్మానాన్నలు నా ఆసక్తిని గమనించి.. వినోద రంగంలో నన్ను ప్రోత్సహించారు. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేలా వెన్నుతట్టారు. ఇదే ఇంత చిన్న వయసులో నా కల నెరవేర్చుకునేలా చేసింది. ముఖ్యంగా అమ్మకు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే నేను సంపాదించిన ప్రతి పైసా కూడబెట్టి.. వాటిని రెట్టింపు చేసే మార్గాల గురించి తానే ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. ఏదైతేనేం.. నా భవిష్యత్తు లక్ష్యాల్లో ఒకటి నెరవేరింది. ఇంకా చాలా ఆశయాలున్నాయి.. మరింత కష్టపడి వాటినీ చేరుకుంటా. కలలు కంటే సరిపోదు.. వాటిని నెరవేర్చుకునే దిశగా కష్టపడితే ఏదో ఒక రోజు తప్పకుండా అది సాకారమవుతుంది..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ బాల నటి. ఐదేళ్ల వయసులో బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించిన రూహీ.. పలు సీరియల్స్‌తో పాటు రెండు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ‘యే హై ముహబ్బతే’ సీరియల్‌లో నటనకు గాను ‘అత్యంత ప్రాచుర్యం పొందిన బాల నటి’గా ‘ఇండియన్ టెలీ అవార్డు’ కూడా అందుకుందీ క్యూటీ.


18 ఏళ్లకే.. ఇల్లు, కారు!

అందం, అభినయం, తెలివితేటలు, ఫ్యాషన్ సెన్స్‌.. వీటి కలబోతగా బాలీవుడ్‌ బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది యంగ్‌ బ్యూటీ అష్నూర్‌ కౌర్‌. నటనపై ఆసక్తితో ఐదేళ్ల వయసులోనే వినోద రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. ‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’, ‘ప్రాచీ’.. వంటి సీరియల్స్‌తో పాటు ‘మహాభారత్‌’, ‘ఝాన్సీ కీ రాణీ’, ‘పృథ్వీ వల్లభ్‌’.. వంటి పౌరాణికాల్లోనూ నటించి మెప్పించింది. మరోవైపు పలు సినిమా అవకాశాల్నీ అందుకుంటూ ముందుకు సాగుతోన్న ఈ ముద్దుగుమ్మ.. చదువులోనూ టాపర్‌గా నిలుస్తుంటుంది. అంతేకాదు.. 18 ఏళ్ల వయసున్న అష్నూర్‌కు కొన్ని విలువైన ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. గతేడాది ముంబయిలో తన సొంత సంపాదనతో కొనుగోలు చేసిన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ అందులో ఒకటి. తన అభిరుచులకు తగ్గట్లుగా, సమకాలీన ఇంటీరియర్‌ డిజైనింగ్‌ ట్రెండ్స్‌ని జోడిస్తూ కట్టించుకున్న ఈ ఇంటికి సంబంధించిన ఫొటోల్ని అప్పట్లో ఇన్‌స్టా స్టోరీల్లో పోస్ట్‌ చేసిందీ చక్కనమ్మ. ‘సొంత ఇల్లు కొన్నామన్న సంతోషం ముందు అన్నీ దిగదుడుపే! ఇలాంటి విలువైన ఆస్తిపాస్తులు మన ఎదుగుదలను ప్రతిబింబిస్తాయి. కష్టపడితే సాధ్యపడనిది ఏదీ ఉండదు..’ అంటోంది అష్నూర్‌. ఇక ఈ బుల్లితెర బ్యూటీ కార్‌ లవర్‌ కూడా! ఇప్పటికే బెంజ్‌, బీఎండబ్ల్యూ.. వంటి ఖరీదైన కార్లు తన గ్యారేజీలో పార్క్‌ చేసి ఉంటాయట!


అప్పుడు విన్నా.. ఇప్పుడు చూస్తున్నా!

2011లో ‘ఫుల్వా’ అనే హిందీ సీరియల్‌తో బాల నటిగా పరిచయమైంది జన్నత్‌ జుబెయిర్‌. ఆపై వివిధ సీరియల్స్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పుడు సినీ అవకాశాలు కూడా తలుపు తడుతున్నాయి. మరోవైపు ‘ఖత్రోంకే ఖిలాడీ’ అనే రియాల్టీ షో 12వ సీజన్‌లో పాల్గొని.. అత్యధిక పారితోషికం అందుకున్న పోటీదారుగా నిలిచిన జన్నత్.. తన 21వ ఏట సొంతింటి కలను నెరవేర్చుకుంది. ముంబయిలో తన అభిరుచులకు తగ్గట్లుగా ఇంటిని నిర్మించుకుంటున్నానంటూ.. నిర్మాణ దశలో ఉన్న తన కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోల్ని మొన్నామధ్య సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందీ చక్కనమ్మ. ‘కల నిజమైతే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం నేను అదే సంతోషంలో మునిగితేలుతున్నా. పెరిగి పెద్దయ్యే క్రమంలో సొంతిల్లు గురించి ఎన్నో కలలు కన్నా.. ఎన్నో కథలు విన్నా.. అవన్నీ ఇప్పుడు నిజమై నా కళ్ల ముందు సాక్షాత్కరించాయి..’ అంటూ ఆనందంతో ఉప్పొంగిపోతోందీ చిన్నది. ఇక విలాసవంతమైన ఇంటితో పాటు కోట్లు విలువ చేసే మూడు కార్లు కూడా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో ఉన్నాయట!


డ్యాన్సర్‌ టు యాక్టర్!

డ్యాన్స్‌పై మక్కువతో ఎనిమిదేళ్ల వయసులోనే ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌’ అనే రియాల్టీ షోలో పాల్గొంది అవ్‌నీత్‌ కౌర్‌. అయితే అదే సమయంలో ఆమెకు బాలనటిగా బుల్లితెరపై పలు అవకాశాలొచ్చాయి. దాంతో నటనను తన కెరీర్‌గా మలచుకోవాలనుకుంది అవ్‌నీత్‌. ఈ క్రమంలోనే ‘మేరీ మా’ అనే సీరియల్‌తో తన నట జీవితాన్ని ప్రారంభించిందీ యంగ్‌ బ్యూటీ. ఇక అప్పట్నుంచి తన అభినయంతో అటు సీరియల్స్‌లో, ఇటు సినిమాల్లోనూ పలు అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోన్న ఈ ముద్దుగుమ్మ.. తన 20 ఏళ్ల వయసులోనే సొంతింటి కలను సాకారం చేసుకుంది. గతేడాది ముంబయిలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిన ఆమె.. అందులోని ఇంటీరియర్స్‌ని తన అభిరుచులకు, వింటేజ్‌ ట్రెండ్‌కు తగినట్లుగా స్టైలిష్‌గా డిజైన్‌ చేయించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల్ని అప్పట్లో తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇలా ఇంటితో పాటు రేంజ్‌ రోవర్‌ వంటి ఖరీదైన కార్ల కలెక్షన్‌ కూడా ఆమె దగ్గర ఉంది.
వీరితో పాటు బిగ్‌బాస్‌-15 విజేత తేజస్వీ ప్రకాశ్‌, బిగ్‌బాస్‌-14 ఫేమ్‌ నిక్కీ తంబోలీ.. వంటి బుల్లితెర తారలు కూడా చిన్న వయసులోనే సొంతింటి కలను సాకారం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్