Deepika Kumari : అందుకే 20 రోజుల పాపతో ప్రాక్టీస్‌కు వెళ్తున్నా!

సాధారణంగా సుఖ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా.. పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటిదాకా అటు పాపాయిని చూసుకోవడం, ఇటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైనే కొత్తగా తల్లైన మహిళలు ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ క్రమంలో వృత్తిపరమైన విషయాల్ని....

Published : 12 Jan 2023 20:26 IST

(Photos: Instagram)

సాధారణంగా సుఖ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా.. పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటిదాకా అటు పాపాయిని చూసుకోవడం, ఇటు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైనే కొత్తగా తల్లైన మహిళలు ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ క్రమంలో వృత్తిపరమైన విషయాల్ని సైతం పక్కన పెట్టేస్తారు. కానీ ఇందుకు భిన్నంగా.. రోజుల పాపతో ప్రాక్టీస్‌కు హాజరవుతోంది భారత స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి. తల్లైన 20 రోజులకే తన పసి పాపతో మైదానానికి విచ్చేసి.. ఆట పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూనే.. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఇప్పుడే కాదు.. ఏడు నెలల గర్భంతోనూ ఆటను సాధన చేసిందీ ఆర్చర్‌ మామ్. ఈ శ్రమంతా ఇటీవలే ప్రారంభమైన ‘జాతీయ సీనియర్‌ ఆర్చరీ ట్రయల్స్‌’ కోసమే అంటోన్న దీపిక.. ఇందులో అర్హత సాధిస్తే ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడలకు బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది.

క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ ఎంత ముఖ్యమో తెలిసిందే! ఏ దశలోనైనా దీన్ని కోల్పోతే నెలల తరబడి ఆటకు దూరమవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలో వచ్చే అవకాశాల్ని వదులుకోవడానికి ఏ ప్లేయర్‌ సిద్ధంగా ఉండరు. అందుకే తాను బాలింతనని తెలిసినా సాధన మొదలుపెట్టానంటోంది దీపిక. ఇటీవలే తల్లైన ఆమె.. ప్రస్తుతం తన 20 రోజుల పాపను తీసుకొని కోల్‌కతాలోని స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా క్రీడా మైదానంలో జరుగుతోన్న ట్రయల్స్‌కి హాజరవుతోందీ ఆర్చరీ క్వీన్.

అందుకే పాపతో మైదానానికి..!

జనవరి 10-17 వరకు కొనసాగుతోన్న ఈ ట్రయల్స్‌లో అర్హత సాధించి ప్రపంచ కప్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోన్న దీపిక.. వచ్చే ఏడాది జరగబోయే ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఈ ఏడాది ఎంతో కీలకమంటోంది.
‘గర్భిణిగా ఉన్నప్పుడు ఏడు నెలల దాకా సాధన ఆపలేదు. అయితే ఆ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందుకే మూడు నెలల పాటు ఆటకు విరామమివ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ప్రపంచ వేదికపై పోటీ పడే అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ నేను ట్రయల్స్‌లో పాల్గొనకపోతే ఈ ఏడాదంతా జట్టుకు దూరంగా ఉండాల్సి వస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడాలంటే ఈ ఏడాది మరింత కీలకం. అందుకే 20 రోజుల పాపను తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టా. నాది సుఖ ప్రసవమే అయినా.. ఈ సమయంలో పోటీలకు సిద్ధమవడం కాస్త కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే కొన్నిసార్లు పాప రాత్రంతా మెలకువతోనే ఉంటుంది. అలాంటప్పుడు మూడు నాలుగ్గంటలే నిద్ర పోవాల్సి వస్తుంది. అలాగని పాపను ఇంట్లో వదిలేద్దామంటే తల్లిపాల కోసం ఏడుస్తోంది. అందుకే ఎక్కడికెళ్లినా పాపను వెంటపెట్టుకొనే వెళ్తున్నా. ప్రస్తుతానికి ఇది కష్టంగానే ఉన్నా.. తాను పెద్దయ్యే కొద్దీ సులభమవుతుందనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మా అత్తింటి వారి సహాయసహకారాలతోనే మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నా..’ అంటూ తన ప్రసవానంతర జర్నీ గురించి చెప్పుకొచ్చిందీ ఆర్చర్‌ మామ్.

అమ్మ కోరిక కాదని..!

ప్రస్తుతం మహిళల విభాగంలో ప్రపంచ నం.2గా కొనసాగుతోన్న దీపిక.. తన చిన్నతనంలో ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించింది. ఆమె తండ్రి ఆటో డ్రైవర్‌. తల్లి రాంచీ మెడికల్‌ కళాశాలలో నర్సుగా పనిచేసేది. అయితే తన కూతురిని డాక్టర్‌ చేయాలనుకుంది దీపిక తల్లి. కానీ దీపికకు ఆర్చరీ అంటే ఇష్టం. ఈ మక్కువతోనే అమ్మ కోరిక కాదని.. తన ఆసక్తిపై దృష్టి పెట్టిందామె. 11 ఏళ్ల వయసులోనే లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం నేర్చుకుంది దీపిక. అయితే పోషకాహార లోపంతో ఫిట్‌నెస్‌లో వెనకబడిన ఆమెకు టాటా ఆర్చరీ అకాడమీలో చేరేందుకు చోటు దక్కలేదు. దీంతో అర్జున్‌ ఆర్చరీ అకాడమీలో చేరింది దీపిక. పట్టుదలతో తన నైపుణ్యాల్ని పెంచుకుంటూ పోయిన ఆమె.. ఏడాది తిరక్కముందే టాటా ఆర్చరీ అకాడమీలో శిక్షణకు ఎంపికైంది. ఇక 15 ఏళ్ల వయసులోనే ‘యువ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌’ గెలుచుకున్న ఈ ఆర్చరీ క్వీన్‌.. ఆపై దిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు ముద్దాడింది. ఇక 2016 రియో ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు అందుకున్న దీపిక.. ఆపై జాతీయ, అంతర్జాతీయ వేదికల పైనా సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది జరగబోయే ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానంటోందీ భారత ఆర్చర్.

అతాను మనసుకు ‘గురి’పెట్టి..!

లక్ష్యానికి గురి పెట్టి ఎన్నో పతకాలు కొల్లగొట్టిన దీపిక.. తన ఆటతీరుతో తోటి ఆర్చర్‌ అతాను దాస్‌ మనసును కూడా దోచేసుకుంది. టాటా ఆర్చరీ అకాడమీలోనే వీరిద్దరి ప్రేమకథ మొదలైంది. అయితే ‘అతానుకు హిందీ రాదు.. నాకు హిందీ మాత్రమే వచ్చు. దీంతో తను నాతో మాట్లాడేవాడు కాదు..’ అంటూ తామిద్దరి మధ్య భాష అడ్డుగోడగా నిలిచిందంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది దీపిక. ‘ఇద్దరం కలిసి షాపింగ్‌కి వెళ్లేవాళ్లం.. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. అయినా తమ మనసులోని ఫీలింగ్‌ని బయటపెట్టడానికి చాలా కాలం పట్టిందం’టోన్న ఈ జంట.. తమ ప్రేమబంధం గురించి అందరితో పంచుకుంది మాత్రం 2018లో నిశ్చితార్థం చేసుకున్న తర్వాతే! ఇక 2020 జూన్‌లో పెళ్లితో ఒక్కటైన ఈ ఆర్చరీ కపుల్‌.. టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో ఒకే క్రీడా విభాగంలో పాల్గొన్న తొలి భారతీయ జంటగా నిలిచింది.

దీపిక జీవిత కథ ఆధారంగా ‘లేడీస్‌ ఫస్ట్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కింది. దీనికి 16కు పైగా అంతర్జాతీయ అవార్డులు దక్కడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్