అతివల కోసం.. ఆమె!

‘మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమ’న్నారు కోఫీ అన్నన్‌. ఈ మాటల్నే స్ఫూర్తిగా తీసుకొని మహిళల అభ్యున్నతికి పాటుపడుతోంది ప్రాచీ కౌశిక్‌. గ్రామీణ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె చిన్న వయసు నుంచే వివక్షను, ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంది. సమర్థత ఉన్నా సామాజిక ఒత్తిళ్ల కారణంగా మహిళలు ఎదగలేకపోతున్నారన్న విషయాన్ని గుర్తించింది...

Updated : 15 Feb 2024 13:30 IST

(Photos: Instagram)

‘మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమ’న్నారు కోఫీ అన్నన్‌. ఈ మాటల్నే స్ఫూర్తిగా తీసుకొని మహిళల అభ్యున్నతికి పాటుపడుతోంది ప్రాచీ కౌశిక్‌. గ్రామీణ ప్రాంతంలో పుట్టిపెరిగిన ఆమె చిన్న వయసు నుంచే వివక్షను, ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంది. సమర్థత ఉన్నా సామాజిక ఒత్తిళ్ల కారణంగా మహిళలు ఎదగలేకపోతున్నారన్న విషయాన్ని గుర్తించింది. స్త్రీలపై సమాజంలో పాతుకుపోయిన ఇలాంటి అసమానతల్ని కూకటి వేళ్లతో పెకిలించాలని నిర్ణయించుకుందామె. ఈ ఆలోచనతోనే మహిళా సాధికారతే ముఖ్యోద్దేశంగా ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది ప్రాచీ. ఈ వేదికగా నెలసరి ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన, మహిళా హక్కులు.. ఇలా ఎన్నో అంశాల్లో మహిళలకు చేయూతనందిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతోన్న ఈ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌ స్ఫూర్తిదాయక జర్నీ ఇది!

చదవకూడదన్నారు!
ప్రాచీది హరియాణాలోని జజ్జర్‌ అనే ప్రాంతం. చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థికంగా వెనకబడిన కుటుంబం కావడంతో పలు ఇబ్బందుల్ని ఎదుర్కొందామె. అయినా ఎలాగోలా పది పూర్తిచేసిన ఆమెపై ‘ఇక చదివింది చాలు.. పెళ్లి చేసుకో’మని ఒత్తిడి తెచ్చేవారు ఆమె కుటుంబ సభ్యులు. అయినా తాను ఉన్నత చదువులవైపే మొగ్గుచూపింది.
‘మా కుటుంబాల్లో అమ్మాయిలు పైచదువులు చదవడం నిషిద్ధం. ఎందుకంటే ఎక్కువగా చదువుకుంటే పెళ్లి కొడుకుని వెతకడం కష్టమవుతుందనేది మా ఇంట్లో పెద్దల అభిప్రాయం. మరో భయం ఏంటంటే.. అమ్మాయిలు గడప దాటితే రక్షణ ఉండదని వారు భావించేవారు. ఇలా ఈ భయాల మధ్యే మా కుటుంబాల్లోని చాలామంది అమ్మాయిలు పదితో చదువు ఆపేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. ఎలాగైనా ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నా. అమ్మానాన్నలకు నన్ను చదివించే స్థోమత లేదని నాకు తెలుసు. అందుకే చుట్టుపక్కల ఉండే పిల్లలకు ట్యూషన్లు చెబుతూ వచ్చిన డబ్బుతో ఫీజు కట్టి చదువుకున్నా. అలా డిగ్రీ, ఆపై దిల్లీ యూనివర్సిటీలో ‘పొలిటికల్‌ సైన్స్‌-హ్యూమన్‌ రైట్స్‌’లో మాస్టర్స్‌ పూర్తిచేశా..’ అంటూ తానెదుర్కొన్న వివక్ష గురించి చెబుతున్నారు ప్రాచీ.

సోషల్‌ వారియర్‌!

ప్రాచీకి సామాజిక స్పృహా ఎక్కువే. సమాజంలో ఉన్న తనలాంటి అమ్మాయిలు/మహిళల అభ్యున్నతికి పాటుపడాలని చిన్నతనంలోనే నిశ్చయించుకున్న ఆమె.. అటు చదువు కొనసాగిస్తూనే ఇటు దిల్లీలోని పలు స్థానిక స్వచ్ఛంద సంస్థల్లో వలంటీర్‌గా సేవలందించేది. ఈ క్రమంలో గ్రామీణ మహిళలకు శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందించడంతో పాటు ప్రభుత్వం చేపట్టే పలు మహిళా సాధికారతకు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ భాగమైందామె.

‘ఈ సమాజంలో మహిళల అభివృద్ధికి వారిపై ఉన్న వివక్ష, అసమానతలు ఆటంకాలుగా మారుతున్నాయన్న విషయాలు స్వీయానుభవాలతో తెలుసుకున్నా. అందుకే ఈ వివక్షను అంతమొందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే కొన్నేళ్ల పాటు ఎన్జీవోలతో కలిసి పనిచేయడం వల్ల మహిళా సాధికారతకు అడ్డుపడుతోన్న అంశాల గురించి లోతైన అవగాహన వచ్చింది. అలాగే ఈ సేవల్ని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతోనే 2016లో ‘వ్యోమిని’ పేరుతో ఓ సామాజిక సంస్థను నెలకొల్పా. మహిళల్లో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలకు పదునుపెట్టి.. వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చారు ప్రాచీ.

నెలసరి పరిశుభ్రతే ధ్యేయంగా!

తన సామాజిక సంస్థ వేదికగా మహిళలకు విభిన్న అంశాల్లో నైపుణ్యాలు నేర్పుతున్నారు ప్రాచీ. ఈ క్రమంలోనే నెలసరి పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. వారి చేతే పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్లూ తయారుచేయిస్తున్నారామె.

‘గ్రామీణ ప్రాంత మహిళలకు నెలసరి పరిశుభ్రతపై సరైన అవగాహన లేదు.. ఆర్థికంగానూ వారు వెనకబడి ఉన్నారు. అందుకే ఈ రెండు అంశాల్ని ముడిపెట్టి వారి అభ్యున్నతికి పాటు పడాలనుకున్నా. ఈ ఆలోచనతోనే స్థానికంగా ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌ని ఏర్పాటుచేసి.. మహిళలకు పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్లు, డైపర్ల తయారీలో శిక్షణ ఇచ్చాను. దీనివల్ల ప్రత్యక్షంగా వారిలో నెలసరిపై అవగాహన పెరగడంతో పాటు పరోక్షంగా వారు ఆర్థిక స్వేచ్ఛను సాధించేలా చేయగలిగాను. ఇలా శిక్షణ తీసుకున్న కొంతమంది సొంతంగా వ్యాపారాలూ ప్రారంభించారు.. మరికొందరు తయారీ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు..’ అంటోన్న ప్రాచీ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అక్కడి విద్యార్థులకూ నెలసరి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాదు.. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లోనూ శ్యానిటరీ ఉత్పత్తుల్ని నిర్వీర్యం చేసే వెండింగ్‌ మెషీన్లు ఏర్పాటుచేస్తూ.. పర్యావరణాన్నీ పరిరక్షిస్తున్నారు.

వారికి అండగా!

గ్రామీణ మహిళల్ని సాధికారత దిశగా నడిపించాలన్న ముఖ్యోద్దేశంతో వారికి విభిన్న జీవన నైపుణ్యాల్ని నేర్పిస్తూ ఆర్థిక స్వావలంబన కల్పిస్తోన్న ప్రాచీ.. మరోవైపు మురికి వాడల్లో ఆరోగ్య శిబిరాలూ నిర్వహిస్తున్నారు. తద్వారా అక్కడి మహిళల్లో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారు. అంతేకాదు.. బాలికా విద్య, బాల్య వివాహాల నిర్మూలనకూ కృషి చేస్తున్నారామె. మరోవైపు గృహహింస బాధితులకు సంబంధిత నిపుణుల సహకారంతో న్యాయ సహాయమూ అందిస్తున్నారు ప్రాచీ.

‘కొంతమంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువుకోవడానికి అనుమతించరు.. మరికొందరు అమ్మాయిల్ని బాల్య వివాహాల్లోకి నెట్టాలనుకుంటారు. ఇంకొందరు మహిళలు గృహహింస ఊబిలో చిక్కుకొని చితికిపోతుంటారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎదుర్కొనే సమస్యలెన్నో! వీటి మూలంగా వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోయిన వారూ ఉంటారు. అలాంటి వారికి నిపుణుల కౌన్సెలింగ్‌ మేలు చేస్తుంది.. తిరిగి వారు కోలుకొని కొత్త జీవితం ప్రారంభించేందుకు దోహదం చేస్తుంది. అందుకే మా సంస్థ ద్వారా అలాంటి వారి కోసం ప్రత్యేకమైన నిపుణుల కౌన్సెలింగ్ సెషన్స్‌ ఏర్పాటుచేస్తున్నా.. న్యాయ పరమైన సలహాలు అందిస్తున్నా. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం ప్రోది చేస్తున్నా..’ అంటూ చెబుతున్నారు ప్రాచీ. ఇలా తన సామాజిక సంస్థ ద్వారా మహిళల్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న ఈ సోషల్‌ వారియర్‌.. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల మహిళలకు తన సేవల్ని విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్