29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!

పర్యావరణాన్ని కలుషితం చేసే వాటిలో ప్లాస్టిక్‌ తర్వాత స్థానం ఫ్యాషన్ ఉత్పత్తులదే! ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య పరిశ్రమగా దీన్ని చెబుతారు. అయితే పర్యావరణ ప్రేమికురాలైన రియా మజుందార్‌కు ఇది మింగుడు పడలేదు.

Published : 24 Apr 2024 13:10 IST

(Photos: Instagram)

పర్యావరణాన్ని కలుషితం చేసే వాటిలో ప్లాస్టిక్‌ తర్వాత స్థానం ఫ్యాషన్ ఉత్పత్తులదే! ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య పరిశ్రమగా దీన్ని చెబుతారు. అయితే పర్యావరణ ప్రేమికురాలైన రియా మజుందార్‌కు ఇది మింగుడు పడలేదు. అందుకే ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు తన వంతుగా కృషి చేయాలనుకుందామె. ఈ ఆలోచనే ఓ స్విమ్‌వేర్‌ బ్రాండ్‌కు తెరతీసేలా చేసింది. ఈ వేదికగా ప్రస్తుతం ప్లాస్టిక్‌ బాటిళ్లు, సముద్రపు వ్యర్థాలతో పర్యావరణహిత స్విమ్‌వేర్‌ దుస్తుల్ని రూపొందిస్తోన్న రియా సక్సెస్‌ జర్నీ ఇది!

గోవాకు చెందిన రియాది ఆర్మీ నేపథ్యమున్న కుటుంబం. చిన్న వయసు నుంచే ఆమెకు పర్యావరణ స్పృహ ఎక్కువ. ఫ్యాషన్‌ రంగమన్నా మక్కువే! తన తండ్రి ఉద్యోగ బదిలీల రీత్యా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నివసించిన ఆమె.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిలిచే ఫ్యాషన్ సంస్కృతుల పట్ల ఆకర్షితురాలైంది. విభిన్న రంగుల్లో, డిజైన్లలో తీర్చిదిద్దిన దుస్తులు ఆమెకు ఫ్యాషన్‌పై మరింత ఇష్టం పెరిగేలా చేశాయి.

అలా వచ్చింది ఆలోచన!

అయితే ఇదే క్రమంలో ఫ్యాషన్‌ గురించి మరింత లోతుగా శోధించిన రియాకు ఈ రంగం గురించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. పర్యావరణాన్ని కలుషితం చేస్తోన్న రంగాల్లో ఫ్యాషన్ రంగం ముందు వరుసలో ఉందని గ్రహించిన ఆమె.. ఈ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు తన వంతుగా కృషి చేయాలనుకుంది. అలాగే ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లలో మామూలు దుస్తులు తప్ప స్విమ్‌వేర్‌ దుస్తులు మార్కెట్లో ఎక్కడా ఆమెకు కనిపించలేదు. అందుకే ఈ రెండింటినీ ముడిపెట్టి తానే స్వయంగా ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌ని ప్రారంభించాలనుకుందామె. ఈ ఆలోచనే 2022లో ‘గోయా స్విమ్‌ కంపెనీ’కి తెరతీసింది. పర్యావరణహితమైన స్విమ్‌వేర్‌ దుస్తుల్ని రూపొందించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇందుకోసం సముద్రాల్లో నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలు/బాటిల్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయా పారిశ్రామిక సంస్థల నుంచి వ్యర్థాల్నీ సేకరిస్తోందామె.

29 బాటిళ్లు.. ఒక స్విమ్‌సూట్!

ఇలా సేకరించిన వ్యర్థాల్ని స్విమ్‌సూట్‌గా మార్చడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది రియా. ఇందులో భాగంగానే ముందుగా వ్యర్థాల్ని కరిగించి రెజిన్‌ రూపంలోకి తీసుకొస్తుంది.. దీన్ని కరిగించి ద్రవ పాలిమర్‌గా, ఆపై ఫైబర్‌గా మారాక.. దీన్నుంచి స్పన్ క్లాత్‌, ఆఖర్లో యార్న్‌ మెటీరియల్‌గా ఇది రూపాంతరం చెందుతుంది. ఈ మెటీరియల్‌తో స్విమ్‌సూట్‌ తయారుచేస్తోంది రియా.

‘సుమారు 29 ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను అధునాతన సాంకేతిక పద్ధతిలో రీసైక్లింగ్ చేస్తే వచ్చే మెటీరియల్‌తో ఒక్క స్విమ్‌సూట్‌ తయారుచేయచ్చు. అంటే.. 29 ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో పర్యావరణానికి జరిగే నష్టాన్ని తగ్గించడమే కాదు.. ఫ్యాషనబుల్‌గానూ కనిపించేయచ్చు. ప్రస్తుతం మా వద్ద బికినీలు, సింగిల్‌ పీస్‌ స్విమ్‌సూట్స్‌, లాంగ్‌ స్లీవ్స్‌ బికినీ సూట్స్‌, పురుషుల కోసం స్విమ్‌ షార్ట్స్‌.. వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. ఆయా కాలాలకు తగినట్లుగా, సౌకర్యవంతంగా ఉండేలా వీటిని తయారుచేస్తున్నాం. అంతేకాదు.. ఆకర్షణీయమైన రంగులు, వివిధ ప్రింట్స్, మోటీఫ్స్‌తో హంగులద్దిన స్విమ్‌వేర్‌ కూడా మా వద్ద దొరుకుతోంది..’ అంటోందీ ఫ్యాషన్‌ క్వీన్.

విదేశాల్లోనూ పాపులర్!

ప్రస్తుతం దేశంలోనే పర్యావరణహిత స్విమ్‌వేర్‌ దుస్తుల్ని రూపొందిస్తోన్న ఏకైక సంస్థగా పేరుపొందిన ఈ కంపెనీ.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు తమ ఉత్పత్తుల్ని షిప్పింగ్‌ చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. అనన్యా పాండే వంటి తారలూ ప్రస్తుతం ఈ స్విమ్‌సూట్‌ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని స్టైల్స్, మోడల్స్లో సౌకర్యవంతమైన స్విమ్‌వేర్‌, పిల్లల కోసం ప్రత్యేక స్విమ్‌వేర్‌ ఉత్పత్తుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానంటున్న ఈ బిజినెస్‌ లేడీ.. తద్వారా ఇటు అతివల స్టైల్‌ స్టేట్‌మెంట్‌ని పెంచడంతో పాటు.. అటు పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గించేందుకు కంకణం కట్టుకుంది. పుణేలోని ‘బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మోడ్రన్‌ మేనేజ్‌మెంట్‌’ నుంచి మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పూర్తిచేసిన రియా.. వ్యాపారం ప్రారంభించడానికి ముందు దాదాపు 14 ఏళ్ల పాటు ప్రముఖ సంస్థల సేల్స్‌ విభాగాల్లో పని చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్