ఆ అబ్బాయిని చూశాకే ‘లక్ష్యం’ తెలిసింది!

‘మార్పు మనతోనే మొదలవ్వాలి..’ అనుకునే వారు చాలామందే! కానీ దీన్ని ఆచరణలో పెట్టే వాళ్లు మాత్రం చాలా తక్కువమందే ఉంటారు. దిల్లీకి చెందిన రాశీ ఆనంద్‌ ఈ కోవకే చెందుతారు. సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలని పరితపించిన ఆమె తన ఉద్యోగాన్ని వదులుకోవడానికీ....

Published : 07 Oct 2022 21:16 IST

(Photos: Instagram)

‘మార్పు మనతోనే మొదలవ్వాలి..’ అనుకునే వారు చాలామందే! కానీ దీన్ని ఆచరణలో పెట్టే వాళ్లు మాత్రం చాలా తక్కువమందే ఉంటారు. దిల్లీకి చెందిన రాశీ ఆనంద్‌ ఈ కోవకే చెందుతారు. సమాజం కోసం తన వంతుగా ఏదైనా చేయాలని పరితపించిన ఆమె తన ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడలేదు. ఈ క్రమంలోనే ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. వీధి బాలలు, పేద చిన్నారులకు విద్యాదానం చేస్తోంది. మరోవైపు మహిళలకు ఉపాధి మార్గాలు చూపిస్తూ.. వారికీ ఆర్థిక స్వేచ్ఛను అందిస్తోంది. ఏ పనైనా ప్రారంభించే ముందు ఓ స్పష్టత ఉండాలని తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోన్న రాశి మనసు సేవ వైపు ఎలా మళ్లిందో తెలుసుకుందాం రండి..

దిల్లీకి చెందిన రాశీ ఆనంద్‌ పాఠశాల విద్యాభ్యాసమంతా రాంచీలోనే సాగింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ సేవామూర్తులే! ఈ క్రమంలోనే స్థానిక స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించేవారు. చిన్నతనం నుంచీ ఇలా వాళ్లిద్దరినీ దగ్గర్నుంచి గమనించిన రాశి కూడా పెద్దయ్యాక సేవ చేయాలనే సంకల్పించుకుంది. అంతేకాదు.. టీనేజ్‌లోనే తన తల్లితో కలిసి పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొందామె.

ఆ అబ్బాయిని చూసి..

తనను సమాజ సేవ వైపు మళ్లించిన సంఘటన గురించి చెబుతూ- ‘చదువు పూర్తయ్యాక ఘజియాబాద్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేరాను. ఓరోజు ఆ పాఠశాల బయట ఓ బాల కార్మికుడిని చూశాను. చేతులు, కాళ్లకు గాయాలై రక్తం కారుతున్నా.. తన పని తాను చేసుకుపోవడం చూసి నా మనసు చలించిపోయింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి దుస్థితి రావడానికి కారణం.. అతను చదువుకోకపోవడమే.. అని గుర్తించిన నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల దాకా ఆ సంఘటన నా కళ్ల ముందే మెదిలేది. ఈ క్రమంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి.. నా మనసును సమాజ సేవ వైపు మళ్లించాను. ఈ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘లక్ష్యం’ అనే స్వచ్ఛంద సంస్థ..’ అని పంచుకుంది రాశి.

‘లక్ష్యా’నికి చేరువ చేసేలా..!

2012లో ప్రారంభమైన ఈ సంస్థ.. పేద పిల్లలకు విద్యనందించడంతో పాటు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే ముఖ్యోద్దేశంగా ముందుకు సాగుతోంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు, వాళ్లు శారీరకంగా, మానసికంగా, సమాజ పరంగా.. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందీ ఎన్జీవో. అలాగే మహిళా సాధికారత కోసం, ఆర్థికంగా వాళ్లు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వీలుగా.. వివిధ నైపుణ్యాల్లో వారికి శిక్షణ అందిస్తోంది.

‘ఆర్థిక/సామాజిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చాలామంది దీన్ని చేరుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ల లక్ష్యానికి వాళ్లను చేర్చడమే మా ప్రయత్నం. ఇందుకోసం మేం వివిధ కార్యక్రమాలు నిర్వహించడమే కాదు.. ఇతర స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి పనిచేస్తున్నాం.. వాటిలో సల్మాన్‌ నెలకొల్పిన ‘బీయింగ్‌ హ్యూమన్‌’ కూడా ఒకటి. ఇది నిజంగా ఓ మధురానుభూతి! మొత్తానికి ఈ పదేళ్ల కాలంలో సుమారు పది లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకురాగలిగాం..’ అంటోంది రాశి.

వాళ్ల ప్రోత్సాహంతోనే..!

ఇంట్లో వాళ్ల ప్రోత్సాహం ఉంటే మహిళలు ఏదైనా సాధించగలరు.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానే అంటోంది రాశి. ‘నేను ఉద్యోగం వదిలేసి సేవ వైపు వస్తానంటే అమ్మానాన్న ఆనందంగా ఒప్పుకున్నారు. ఇక పెళ్లయ్యాక భర్త, అత్తమామలూ నన్ను ప్రోత్సహించారు. ఎన్జీవో ప్రారంభించడానికి మొదట నా తల్లిదండ్రులు నాకు కొంత మొత్తం సహాయం చేశారు. ఆపైనా దీన్ని నడిపించడానికి వాళ్లపై ఆధారపడాలనుకోలేదు. అందుకే నిధుల సమీకరణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టా. ‘ఫ్యాషన్‌ ఫర్‌ కాజ్‌’ ఫ్యాషన్‌ షో అందులో ఒకటి. ఇలా వచ్చిన నిధుల్ని పిల్లల చదువు కోసం వెచ్చిస్తున్నా. ఇక మహిళా సాధికారత కోసం ఇటీవలే ‘ట్రావెల్‌ ఫర్‌ ఛేంజ్‌’, ‘హోలీ కౌ లక్ష్యం’.. వంటి కార్యక్రమాల్ని ప్రారంభించాం. ఇవన్నీ విజయవంతమవడం, ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడం సంతోషంగా అనిపిస్తోంది. మనం చేయాలనుకునే పనిపై స్పష్టత ఉండి, తగిన పరిశ్రమ చేస్తే.. సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు.. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే..’ అంటూ తన మాటలతోనూ ఈ సమాజంలో స్ఫూర్తి నింపుతోందీ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌. తన సేవలకు గుర్తింపుగా పలు అవార్డులు సైతం అందుకుందామె.

ప్రస్తుతం ఓ బిడ్డకు తల్లిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన సేవతోనూ ఎంతోమందిలో మార్పు తీసుకొస్తోన్న రాశి జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్