అందుకే ఈ టీచరమ్మంటే ఆ పిల్లలకు ఎంతో ఇష్టం!

‘స్కూల్లో పిల్లలకు టీచర్‌ అంటే భయం ఉండాలి.. అప్పుడే క్రమశిక్షణతో ఉంటారు.. చదువులోనూ రాణిస్తారు..’ అనుకుంటారు చాలామంది. కానీ రాయ్‌పూర్‌కు చెందిన జాహ్నవీ యదు అనే టీచర్‌ మాత్రం ఇందుకు భిన్నం

Updated : 26 Aug 2023 17:47 IST

‘స్కూల్లో పిల్లలకు టీచర్‌ అంటే భయం ఉండాలి.. అప్పుడే క్రమశిక్షణతో ఉంటారు.. చదువులోనూ రాణిస్తారు..’ అనుకుంటారు చాలామంది. కానీ రాయ్‌పూర్‌కు చెందిన జాహ్నవీ యదు అనే టీచర్‌ మాత్రం ఇందుకు భిన్నం! పిల్లల్ని భయంతో కాదు.. స్నేహంతో ఆకట్టుకోవాలంటారామె. ఈ స్నేహపూర్వక వాతావరణాన్ని తన తరగతిలో సృష్టించడానికే ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే వారానికోసారి పిల్లల్లాగే తానూ యూనిఫాంలో రావాలని నిర్ణయించుకున్నారు. మాట వరసకే కాదు.. దాన్ని అమలు చేస్తూ.. ఆ బడి పిల్లల ఫేవరెట్‌ టీచర్‌గా మారిపోయారు జాహ్నవి.

జాహ్నవి ప్రస్తుతం రాయ్‌పూర్‌లోని గోకులం వర్మ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో విధుల్లో చేరిన ఆమె.. ఆది నుంచే పిల్లలతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ఇలా ఆమె ఫ్రెండ్లీ నేచర్‌కు ఆ బడి పిల్లలూ త్వరగా ఆకర్షితులయ్యారు. ఆమె తరగతి అంటే ఆసక్తి చూపడం ప్రారంభించారు.

ప్రతి శనివారం యూనిఫాంలోనే..!

సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో చాలావరకు పేద కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. వారి తల్లిదండ్రులకూ అక్షర జ్ఞానం ఉండదు. దీంతో ఆ పిల్లల్లోనూ సరైన క్రమశిక్షణ ఉండదు. అందుకే తన విద్యార్థులకు చదువు కంటే ముందు క్రమశిక్షణ నేర్పాలనుకున్నట్లు చెబుతున్నారు జాహ్నవి.

‘తల్లిదండ్రుల నిరక్షరాస్యత, ఇంట్లోనూ సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో.. మొదట్లో ఈ చిన్నారుల డ్రస్సింగ్ సరిగ్గా ఉండేది కాదు.. ఒకవేళ యూనిఫాం వేసుకున్నా.. అది చిరిగిపోయి, మాసినట్లుగా కనిపించేది. అంతేకాదు.. టీచర్‌ మాట వినకుండా, పట్టించుకోకుండా తెగ అల్లరి చేసేవారు. ఇలాంటప్పుడు వారిని బెదిరిస్తే మరింత మొండిగా తయారవుతారు. అందుకే వారితో స్నేహం చేస్తూనే క్రమశిక్షణ నేర్పాలనుకున్నా. ఈ క్రమంలో వాళ్లను నా దారిలోకి తెచ్చుకోవడం కంటే.. నేనే వాళ్ల దారిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అందుకే యూనిఫాం ఆలోచన చేశా. ఈ విద్యా సంవత్సరం ఆది నుంచే దీన్ని ఆచరణలో పెడుతున్నా. ప్రతి శనివారం పిల్లల్లాగే యూనిఫాం వేసుకొని స్కూల్‌కు వస్తున్నా..’ అంటూ తన ఆలోచన గురించి పంచుకున్నారీ టీచరమ్మ.

భయం లేకుండా బడికి రావాలని..!

సాధారణంగా స్కూల్‌ అనగానే పిల్లల్లో ఒక రకమైన నీరసం, భయం ఆవహిస్తాయి. ఈ భయాన్ని దూరం చేసి బడికి రావాలన్న ఆసక్తిని పిల్లల్లో పెంచడంలో సఫలమయ్యానంటున్నారు జాహ్నవి.

‘చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్లమని మొండికేస్తుంటారు. కానీ నేను అలా కాదు.. చిన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా బడికి వెళ్లేదాన్ని. ఒక్క రోజూ స్కూల్‌ మానకపోయేదాన్ని. ఎందుకో స్కూల్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లనిపించేది. ఈ మక్కువే నన్ను టీచర్‌ ఉద్యోగంలో చేరేలా ప్రేరేపించింది. ఇక నాలాగే నా విద్యార్థులూ ఆసక్తిగా బడికి వచ్చేలా చేయాలనుకున్నా. నేను యూనిఫాం ధరించి స్కూల్‌కు వచ్చిన తొలినాళ్లలో పిల్లలు ‘టీచర్‌.. మీరు ఎందుకు యూనిఫాం వేసుకొని బడికి వస్తున్నారు?’ అనడిగేవారు. అప్పుడు నేను.. ‘మనమంతా ఒక జట్టు.. నేను కూడా మీ తోటి విద్యార్థినిని.. మీ ఫ్రెండ్‌ని!’ అని చెప్పాను. ఇక అప్పట్నుంచి వాళ్లు.. నన్ను అనుసరించడం మొదలుపెట్టారు. స్కూల్‌ యూనిఫాంను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రోజూ బడికి రావడం, తమ గురించిన ప్రతి విషయాన్నీ ఓ ఫ్రెండ్‌లా నాతో పంచుకోవడం, నేను చెప్పిన పాఠాలన్నీ చక్కగా నేర్చుకోవడం.. ఇలా వారిలో చాలా మార్పులే గమనించా..’ అంటున్నారామె.

పిల్లల్లో ఒకరిగా..!

స్కూల్‌ యూనిఫాంలో బడికి రావడం, పిల్లల్లో క్రమశిక్షణ నేర్పడమే కాదు.. పిల్లలతో కలిసి కూర్చోవడం, పాఠం పూర్తయ్యాక.. ఒక్కొక్కరితో పునఃశ్చరణ చేయించడం, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన పద్ధతుల్లో పాఠాలు బోధించడం.. ఇలా అసలైన గురువుకు మరో రూపంగా నిలుస్తున్నారు జాహ్నవి. ప్రస్తుతం గోకులం వర్మ పాఠశాలలో 1-5 వ తరగతి వరకు సుమారు 350 మంది పిల్లలున్నారు. వారంతా క్రమం తప్పకుండా బడికి వచ్చేలా ప్రోత్సహించడంలో, క్రమశిక్షణ నేర్పడంలో సఫలమయ్యానంటున్నారీ టీచరమ్మ. ఈ క్రమంలో- ‘తనే నిజమైన ఎడ్యుకేటర్‌’, ‘పిల్లల బంగారు భవితకు ఆశాకిరణం ఆమె!’.. అంటూ చాలామంది ఈ టీచరమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్