అలా ఉక్కు మహిళైంది!

భర్త కనుసన్నల్లో బిక్కుబిక్కుమంటూ గడిపేదామె. అలాంటిది ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయి మంచానికే పరితమయ్యే పరిస్థితి. పిల్లలు పుట్టే ప్రసక్తే లేదు.

Published : 10 Feb 2023 00:47 IST

భర్త కనుసన్నల్లో బిక్కుబిక్కుమంటూ గడిపేదామె. అలాంటిది ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయి మంచానికే పరితమయ్యే పరిస్థితి. పిల్లలు పుట్టే ప్రసక్తే లేదు. భయపడ్డట్టుగానే భర్త వదిలేశాడు. నచ్చిన పనీ చేయలేదు. బతికే వృథా అనుకుంటున్న సమయంలో తనను తాను మార్చుకుంది మునిబా. ప్రపంచ వేదికలపై నిల్చొని ఎందరిలోనో స్ఫూర్తినీ రగుల్చుతోంది. ఆమె ప్రయాణమిది!

‘భయమేస్తే భయపడండి.. ఏడవాలనిపిస్తే ఏడవండి. విఫలమైతే మళ్లీ ప్రయత్నించండి కానీ.. మధ్యలో వదిలేయొద్దు’ అని ఎంతో ధైర్యంగా చెప్పే మునిబా మజారికి భర్త అంటే భయం. 18 ఏళ్ల వయసులో నాన్న మాటకి ఎదురు చెప్పలేక పెళ్లి చేసుకుంది. డిగ్రీ పూర్తిచేసినా అత్తగారింట్లో తన పనెప్పుడూ చెప్పింది చేయడమే. ఓసారి భర్త కారు నడుపుతూ నిద్రపోవడంతో అదుపు తప్పింది. గమనించిన ఆయన దూకేశాడు. మునిబా మాత్రం కారులో చిక్కుకుపోయింది. ఈమెది పాకిస్థాన్‌. చేతులు, కాళ్లు, వెన్నుపూస విరిగిపోయాయి. సగం శరీరం చచ్చుబడింది. పక్కటెముకలు విరిగి కాలేయం, ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకొని పోయాయి. దాన్ని చూసి భర్త కనీసం సాయం చేయకుండా పారిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. రెండేళ్లు మంచానికే పరిమితమైంది. ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ తర్వాత వీల్‌చైర్‌లో కూర్చోగలిగింది.

‘జీవితాంతం తోడుంటానన్న భర్త కన్నెత్తి చూడకపోగా విడాకులిచ్చాడు. చేయి సహకరించదు కాబట్టి, నచ్చిన పెయింటింగ్‌ గీయలేను. నడవలేను, పిల్లల్ని కనలేను. ఇక బతికి ఏం లాభమనిపించింది. అప్పుడు మా అమ్మ ‘ఏదీ శాశ్వతం కాదు. ప్రయోజనం లేదన్నది ఏదీ ఈ లోకంలో ఉండదు’ అంది. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఎవరి కోసమో సంపూర్ణ మహిళగా నిరూపించుకోవాలనుకోలేదు. నా భయాలు సంపాదన లేకపోవడం, పిల్లలు లేకపోవడం కదా! వాటినే ఎదుర్కోవాలనుకున్నా. వీలుకాదన్నా కాన్వాస్‌ మీద బొమ్మలు గీయడం మొదలుపెట్టా. చక్రాల కుర్చీలో కూర్చొనే పిల్లలకు పాఠాలు బోధించా. ఒక బాబుని దత్తత తీసుకున్నా. ఇక నాకు లోటేముంది’ అని చెప్పే మునిబా సరైన ఉపాధ్యాయురాలిగా, సంరక్షకురాలిగా నిరూపించడానికి చాలా కష్టాలే ఎదుర్కొంది. ఎవరైనా జాలి చూపినా తనను మామూలుగా మనిషిలానే చూడమనేది.

తన బొమ్మలు, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటున్న తీరుకు ప్రశంసలతోపాటు టీవీలో యాంకర్‌ అవకాశమొచ్చింది. అక్కడా నిరూపించుకున్నాక మోడలింగ్‌ అవకాశాలొచ్చాయి. తన కథనే ఉదాహరణగా చెప్పి యువతలో స్ఫూర్తి నింపేది. అదే ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌ తరఫున అంబాసిడర్‌ అయ్యేలా చేసింది. మహిళలు, పిల్లల తరఫున తన గళాన్ని ఎప్పుడూ వినిపించే మునిబా 2015లో బీబీసీ ‘హండ్రెడ్‌ విమెన్‌’, ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 వంటి జాబితాల్లో నిలిచింది. తనలా అంగవైకల్యం పాలైన వారిలోనూ ధైర్యం నింపుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా ప్రసంగాలిస్తోంది. ‘జీవితంలో చెడ్డ పరిస్థితి అంటూ ఉండదు. దాన్ని మనం ఎలా మలుచుకున్నామన్నదే ముఖ్యం’ అనే మునిబాని ‘ఐరన్‌ లేడీ’ అని పిలుచుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్