అందుకే మనం చలిని తట్టుకోలేమట!

మిట్టమధ్యాహ్నం ఎండలో నుంచి ఇంటికొస్తాం.. చల్లదనం కోసం ఏసీ వేసుకుంటాం.. కానీ ఈ చల్లటి వాతావరణంలో కాసేపు కూర్చోగానే వణుకొచ్చేస్తుంటుంది.. వెంటనే ఏసీ ఆపేయడమో లేదంటే ఆ గదిలో నుంచి బయటికి రావడమో చేస్తుంటాం. ఇలా ఇంట్లోనే కాదు.. ఆఫీసుల్లో, మెట్రోల్లోనూ ఏసీలో మనం ఎక్కువసేపు ఉండలేం.

Updated : 02 May 2024 18:10 IST

మిట్టమధ్యాహ్నం ఎండలో నుంచి ఇంటికొస్తాం.. చల్లదనం కోసం ఏసీ వేసుకుంటాం.. కానీ ఈ చల్లటి వాతావరణంలో కాసేపు కూర్చోగానే వణుకొచ్చేస్తుంటుంది.. వెంటనే ఏసీ ఆపేయడమో లేదంటే ఆ గదిలో నుంచి బయటికి రావడమో చేస్తుంటాం. ఇలా ఇంట్లోనే కాదు.. ఆఫీసుల్లో, మెట్రోల్లోనూ ఏసీలో మనం ఎక్కువసేపు ఉండలేం. కానీ పురుషులు ఇందుకు భిన్నం. గంటల తరబడి వాళ్లు ఏసీలో కూర్చున్నా ఆ వాతావరణానికి తట్టుకునే శక్తి వారికి ఉంటుంది. అయితే ఇందుకు మగవారి శరీరతత్వానికి అనుగుణంగానే ఏసీలు రూపొందించారన్న అభిప్రాయమూ లేకపోలేదు. ఈ మాటెలా ఉన్నా.. మన శరీరం మాత్రం చలికి తట్టుకోలేకపోవడానికి శారీరకంగా కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

⚛ సాధారణంగానే పురుషులకు దేహదారుఢ్యం ఎక్కువ. కండరాలు సహజసిద్ధంగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలోనే వారిలో అధికంగా ఉండే కండరాల సామర్థ్యం వల్ల వారి శరీరం ఎక్కువ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుంది. తద్వారా వారు ఎంత చలినైనా తట్టుకోగలుగుతారని నిపుణులు అంటున్నారు. అదే ఆడవారిలో ఈ కండరాల సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల వారి శరీరం తక్కువ ఉష్ణోగ్రతను విడుదల చేస్తుందని, దీనివల్లే మహిళలు ఎక్కువ చలిని తట్టుకోలేకపోతారని చెబుతున్నారు.

⚛ పురుషులతో పోల్చితే మహిళల్లో కొవ్వు 6-11 శాతం ఎక్కువగా ఉంటుందట! ఇది చర్మం, శరీరంలోని ఇతర అంత్య భాగాలకు ఉష్ణాన్ని మోసుకెళ్లే రక్తానికి అడ్డుపడుతుందని, ఫలితంగానే మహిళల శరీరంలో ఉష్ణోగ్రత లోపించి ఎక్కువ చల్లదనానికి తట్టుకోలేకపోతారని నిపుణులు అంటున్నారు.

⚛ కొంతమంది మహిళలకు వాతావరణంతో సంబంధం లేకుండా అరచేతులు ఎప్పుడూ చల్లగా ఉండడం గమనిస్తుంటాం. ఇదనే కాదు.. పురుషులతో పోల్చితే మహిళల చర్మం తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అధిక చల్లదనానికి తట్టుకోలేకపోవడానికీ ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

⚛ మనలో జీవక్రియల రేటు కూడా తక్కువగా ఉంటుందని, ఇదే శరీరంలో తక్కువ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆడవారు చలికి తట్టుకోలేకపోతారని అంటున్నారు.

⚛ శరీరంలోని హార్మోన్ల ప్రభావం, నెలసరి సమయాలు కూడా మహిళల శారీరక ఉష్ణోగ్రతపై ప్రభావం చూపుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అండం విడుదలయ్యే సమయంలో శారీరక ఉష్ణోగ్రత తగ్గి శరీరం చలికి తట్టుకోలేకపోతుందట!

⚛ కొన్ని సందర్భాల్లో కొంతమంది మహిళల పని ఉత్పాదకత పైన కూడా ఏసీ ప్రభావం చూపిస్తుందట. ఏసీ గదుల్లో కన్నా.. గది ఉష్ణోగ్రత వద్ద చేసే పనిలో వాళ్లు పూర్తి సత్ఫలితాల్ని సాధిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందరూ అని కాకపోయినా కొంతమంది ఆడవాళ్లు చలికి, ఏసీ వాతావరణానికి తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం కావడం గమనార్హం.

⚛ మహిళల్లో మెనోపాజ్‌ కంటే ముందు, తర్వాత శరీర ఉష్ణోగ్రతల్లో పలు మార్పులొస్తుంటాయి. ఈ సమయంలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. తద్వారా వేడి ఆవిర్లు, రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమటలు పట్టడం, శరీరం చలికి తట్టుకోలేకపోవడం.. వంటివి కనిపిస్తాయట!

⚛ కొంతమందిలో ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు, హైపోథైరాయిడిజం.. వంటి వాటి వల్ల కూడా వారి శరీరం చలికి తట్టుకునే స్థితిలో ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్