బియ్యంతో.. అన్నం ఒక్కటే కాదు!

సాధారణంగా బియ్యంతో ఏం చేస్తాం..? అన్నం వండుకోవడం, ఇతర వంటకాలు తయారుచేసుకోవడం.. ఇవే మనకు తెలిసినవి! కానీ బియ్యాన్ని ఇంటి అవసరాల్లో భాగంగా వివిధ రకాలుగా వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

Published : 06 Jun 2024 12:41 IST

సాధారణంగా బియ్యంతో ఏం చేస్తాం..? అన్నం వండుకోవడం, ఇతర వంటకాలు తయారుచేసుకోవడం.. ఇవే మనకు తెలిసినవి! కానీ బియ్యాన్ని ఇంటి అవసరాల్లో భాగంగా వివిధ రకాలుగా వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

⚛ మొబైల్‌ ఫోన్, రిమోట్‌.. వంటి ఎలక్ట్రానిక్‌ పరికాలు అప్పుడప్పుడూ పొరపాటున నీళ్లలో పడిపోవడం లేదంటే తడవడం.. వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వీటిని కొద్దిగా బియ్యం నింపిన డబ్బాలో బియ్యంతో కప్పి రెండు గంటల పాటు ఉంచాలి. తద్వారా వాటిలోని తేమను బియ్యం పీల్చుకోవడం గమనించచ్చు.

⚛ కిచెన్‌ కప్‌బోర్డులు, రిఫ్రిజిరేటర్ల నుంచి అప్పుడప్పుడూ దుర్వాసనలు రావడం గమనిస్తాం. ఇలాంటప్పుడు బియ్యం నింపిన బౌల్‌ను ఆయా అల్మరాలు, ఫ్రిజ్‌లో ఓ మూలన ఉంచితే ఆ వాసనను బియ్యం పీల్చేసుకుంటాయి.

⚛ డబ్బాలో నిల్వ ఉంచిన ఉప్పుకి తడి తగిలితే గట్టి పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే అందులో కొన్ని బియ్యపు గింజలు వేసి చూడండి..!

⚛ మామిడి, సీతాఫలం.. వంటి పండ్లను త్వరగా పక్వానికి తీసుకురావడానికి కొన్ని రకాల రసాయనాలను వాడుతుంటారు. అలాకాకుండా వాటిని బియ్యంలో కప్పి ఉంచితే సహజంగానే అవి త్వరగా పండుతాయి.

⚛ బియ్యం కడిగిన నీళ్లు, అన్నాన్ని ఉడికించేటప్పుడు వేరు చేసిన గంజిలో బోలెడన్ని పోషకాలుంటాయి. ఈ నీటిని ముఖం, జుట్టు, పాదాలు, గోళ్ల సంరక్షణకు.. వివిధ పద్ధతుల్లో ఉపయోగించచ్చు.

⚛ ఇక బియ్యం కడిగిన నీళ్లను కాయగూరలు, పండ్లను శుభ్రం చేసుకోవడానికి వాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆ నీళ్లలో కాయగూరలు, పండ్లను పావుగంట పాటు ఉంచి.. ఆపై సాధారణ నీటితో మరోసారి శుభ్రం చేస్తే సరిపోతుంది.

⚛ బియ్యాన్ని ఉడికించిన నీటి (గంజి)లో ప్రొటీన్లు, ఫైబర్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ నీటిలో కాస్త ఉప్పు వేసుకొని తాగితే.. అందులోని పోషకాలు శరీరానికి అంది సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది.

⚛ గంజిని మొక్కలకు ఎరువుగా కూడా వాడచ్చంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషకాలు మొక్కల్ని చీడపీడల నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు.

⚛ తేమ వల్ల కత్తులు, కత్తెర.. వంటి కొన్ని వస్తువులు తుప్పు పట్టడం చూస్తుంటాం. అయితే వీటిని బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో ఉంచితే ఈ సమస్య ఉండదు.

⚛ తేమ ప్రభావం వెండి ఆభరణాల పైనా ఉంటుంది. తద్వారా అవి కళ తప్పినట్లుగా కనిపిస్తాయి. అలాంటప్పుడు ఒక మెష్‌ బ్యాగ్‌లో బియ్యాన్ని నింపి.. వీటిని భద్రపరిచే బాక్సులో ఉంచితే ఆ తేమను బియ్యం పీల్చేసుకుంటుంది. అలాగే నిర్ణీత వ్యవధుల్లో ఈ బియ్యాన్ని మార్చడం మర్చిపోవద్దు.

⚛ బియ్యపు గింజల్ని పేర్చుతూ వివిధ రకాల అలంకరణ వస్తువులు తయారుచేయడం మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఓపిక ఉంటే మీరూ ఇలాంటివి సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఈ గింజలకు రంగులు అద్దితే మరింత ఆకర్షణీయమైన డెకరేటివ్‌ పీసెస్‌ సిద్ధమవుతాయి. వీటికి సంబంధించి యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు చూడచ్చు.. లేదంటే మీలోని సృజనకు పదును పెట్టచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్