Samantha: వాళ్ల కథలు చదివాకే.. కుంగుబాటు నుంచి బయటపడ్డా!

జీవితంలో సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముడితే సమయం బాలేదనుకుంటారు చాలామంది. పదే పదే వాటినే తలచుకుంటూ కుంగిపోతుంటారు. అయితే వాటికి తలొగ్గడం కంటే వాటి నుంచి బయటపడి సానుకూలంగా ముందుకు సాగినప్పుడే జీవితంలో మళ్లీ మంచి రోజులొస్తాయంటోంది టాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ సమంత.

Updated : 10 Nov 2023 18:40 IST

(Photos: Instagram)

జీవితంలో సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముడితే సమయం బాలేదనుకుంటారు చాలామంది. పదే పదే వాటినే తలచుకుంటూ కుంగిపోతుంటారు. అయితే వాటికి తలొగ్గడం కంటే వాటి నుంచి బయటపడి సానుకూలంగా ముందుకు సాగినప్పుడే జీవితంలో మళ్లీ మంచి రోజులొస్తాయంటోంది టాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ సమంత. వైవాహిక బంధం వీగిపోయి, ఆరోగ్య సమస్యలు, వరుస ఫ్లాప్స్‌తో ఒకానొక సమయంలో సతమతమైన ఈ ముద్దుగుమ్మ.. ‘ఏది జరిగినా మంచికే’ అన్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగింది. ఈ పాజిటివిటీనే తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌ తిరిగి గాడిలో పడేందుకు దోహదం చేశాయంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది సామ్‌. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వరుస విజయాలు అందుకుంటూ టాలీవుడ్‌లోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది సమంత. కెరీర్‌లో దూసుకుపోతోన్న సమయంలోనే నాగచైతన్యను వివాహం చేసుకుందీ ముద్దుగుమ్మ. అయితే పలు కారణాల వల్ల 2021లో విడాకులు తీసుకుందీ జంట. వైవాహిక బంధం వీగిపోవడం, ఆపై మయోసైటిస్‌ బారిన పడడం.. ఇలా గత రెండేళ్లుగా జీవితంలో గడ్డు దశను ఎదుర్కొన్నానంటోందీ బ్యూటీ.

వాళ్ల కథలు చదివాకే..!

ప్రస్తుతం తన కెరీర్‌కు విరామమిచ్చి ఆరోగ్యం పైనే పూర్తి దృష్టి పెట్టిన సామ్.. తన జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్న తీరును ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది.
‘వివాహ బంధం వీగిపోవడం, ఆరోగ్య సమస్యలు, వీటి ప్రభావం కెరీర్‌పై పడడం.. ఇలా సమస్యలన్నీ ఒకేసారి నన్ను చుట్టుముట్టాయనిపించింది. దీనికి తోడు నేను నటించిన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించక చాలా బాధపడ్డా. ఈ సమస్యల వలయంలో చిక్కుకొని రెండేళ్ల పాటు మానసికంగా కుంగిపోయా. అలాగని వీటితోనే సహవాసం చేయాలనుకోలేదు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొంతమంది నటీనటుల స్టోరీస్‌ చదివాను. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, విమర్శలు.. వంటివన్నీ వారు ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకున్నా. ఇలా వాళ్ల కథలు నాలో స్ఫూర్తి నింపాయి. మానసిక స్థైర్యాన్నిచ్చాయి. ప్రతికూలతల్ని వాళ్లెలా అధిగమించారో.. నేనూ అలాగే అధిగమించాలనుకున్నా. నటీనటుల జీవితాలంటే సినిమా ఫలితాలు, అవార్డులు, వాళ్లు వేసుకునే దుస్తులే కాదు.. వాళ్లకూ ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. అవి పంచుకోవడానికి నేనెప్పుడూ వెనకాడను. నాలాంటి వాళ్లు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. నా సమస్యల గురించి అందరితో పంచుకుంటే వాళ్లూ వాళ్ల సమస్యల్ని బయటికి చెప్పుకోవడానికి ముందుకొస్తారు. ఇలా ఒకరికొకరు స్ఫూర్తిగా నిలవచ్చు.. తద్వారా ఒకరి నుంచి మరొకరు పోరాడే శక్తిని అందిపుచ్చుకోవచ్చు..’ అంది సామ్‌. ఇన్ని ప్రతికూలతల మధ్యా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం, అభిమానుల ఆదరణ పొందడం ఓ అందమైన అనుభూతి అంటోందీ చక్కనమ్మ.

మోడలింగ్‌.. తప్పలేదు!

తన అందం, అభినయంతో చిత్రపరిశ్రమలోనే టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన సమంత.. ఒకప్పుడు సినిమాల కంటే చదువుకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చానంటోంది. తన కాలేజ్‌ డేస్‌, మోడలింగ్‌లోకి రావడానికి గల కారణాలేంటో కూడా పంచుకుందీ బ్యూటీ.

‘కాలేజీ రోజుల్లో అడపాదడపా మోడలింగ్‌ చేసినా.. నా దృష్టంతా చదువు పైనే ఉండేది. నాకు చదువంటే అంత ఇష్టం మరి! అందరిలాగే.. బాగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మే మధ్య తరగతి అమ్మాయిని నేను! అయితే ఒకానొక సమయంలో ఇంట్లో పరిస్థితులు సహకరించక, పైచదువులు చదువుకునే అవకాశం లేక.. తప్పక మోడలింగ్‌లోకి రావాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఈ కెరీర్‌లోకి అడుగుపెట్టా. కానీ ఇదే నా జీవితానికీ ఓ అర్థముందంటూ దారి చూపించింది. నటిగా లక్ష్యాన్ని నిర్దేశించి నాకు బోలెడన్ని అవకాశాలు అందించింది..’ అంటూ చెప్పుకొచ్చింది సామ్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్