Samantha: అందుకే ముందు ‘శాకుంతలం’ చేయనన్నా!

పరిస్థితుల్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటాం. అదేవిధంగా తెరపై పాత్రల్ని బట్టి సినిమా తారలూ తమను తాము మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మాటల్లో చెప్పినంత సులభం కాదంటోంది టాలీవుడ్‌ అందాల తార సమంత. ఒక పాత్రను వదిలి మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం....

Published : 12 Apr 2023 19:56 IST

(Photos: Instagram)

పరిస్థితుల్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటాం. అదేవిధంగా తెరపై పాత్రల్ని బట్టి సినిమా తారలూ తమను తాము మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మాటల్లో చెప్పినంత సులభం కాదంటోంది టాలీవుడ్‌ అందాల తార సమంత. ఒక పాత్రను వదిలి మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తేనే దానికి పూర్తి న్యాయం చేయగలుగుతామంటోన్న ఈ బ్యూటీ.. ఈ స్వీయ సందేహంతోనే మొదట ‘శాకుంతలం’ సినిమా ఒప్పుకోలేదని ఇటీవలే చెప్పుకొచ్చింది. పౌరాణిక కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ‘శకుంతల’గా ముఖ్య పాత్రలో మెరిసింది సామ్‌. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె.. ఈ సినిమా తనకు మిగిల్చిన జ్ఞాపకాలు, పంచిన మధురానుభూతులు, పాత్ర కోసం తాను నేర్చుకున్న నైపుణ్యాలు.. ఇలా ఒక్కొక్కటిగా సోషల్‌ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సమంత.. టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటుందీ బ్యూటీ. ‘శాకుంతలం’లో సామ్‌ పోషించిన శకుంతల పాత్ర కూడా అలాంటిదే! విడుదలకు ముందే తన లుక్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తోన్న సామ్‌.. ఈ సినిమా గురించిన ఆసక్తికర విశేషాలు ఒక్కొక్కటిగా బయటపెడుతూ వారిలో మరింత ఆతృతను రేకెత్తిస్తోంది. శకుంతల-దుష్యంతుల పౌరాణిక ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల సందర్భంగా.. సామ్‌ పంచుకున్న తన అనుభవాలు, ఆసక్తికర విశేషాలు ఆమె మాటల్లోనే..!

ఆ రెండూ భిన్నమైన పాత్రలు!

‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2 సినిమా చిత్రీకరణ పూర్తైన వెంటనే శాకుంతలం సినిమా ఆఫర్‌ వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్‌లో నేను రాజీ పాత్ర పోషించాను. దాంతో పోల్చితే శకుంతల పాత్ర ఎన్నో రకాలుగా భిన్నమైనది. స్వేచ్ఛ, అమాయకత్వం, దయ, గౌరవానికి ప్రతీక శకుంతల. అదే రాజీ పాత్ర ఎంతో ధైర్యంతో కూడుకున్నది. ఇలాంటి పాత్ర చేసిన నేను.. ఉన్నట్లుండి శకుంతలగా మారతానా? పాత్రకు తగిన న్యాయం చేస్తానా? అన్న సందేహాలు నా మనసులో రేకెత్తాయి. అందుకే ముందు ఈ అవకాశాన్ని తిరస్కరించా. కానీ మరో కోణంలో ఆలోచించి చూస్తే.. ఈ పాత్రతో నా జీవితంలోని భయాలు, బాధల్ని జయించచ్చనిపించింది. గత మూడేళ్లుగా నా జీవితంలో ఎన్నో మార్పులు, సంఘటనలు చోటుచేసుకున్నాయి. బాధ, భయంలోకి ఇవి నన్ను నెట్టేశాయి. అయితే శకుంతల కూడా తన జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొందని కథ తెలిశాక నాకు అర్థమైంది. నేనూ నా భయాల్ని అధిగమించడానికి ఈ పాత్ర నాకు సహాయపడుతుందనిపించింది. అందుకే సినిమాకు సంతకం చేశా. ఏదేమైనా.. అన్ని సినిమాల్లోకెల్లా నా మనసుకు బాగా దగ్గరైన పాత్ర ఇది.

నడక, నడత.. నేర్చుకున్నా!

శకుంతల పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమెలోని దయ, మర్యాద, తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు.. ఇవి నాలో ప్రేరణ కలిగించాయి. నిజానికి శకుంతలలోని కొన్ని గుణాలు నేను ఆపాదించుకోవడం నాకు కాస్త కష్టంగానే అనిపించింది. ముఖ్యంగా సెట్లో ఆమెలా నిల్చోవడం, నడవడం, మాట్లాడడం, పరిగెత్తడం, ఆఖరికి ఏడవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. అందుకే వీటిని ఒంటబట్టించుకోవడానికి ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకున్నా. మరోవైపు గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నా. రాజీ పాత్ర కోసం బరువు పెరిగి కాస్త కండలు తిరిగినట్లుగా ఉన్న నా శరీరాన్ని.. శకుంతల పాత్ర కోసం తిరిగి నాజూగ్గా మార్చుకోవడానికి ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించా.. వర్కవుట్లు చేశా. ఇక సెట్లో ఎప్పుడూ ఉత్సాహంగా, ఆనందంగా ఉండడానికి రోజూ ధ్యానం చేసేదాన్ని. ఇవే నన్ను పాత్రలో మరింత ఒదిగిపోయేలా చేశాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే తెలుగు, తమిళం, హిందీ.. భాషలకు నేనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా.. ఒక్కోసారి నిద్రలోనూ డైలాగులు చెప్పేదాన్నట. భవిష్యత్తులోనూ ఇతర సినిమాలకు నా డబ్బింగ్‌ నేనే చెప్పుకోవాలనుకుంటున్నా.

పూలంటే నాకు అలర్జీ.. కానీ!

ఇక ఈ సినిమా షూటింగ్‌లో నాకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలు కొన్ని ఎదురయ్యాయి. నాకు పూలంటే అలర్జీ. అయితే కొన్ని సీన్లలో పూలతో తయారుచేసిన ఆభరణాలు ధరించాల్సి వచ్చింది. రోజంతా అలాగే ఉండాల్సి వచ్చేది. ధరించినంత సేపు ఏమీ అనిపించకపోయినా.. షూటింగ్‌ పూర్తయ్యాక వాటిని తొలగించాక.. ఆయా శరీర భాగాలపై పూల డిజైన్లలో ట్యాటూ వేయించుకున్నట్లుగా నల్లటి మచ్చలు పడేవి. అవి శాశ్వతంగా అలాగే ఉండిపోతాయనుకున్నా.. కానీ ఆరు నెలల తర్వాత కనుమరుగైపోయాయి. ఇక షూటింగ్‌ సమయంలో వాటిని మేకప్‌తో కవర్‌ చేసుకున్నా.

ఇక సినిమా సెట్లో కుందేళ్లు ఎక్కువగా ఉండేవి. ఒకసారి అందులో ఒకటి నన్ను కరిచింది. అయితే అన్ని కుందేళ్లలా అదంత క్యూట్‌గా ఏమీ లేదనుకోండి! (నవ్వుతూ).

15 టేకులు తీసుకున్నా!

శాకుంతలం సినిమాలో కాస్ట్యూమ్స్‌ అన్నీ నీతా లుల్లా డిజైన్‌ చేశారు. ఈ క్రమంలో కొన్ని తక్కువ బరువున్న, మరికొన్ని భారీగా బరువున్న అందమైన డిజైనర్‌ లెహెంగాలు రూపొందించారామె. అయితే ఇందులో ఒక పాటలో నేను 30 కిలోల భారీ డిజైనర్‌ లెహెంగా ధరించి డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. గుండ్రంగా తిరుగుతూ స్టెప్స్‌ వేసేటప్పుడు.. లెహెంగా బరువుకు నాకు తెలియకుండానే ఫ్రేమ్‌ దాటి పక్కకు వెళ్లిపోయేదాన్ని. దాంతో డ్యాన్స్‌ మాస్టర్‌ రాజు సర్‌.. ‘మీరెందుకు ఫ్రేమ్‌లో ఉండలేకపోతున్నారు?’ అంటూ కాస్త గట్టిగా అన్నారు. ‘నేను కాదు.. లెహెంగానే నన్ను ఫ్రేమ్‌లో ఉండనివ్వట్లేదు..’ అనే సరికి సెట్లో నవ్వుల పువ్వులు పూసేవి. నిజానికి ఈ షాట్‌ కరక్ట్‌గా పూర్తిచేయడానికి ఒకటి, రెండు కాదు.. ఏకంగా 15 టేకులు తీసుకున్నా. ఇక ఈ సినిమాలో వేసిన హెయిర్‌స్టైల్స్‌ కూడా నా జుట్టుతో వేసినవి కావు.. విగ్‌ ఉపయోగించా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్