రష్యన్‌ రాపంజెల్‌.. తన పొడవాటి జుట్టు రహస్యమదేనట!

జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా ఉండాలని కోరుకోని అమ్మాయంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే అందరి విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది జుట్టు పొడవుగా ఉన్నా నిర్జీవంగా కనిపిస్తుంటుంది.. ఇంకొంతమందిది సన్నగా, పీలగా ఉంటుంది. కానీ రష్యాకు చెందిన జనీవీవ్‌ డవ్‌ అనే అమ్మాయి...

Published : 15 Jan 2023 13:27 IST

(Photos: Instagram)

జుట్టు పొడవుగా, ఒత్తుగా, సిల్కీగా ఉండాలని కోరుకోని అమ్మాయంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే అందరి విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది జుట్టు పొడవుగా ఉన్నా నిర్జీవంగా కనిపిస్తుంటుంది.. ఇంకొంతమందిది సన్నగా, పీలగా ఉంటుంది. కానీ రష్యాకు చెందిన జనీవీవ్‌ డవ్‌ అనే అమ్మాయి జుట్టులో మాత్రం ఈ మూడు లక్షణాలున్నాయి. సుమారు ఐదడుగుల పొడవైన తన జుట్టుతో ఓ పార్క్‌లో సరదాగా దిగిన వీడియోను ఇటీవలే ఇన్‌స్టాలో షేర్‌ చేసిందామె. అంతే.. తన పొడవైన కురులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ‘మీ జుట్టు రహస్యమేంట’ని అడుగుతున్నారు. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

జుట్టు పొడవు.. ఐదడుగులు!

రష్యాకు చెందిన జనీవీవ్‌ డవ్‌ అనే అమ్మాయి ఓ కవయిత్రి. అంతేకాదు.. గాయనిగా, ఫొటోగ్రాఫర్‌గా, ట్రావెలర్‌గా ఆమె ఇన్‌స్టా ప్రియులకు సుపరిచితమే! తన అందం, క్యూట్‌ స్మైల్‌తో ఆకట్టుకునే ఈ చిన్నది.. 4.9 అంగుళాల పొడవున్న తన కురులకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్నీ తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇటీవలే వదులైన జుట్టుతో ఓ పార్క్‌లో సరదాగా పరిగెత్తుతూ దిగిన షార్ట్‌ వీడియోను ‘నా సహజసిద్ధమైన సిల్కీ జుట్టు’ అంటూ షేర్‌ చేసిందామె. ఎండకు మెరిసిపోతున్న తన ఒత్తైన కురులను చూసి సోషల్‌ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. ‘ఈ అందమైన కురులు.. ఇంకాస్త పొడవు పెరిగి నేలను తాకాల’ని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు.. మరికొందరు తన పొడవైన కురుల వెనకున్న రహస్యమేంటని అడుగుతున్నారు.

వాళ్లను చూశాకే..!

అయితే తన జుట్టు ఇంత పొడవుగా పెరగడానికి కారణం.. సహజసిద్ధమైన చిట్కాలు పాటించడమే అంటోందీ రష్యన్ రాపంజెల్. ‘జుట్టు పొడవుగా పెంచుకోవడమంటే నాకు చాలా ఇష్టం. చరిత్రలో పొడవైన కురులున్న మహారాణులు, యువరాణుల్ని చూసి నేనూ వాళ్లలా జుట్టు పెంచుకోవాలనుకున్నా. అయితే ఈ క్రమంలో నేను పూర్తిగా సహజసిద్ధమైన చిట్కాల్నే పాటిస్తున్నా. నెలకోసారి జుట్టు చివర్లను కత్తిరించుకుంటా. తద్వారా జుట్టు త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. తరచూ సహజసిద్ధమైన షాంపూతో తలస్నానం చేయడం, కండిషన్‌ చేసుకోవడం మాత్రం మానను. దువ్వుకునే ముందు హెయిర్‌ స్ప్రే వాడతా. దీనివల్ల జుట్టు తెగిపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే నా జుట్టు ఇంత పొడవుంది కదా.. జడ వేసుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందేమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే కేవలం పదే పది నిమిషాల్లో జుట్టు చిక్కుల్లేకుండా దువ్వుకొని బ్రెయిడ్‌ వేసుకుంటా. ఇక మిగతా హెయిర్‌ స్టైల్స్‌కి కూడా పెద్దగా సమయం పట్టదు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటే జుట్టు మరింత ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇందుకు నా కురులే ప్రత్యక్ష ఉదాహరణ!’ అంటూ తన హెయిర్‌కేర్‌ సీక్రెట్స్‌ని బయటపెట్టిందీ రష్యన్‌ చిన్నది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్