టెక్నాలజీతో పాటు ఇవీ నేర్చుకోవాల్సిందే..!

అదీ ఇదీ అని లేకుండా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు అతివలు. ఈ క్రమంలో మహిళలపై దాడులు, వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక.. మళ్లీ ఇంటికి చేరేలోపు ఇంట్లో ఏదో తెలియని అలజడి. ఈ క్రమంలో ఆపద సమయంలో ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. ఎదురు చూడటం కంటే తమను....

Published : 07 Mar 2023 18:21 IST

అదీ ఇదీ అని లేకుండా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు అతివలు. ఈ క్రమంలో మహిళలపై దాడులు, వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక.. మళ్లీ ఇంటికి చేరేలోపు ఇంట్లో ఏదో తెలియని అలజడి. ఈ క్రమంలో ఆపద సమయంలో ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. ఎదురు చూడటం కంటే తమను తాము రక్షించుకొనే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే వివిధ ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇప్పించాలి. ఉద్యోగాలు చేసే మహిళలు, కళాశాలకు వెళ్లే యువతులు సైతం ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్చుకోవడం అవసరం. ప్రమాదం ముంచుకొచ్చే సందర్భంలో ఈ ఆత్మరక్షణ విద్యల సహాయంతో ఆపద నుంచి బయటపడవచ్చు. మరి, అవి ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం !

చిన్నప్పటి నుంచే..

చిన్నపాటి టెక్నిక్‌లను ఉపయోగించి ప్రత్యర్థులను నేలకూల్చే కరాటే విద్య అమ్మాయిలకు ఎంతో అవసరం. మహిళలు, చిన్నపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నప్పటి నుంచే ఈ శిక్షణ ఇప్పించాలి. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఇది తప్పనిసరి. తమను తాము రక్షించుకోవడానికి కరాటే చక్కని సాధనం. పిల్లలకే కాదు.. పెద్దలకూ కొన్ని సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. వారం పది రోజుల్లో కూడా కొన్ని మెలకువలు నేర్చుకోవచ్చు. ఎదుటి వ్యక్తి దాడికి పాల్పడుతుంటే కాళ్లు, చేతులను, తలను ఉపయోగించి ఎలాంటి పంచ్‌లు ఇవ్వచ్చో శిక్షకులు నేర్పిస్తారు.

గురి చూసి కొట్టేందుకు..!

ఆపద సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించాలంటే ఏకాగ్రత కావాలి. అందుకు ఆర్చరీ బాగా ఉపయోగపడుతుంది. ఆర్చరీ అంటే విలువిద్య. అంతమాత్రాన ఇది నేర్చుకొని బయటకు వెళ్లినప్పుడల్లా విల్లును చేతబట్టుకెళ్లమని కాదు. లక్ష్యాన్ని గురి చూసి ఎలా కొట్టాలో ఈ విద్య ద్వారా నేర్చుకోవచ్చు. అనుకోని ఆపద ఎదురైనప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు, చేతిలో ఉన్న ఆయుధాన్ని గురి చూసి కొట్టే నైపుణ్యం ఈ విద్య మనకు నేర్పిస్తుంది. నగరంలో చాలా చోట్ల పిల్లలకు కూడా విలువిద్యలో శిక్షణ ఇస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక శిక్షకులను పెట్టి కూడా మెలకువలు నేర్పిస్తున్నారు.

ఆత్మరక్షణ కోసం..

ఆపద సమయంలో దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని నిలువరించడానికి చేతిలో చిన్న కర్ర ఉన్నా చాలు. అయితే ఒట్టిగా కర్ర తీసుకొని కొడతానంటే సరిపోదు. దానికో టెక్నిక్‌ ఉండాలి. అది కావాలంటే కర్రసాము నేర్చుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ విద్యను నేర్పించాలి. కర్రసాము నేర్చుకోవడం వల్ల దరిదాపుల్లోకి ఎవరూ వచ్చే సాహసం చేయలేరు. అలానే నాన్‌చాక్‌ వంటి ఆయుధాలను వినియోగించడం కూడా ఈ కోవలోకే వస్తుంది. నేటి తరం అమ్మాయిలు ఇలాంటి విద్యలను నేర్చుకుని, బయటకు వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన ఆయుధాలు వారితో ఉంచుకోవడం చాలా అవసరం.

అలాంటప్పుడు.. దూసుకెళ్లేలా..!

ఎంతోమంది అమ్మాయిలు ఇప్పుడు పెద్దపెద్ద కార్లను సైతం అవలీలగా నడిపేస్తున్నారు. అయితే వెళ్లేది వాహనం పైనే అయినా ఒంటరిగా ఉన్న సమయంలో వారిని వెంబడించడానికి కూడా వెనకాడరు నేరగాళ్లు. అందుకే ఒంటరిగా కారు లేదా బైక్‌పై వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డగించి దాడి చేసే ప్రయత్నం చేస్తే తప్పించుకునేలా వారికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలి. హెవీ ట్రాఫిక్‌ను ఛేదించుకొని ముందుకు వెళ్లడం, తమను వెంబడించే వారి నుంచి తప్పించుకొని దూసుకెళ్లడం.. లాంటి వాటిలో అమ్మాయిలను సుశిక్షితులను చేయాలి.

వెంట ఇది ఉండాల్సిందే!

ఆడపిల్లలు చాలా సులువుగా బ్యాగులో పెట్టుకునేందుకు వీలున్న ఆత్మరక్షణ సాధనం పెప్పర్‌ స్ప్రే. బయటకు వెళ్లే ప్రతి మహిళ వద్ద పెప్పర్‌ స్ప్రే తప్పకుండా ఉండాలనేది అందరూ అంగీకరించే విషయం. ఆకతాయిలు, పోకిరీల నుంచి ఎదురయ్యే దాడులను దీనితో సునాయాసంగా ఎదుర్కోవచ్చు. మీపై దాడి చేసే వ్యక్తిని కొద్దిసేపటివరకు గిలగిలలాడేలా చేయవచ్చు. దాడికి దిగేవారి ముఖంపై ఒక్కసారిగా దీన్ని స్ప్రే చేయడం వల్ల వారికి ఊపిరి ఆడదు. అప్పుడు వెంటనే అక్కడ నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. అయితే మన వద్ద పెప్పర్‌స్ప్రే ఉన్నట్లు ఎదుటి వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడాలి.

ఏదీ లేకపోతే అదే ఆయుధం !

సమయానికి ఏ ఆయుధం లేకపోతే.. ఇక తప్పించుకోలేము అనుకుంటే.. మీ బండి తాళాలే మిమ్మల్ని కాపాడగలవు. అవును! చిన్న తాళం చెవితో మీపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని మూర్ఛబోయేలా చేయొచ్చు. అదే ‘హ్యామర్‌ స్ట్రైక్‌’. అంటే మీ బండి లేక కారు తాళం చెవిని పిడికిట్లో గట్టిగా బిగబట్టి దాని పదునైన భాగం బయటకు ఉండేలా చూసుకోవాలి. అది ఎదుటి వ్యక్తికి కనబడకుండా చూసుకోవాలి. అతడు మీపై దాడికి దిగబడ్డప్పుడు సుత్తిని పైకి లేపి కొట్టినట్లు దానితో అతడి మెడపై దాడి చేయాలి. ఇక దీనితో పాటు ఒక పొడవాటి ఇనుప కీచైన్‌ కనుక మీ దగ్గర ఉంచుకొంటే మరో నాన్‌చాక్‌లా కూడా అది ఉపయోగపడుతుంది. ఇదేవిధంగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎన్నో రకాల సేఫ్టీ యాప్స్, ఆపద సమయంలో ఆత్మ రక్షణ కోసం ఉపయోగపడే పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

ఆపద సమయంలో భయం వల్ల చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతుంటాం. కాబట్టి సాధ్యమైనంత వరకూ భయపడకుండా తెలివిగా వ్యవహరించడం చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి. అందులో భాగమే పురుషుల వీక్‌ పాయింట్స్‌ గురించి తెలపడం కూడా ! చిన్నపాటి టెక్నిక్‌తో జననేంద్రియాల పైన, ముక్కు, మోకాలు, కళ్లు వంటి భాగాల్లో దాడి చేయడం వల్ల తప్పించుకునే సమయం లభిస్తుంది. ఏ ఆత్మరక్షణలోనైనా ఇది ప్రాథమిక అంశం.

అలాగే ఈకాలంలో మహిళల సెక్యూరిటీ కోసం చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కుటుంబ సభ్యులకు మనం ఎక్కడ ఉన్నామో సమాచారం అందించేందుకు అవి ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిని ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకుని, ఆపద సమయంలో ఉపయోగించడం నేర్చుకోవాలి.

ఆపదలో ఆదుకునే నేస్తం !

చాలామంది కుక్కను ఇంటికి కాపలాగా పెంచుకుంటారు. కానీ అవి చూపే ప్రేమ ఎలా ఉంటుందంటే.. ఆపద సమయంలో అవసరమైతే తమ యజమాని కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాయి. ప్రపంచంలో చాలామంది మహిళలను దొంగల నుంచి, రేపిస్టుల నుంచి కాపాడిన చరిత్ర వాటికుంది. అందుకే బలీయమైన జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకుంటే ఒంటరి సమయంలో ఎక్కడికెళ్లినా దానిని వెంటబెట్టుకెళ్లవచ్చు. అపరిచితులపై ఎప్పుడూ ఓ కన్నేసి వచ్చే ఆపదను అవి ముందే పసిగట్టగలవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్