Shalini Singh : ఎవరూ చేయని సాహసం చేసింది..!

సాహసమే ఊపిరిగా సాగిపోతున్నారు ఈతరం అమ్మాయిలు. అరుదైన రంగాల్ని ఎంచుకోవడమే కాదు.. అసాధారణ ఘనతలు సాధిస్తూ ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతున్నారు. లక్నోకు చెందిన షాలినీ సింగ్‌ ఇదే కోవకు...

Updated : 03 Jun 2023 20:51 IST

(Photos: Twitter)

సాహసమే ఊపిరిగా సాగిపోతున్నారు ఈతరం అమ్మాయిలు. అరుదైన రంగాల్ని ఎంచుకోవడమే కాదు.. అసాధారణ ఘనతలు సాధిస్తూ ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతున్నారు. లక్నోకు చెందిన షాలినీ సింగ్‌ ఇదే కోవకు చెందుతుంది. ఒకానొక సమయంలో పర్వతారోహణ గురించి తెలుసుకున్న ఆమె.. క్రమంగా దానిపైనే ఆసక్తిని పెంచుకుంది. ఎన్‌సీసీలో చేరాక మౌంటెనీరింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో ప్రాథమిక కోర్సు పూర్తి చేసి.. అడ్వాన్స్‌డ్‌ కోర్సుకు అర్హత సాధించింది. ఈ కోర్సుకు అర్హత సాధించిన 45 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌లో షాలిని ఒక్కర్తే అమ్మాయి. ఇక తాజాగా ఈ కోర్సును కూడా పూర్తిచేసిన ఆమె.. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా ఎన్‌సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది. తనకు దక్కిన ఈ ప్రత్యేకత మరికొంతమంది అమ్మాయిల్లో ఇలాంటి సాహసాలు చేసే స్ఫూర్తి నింపితే చాలంటోంది షాలిని.

లక్నోకు చెందిన షాలిని ప్రస్తుతం సిటీలోని ‘బప్పా శ్రీ నారాయణ్‌ వొకేషనల్‌ పీజీ కాలేజీలో బీఏ చదువుతోంది. ఆమెకు చిన్నతనం నుంచి సాహసాలు చేయడమంటే మహా ఇష్టం. ఈ మక్కువతోనే ఎన్‌సీసీలో చేరిందామె. ఒకానొక దశలో పర్వతారోహణ, ఇందులో అరుదైన రికార్డులు సృష్టిస్తోన్న మహిళల గురించి తెలుసుకుందామె. వారిలాగే తానూ సాహసాలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆసక్తే నెమ్మదిగా ఆమెను పర్వతారోహణ వైపు అడుగులు వేయించింది.

అనితర సాధ్యమైనవీ అధిగమించి..!

ప్రస్తుతం ఎన్‌సీసీ ‘67 యూపీ బెటాలియన్‌’లో అండర్ ఆఫీసర్‌గా ఉన్న షాలిని.. పర్వతారోహణపై మక్కువతో గతేడాది జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ప్రాథమిక మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తిచేసింది. ఆపై అఖిల భారత స్థాయిలో నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ మౌంటెనీరింగ్‌ కోర్సుకు అర్హత సాధించింది. ఈ కోర్సుకు 45 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్‌ అర్హత సాధించగా.. అందులో షాలిని ఒక్కర్తే మహిళ కావడం విశేషం. నెల రోజుల పాటు సాగిన ఈ శిక్షణలో భాగంగా.. ఆమె అనితర సాధ్యమైన సాహసాల్ని సైతం పూర్తిచేసింది. ఈ క్రమంలో ఉత్తరకాశీ ప్రాంతంలోని డ్రింగ్‌ లోయలో 15,400 అడుగుల ఎత్తులో ఉన్న హుర్రా శిఖరాన్ని అధిరోహించిందామె. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతతో, గడ్డకట్టే చలిలో మంచుదుప్పటి కప్పుకున్న ఈ పర్వతాన్ని అధిరోహించడం అనన్య సామాన్యం అని చెప్పాలి. అయినా పట్టు వీడకుండా ఆ పర్వతాన్ని అధిరోహించిందామె. ఇక ఏప్రిల్‌ 26-మే 6 వరకు సముద్ర మట్టం నుంచి 4,200 అడుగుల ఎత్తులో ఆర్మీ శిక్షకుల దగ్గర తన బృందంతో కలిసి ప్రత్యేకమైన శిక్షణ తీసుకుందామె. ఇలా మొత్తానికి ఇటీవలే అడ్వాన్స్‌డ్‌ మౌంటెనీరింగ్‌ కోర్సు దిగ్విజయంగా పూర్తిచేసింది షాలిని. తద్వారా దేశంలోనే అధునాతన మౌంటెనీరింగ్‌ కోర్సు పూర్తిచేసిన తొలి మహిళా ఎన్‌సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది.

వాళ్లకు స్ఫూర్తినిస్తే చాలు!

షాలిని సాహసాలకు, ఆమె చూపిన తెగువకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎన్‌సీసీ ‘67 యూపీ బెటాలియన్‌’ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ పునీత్‌ శ్రీవాస్తవ ఆమె ప్రతిభను ప్రశంసించారు. అయితే తనలా సాహసాలు చేయాలనుకునే అమ్మాయిలకు తానో ఉదాహరణగా, స్ఫూర్తిగా నిలిస్తే చాలంటోందీ పర్వతారోహకురాలు. ‘తపన, సాధించాలన్న పట్టుదల ఉంటే ఎంతటి కఠినమైన శిక్షణనైనా పూర్తిచేసే సమర్థత మన సొంతమవుతుంది. ఈ శిక్షణలో భాగంగా ఎన్నో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సాహసాలు చేయాల్సి వచ్చింది. అయినా ఆత్మవిశ్వాసంతోనే వాటిని పూర్తిచేశా. నా విజయం నాలా సాహసాలు చేయాలనుకునే అమ్మాయిల్లో స్ఫూర్తి నింపితే చాలు..’ అంటోన్న షాలిని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాల్ని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్