అలా ‘మనీ’ పాఠాలు ఈజీగా చెప్పేస్తోంది!

చాలామందికి ఆర్థికాంశాలు ఓ పట్టాన అర్థం కావు. చేతి నిండా డబ్బు సంపాదిస్తాం.. కానీ దాన్ని ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ మదుపు చేయాలో.. ఇప్పటికీ కొంతమందికి సందేహమే! ఇక స్టాక్స్‌, బాండ్స్‌.. గురించి చెప్పనక్కర్లేదు. అదో ఆర్థిక సముద్రం. మరి, ఇలాంటి క్లిష్టమైన...

Published : 23 Jun 2023 12:36 IST

(Photos: Instagram)

చాలామందికి ఆర్థికాంశాలు ఓ పట్టాన అర్థం కావు. చేతి నిండా డబ్బు సంపాదిస్తాం.. కానీ దాన్ని ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ మదుపు చేయాలో.. ఇప్పటికీ కొంతమందికి సందేహమే! ఇక స్టాక్స్‌, బాండ్స్‌.. గురించి చెప్పనక్కర్లేదు. అదో ఆర్థిక సముద్రం. మరి, ఇలాంటి క్లిష్టమైన అంశాల్ని స్పష్టంగా, సరళంగా, సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తోంది దిల్లీకి చెందిన శ్రేయా కపూర్‌. ఇందుకోసం కొన్ని పాత్రలు సృష్టించి, వాటి ద్వారా ఎంతోమంది ఆర్థిక సందేహాలు తీర్చుతోందామె. ప్రస్తుతం ‘యువర్‌ మనీ కోచ్‌’ అనే ఇన్‌స్టా పేజీ వేదికగా ఆర్థిక సలహాలిస్తోన్న శ్రేయకు లక్షల కొద్దీ ఫాలోవర్లున్నారు. అనుకోకుండా ఈ రంగంలోకొచ్చి.. కంటెంట్‌ క్రియేటర్‌గా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ మనీ ఎక్స్‌పర్ట్‌ సక్సెస్‌ స్టోరీ తెలుసుకుందాం రండి..

దిల్లీ అమ్మాయి శ్రేయ చిన్నతనం నుంచి చదువులో మెరుగ్గా రాణించేది. దీనికి తోడు ఆర్థికాంశాల గురించి తెలుసుకోవడానికి మక్కువ చూపేది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ప్రముఖ ఎమ్మెన్సీలో ఉద్యోగం సంపాదించిన ఆమె.. రెండేళ్ల పాటు అందులో సీనియర్‌ అనలిస్ట్‌గా పని చేసింది. ఆపై కొన్నాళ్ల పాటు ఫ్రీలాన్సర్‌గానూ కొనసాగింది.

అదే టర్నింగ్ పాయింట్!

ఇలా తన కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల గురించి తనకు తెలిసిన సమాచారాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునేది శ్రేయ. ఆయా విషయాల గురించి వారు అడిగే సందేహాల్ని నివృత్తి చేసేది. ఇదే కంటెంట్‌ క్రియేషన్‌పై ఆసక్తిని రేకెత్తించిందని చెబుతోందామె.

‘నిజానికి కంటెంట్‌ క్రియేషన్‌ నా లక్ష్యాల జాబితాలో లేనే లేదు. కానీ అనుకోకుండా ఇదే నా కెరీర్‌గా మారిపోయింది. నా స్నేహితుల్లో చాలామందిది చదువులో ఆర్థికేతర నేపథ్యం. దాంతో ఆయా ఆర్థిక విషయాల్లో వారికి పూర్తి అవగాహన లేకపోవడంతో.. పొదుపు-మదుపు, ఆదాయపు పన్నుల గురించి నన్ను పదే పదే ప్రశ్నలడిగేవారు. నాకున్న నాలెడ్జ్‌తో వారి సందేహాల్ని నివృత్తి చేసేదాన్ని. ఇక మరో సందర్భంలో నేను ఓ ఫిన్‌టెక్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు.. నా ఫ్రెండ్‌ ఒకరు తన యూట్యూబ్‌ ఛానల్‌ కోసం నా ఆర్థిక సలహాలు కావాలని అడిగారు. అలా అందులో పాలుపంచుకోవడంతో కంటెంట్‌ క్రియేషన్‌పై క్రమంగా నాకు మక్కువ పెరిగింది.. ఈ ఆసక్తే ఈ రంగంలోకొచ్చేందుకు కారణమైంది..’ అంటూ చెప్పుకొచ్చింది శ్రేయ.

ప్రశ్నల నుంచి వీడియోల దాకా..!

2020 లాక్‌డౌన్‌ సమయంలో కంటెంట్‌ క్రియేటర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రేయ.. తొలుత తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తన ఫ్రెండ్స్‌, తెలిసినవారు, బంధువులు.. ఆర్థిక అంశాలపై అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానమిచ్చేది. ఇలా తన వివరణ, విశ్లేషణాత్మక పద్ధతి నచ్చడంతో.. సోషల్‌ మీడియాలో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది.

‘సామాజిక మాధ్యమాల్లో నా కంటెంట్‌కు ఆదరణ పెరుగుతున్నప్పుడే.. దీన్ని మరింతమందికి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ ఆలోచనతోనే 2021లో ‘యువర్‌ మనీ కోచ్‌’ పేరుతో ప్రత్యేకంగా ఇన్‌స్టా పేజీ తెరిచా. అప్పట్నుంచి ఈ వేదికగా ఆర్థిక అంశాలకు సంబంధించిన కంటెంట్‌, చిట్కాలను అందిస్తున్నా. మొదట్లో కెమెరా ముందుకు రావాలంటే కాస్త నెర్వస్‌గా, సిగ్గుగా ఫీలయ్యేదాన్ని. కానీ క్రమంగా ఆ ఫీలింగ్‌ని దూరం చేసుకున్నా. ఆపై వీడియోల రూపంలోనూ కంటెంట్‌ను అందించడం మొదలుపెట్టా..’ అంటోందీ యువ ఆర్థిక నిపుణురాలు. ప్రస్తుతం రుణాలు, బీమా, స్టాక్‌ మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌, తక్కువ ధరల్లోనే ప్రయాణాలు చేయడమెలా?, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు మనీ టిప్స్‌, క్రెడిట్‌ కార్డును ఎలా సద్వినియోగం చేసుకోవాలి?.. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రేయ టచ్‌ చేయని ఆర్థిక అంశం లేదంటే అతిశయోక్తి కాదు.

క్యారక్టర్లు.. క్యాప్షన్లతో..!

నిజానికి ఆర్థిక అంశాలు ఎంత క్షుణ్ణంగా వివరించినా ఓ పట్టాన అర్థం కావు. అందుకే సరళంగా, సులభంగా అర్థమయ్యేందుకు తనకు తానే కొన్ని పాత్రల్ని సృష్టించుకొని, వాటిలో పరకాయ ప్రవేశం చేస్తోంది శ్రేయ. అంతేకాదు.. వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్లను జోడిస్తూ.. ఆర్థిక విషయాలు తెలుసుకోవాలన్న మక్కువనూ అందరిలో పెంచుతోందామె.

‘ఆర్థిక విషయాలు ఎంత లోతుగా వివరించినా ఇంకా పలు సందేహాలు తలెత్తుతూనే ఉంటాయి. కొంతమందికైతే వీటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు. కానీ వీటికి సంబంధించిన ప్రాథమిక అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. అందుకే ముందు అందరిలో ఈ విషయాలపై ఆసక్తిని పెంచేందుకు స్వయంగా కొన్ని క్యారక్టర్లు సృష్టించుకున్నా. హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా, బ్యాంకర్‌గా, సౌత్‌ దిల్లీ ఆంటీగా, ట్రావెల్‌ గైడ్‌గా.. ఇలా ఆయా అంశాల్ని బట్టి ఆ క్యారక్టర్‌లోకి దూరిపోతా. టాపిక్‌ను బట్టి నేను రూపొందించే వీడియోకు సంబంధిత బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా జత చేస్తా. మరి, ఇతరులకు సలహాలివ్వాలంటే నేనూ ఈ ఆర్థిక విషయాల్లో ఎప్పటికప్పుడు జరిగే మార్పులు, కొత్త విషయాల గురించి అవగాహన పెంచుకోవాలి కదా! ఇందుకోసం రోజూ జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికలు, బిజినెస్‌ పత్రికలు చదవడంతో పాటు పలు ఫైనాన్షియల్‌ బ్లాగ్స్‌ని కూడా ఫాలో అవుతున్నా..’ అంటోంది శ్రేయ.

ఆర్థికాంశాల్లో నైపుణ్యం కలిగిన యువ ప్రతిభావంతుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న శ్రేయ.. గతేడాది ‘లింక్డిన్‌ టాప్‌ వాయిస్‌ బ్యాడ్జ్‌’నూ అందుకుంది. తద్వారా సక్సెస్‌ఫుల్‌ సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గానూ తనను తాను నిరూపించుకుంది. ఈ యంగ్‌ గర్ల్‌కి ట్రావెలింగ్‌ అన్నా మక్కువేనట! ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దేశాల్ని చుట్టొచ్చిన ఆమె.. తన ట్రావెలింగ్‌ డైరీస్‌నీ ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్