Limbo Skating: తన రికార్డులు తానే బద్దలుకొడుతోంది!

భూమి నుంచి 30 సెం.మీ. ఎత్తులో ఉన్న పోల్స్‌ కింది నుంచి అత్యంత వేగంగా 50 మీటర్లు స్కేటింగ్‌ చేసినందుకు గాను తాజాగా గిన్నిస్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది సృష్టి. మరి, ఇలాంటి అరుదైన రికార్డుల వేటే తన లక్ష్యమంటోన్న ఈ సూపర్‌ స్కేటర్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

Updated : 22 Jul 2023 18:18 IST

సాహసాలు చేయడమంటే చాలామంది భయపడుతుంటారు. కానీ కొందరు మాత్రం వాటినే ఊపిరిగా భావించి తమకంటూ ఓ ప్రత్యేకత సాధించుకుంటారు. మహారాష్ట్రకు చెందిన 18 ఏళ్ల సృష్టి శర్మ ఇందుకు మినహాయింపు కాదు. స్కేటింగే ఓ సాహసమంటే.. లింబో స్కేటింగ్‌ వంటి క్లిష్టమైన క్రీడలో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టిస్తోందీ అమ్మాయి. పదకొండేళ్ల వయసులోనే తన విన్యాసాలతో గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్న ఈ చిన్నది.. తన గత రికార్డుల్ని తానే బద్దలుకొడుతూ.. ఇటీవల మరోసారి ప్రపంచ రికార్డును నమోదు చేసింది. భూమి నుంచి 30 సెం.మీ. ఎత్తులో ఉన్న పోల్స్‌ కింది నుంచి అత్యంత వేగంగా 50 మీటర్లు స్కేటింగ్‌ చేసినందుకు గాను తాజాగా గిన్నిస్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది సృష్టి. మరి, ఇలాంటి అరుదైన రికార్డుల వేటే తన లక్ష్యమంటోన్న ఈ సూపర్‌ స్కేటర్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

‘ఆసక్తి ఉన్న అంశాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించగలరు..’ సృష్టి తండ్రి ధర్మేంద్ర శర్మ ఇదే సిద్ధాంతాన్ని నమ్మారు. చిన్న వయసు నుంచే స్కేటింగ్‌పై మక్కువ చూపిన తన కూతురిని ఇందులోనే ప్రోత్సహించారు. ‘లక్ష్యంపై స్పష్టత ఉన్నప్పుడు అందలాన్ని అందుకోవచ్చు.. లింబో స్కేటింగ్‌లో ఆరితేరాలని నా చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. నా మక్కువకు అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా తోడవడంతో రికార్డుల సాధనే ఆశయంగా పెట్టుకున్నా..’ అంటోంది సృష్టి.

11 ఏళ్లకే గిన్నిస్‌లో చోటు!

శిక్షణ కోసం ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. లింబో స్కేటింగ్‌, ఐస్‌ స్కేటింగ్‌లో ఆరితేరింది సృష్టి. ఈ క్రమంలోనే 2015లో తన 11 ఏళ్ల వయసులో తొలిసారి గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా పోటీలో పాల్గొందామె. ఇందులో భాగంగా.. భూమి నుంచి 17 సెం.మీ. ఎత్తులో పేర్చిన 25 బార్ల కింది నుంచి 25 మీటర్లు స్కేటింగ్‌ చేసి.. ‘అతి తక్కువ ఎత్తులో స్కేటింగ్‌ చేసినందుకు’ గాను గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది సృష్టి. ఈ రికార్డు ఇప్పటికీ ఆమె పేరిటే ఉంది. ఇక 2017లో ఐస్‌ రింక్‌పై మరోసారి సత్తా చాటిందామె. ఈ క్రమంలో భూమి నుంచి 17.78 సెం.మీ. ఎత్తులో పది మీటర్ల పాటు స్కేటింగ్‌ చేసి.. ‘అతి తక్కువ ఎత్తులో లింబో ఐస్‌ స్కేటింగ్‌’ చేసిన అమ్మాయిగా గిన్నిస్‌ బుక్‌లో మరోసారి స్థానం సంపాదించుకుందామె. దీన్నీ ఇప్పటికీ ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు. ఇక 2021లో 50 మీటర్ల దూరాన్ని 7.38 సెకన్లలో అధిగమించిన ఆమె.. అత్యంత వేగంగా లింబో స్కేటింగ్‌ చేసినందుకు గాను ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇలా లింబో స్కేటింగ్‌లో అనితర సాధ్యమైన రికార్డుల్ని సృష్టిస్తూ.. తన రికార్డులు తానే బద్దలుకొడుతూ.. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతోందీ యువ స్కేటర్.

గాయాలైనా.. తట్టుకొని..!

అయితే తాజాగా తన గత రికార్డును తానే బద్దలుకొట్టింది సృష్టి. భూమి నుంచి 30 సెం.మీ. ఎత్తులో పేర్చిన పోల్స్‌ కింది నుంచి 50 మీటర్ల దూరం లింబో స్కేట్‌ చేసింది. ఈ క్రమంలో పోల్స్‌ కింది నుంచి జారుతూ.. తన శరీరం భూమిని, పోల్స్‌ని తాకకుండా బ్యాలన్స్‌ చేసుకోగలిగింది. మరోవైపు ఎక్కడా వేగం తగ్గకుండా జాగ్రత్తపడింది. ఇలా ఈ దూరాన్ని 6.94 సెకన్లలో పూర్తి చేసి.. గత రికార్డును తిరగరాసిందీ టీన్‌ స్కేటర్‌. తద్వారా అత్యంత వేగంగా లింబో స్కేట్‌ చేసిన అమ్మాయిగా గిన్నిస్‌ బుక్‌లో మరోసారి తన పేరును చేర్చుకుంది.
‘పట్టుదల, సాధనతోనే ఇది సాధ్యమైంది. గత రికార్డును బద్దలుకొట్టడానికి నెలల తరబడి సాధన చేశాను. కొన్నిసార్లు గాయాలు కూడా నాకు సవాలుగా మారాయి. అయినా అన్నీ తట్టుకుంటూ ముందుకు సాగుతున్నా.. కొత్త రికార్డులు సృష్టించడం, పాత రికార్డులు తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ గర్ల్.

బాలికల శ్రేయస్సు కోసం..!

చదువు, లింబో స్కేటింగ్‌లోనే కాదు.. సమాజ సేవలోనూ ముందుంది సృష్టి. ప్రస్తుతం ‘సేవ్‌ ది గర్ల్‌ ఛైల్డ్‌’ అనే ప్రాజెక్ట్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ఆమె.. రికార్డులతో తాను సంపాదిస్తోన్న డబ్బునంతా బాలికల శ్రేయస్సు కోసం వినియోగిస్తోంది. ‘ఇప్పటికీ అమ్మాయిల్ని చిన్నచూపు చూసే వారు మన సమాజంలో ఉన్నారు. కానీ కాస్త ప్రోత్సాహాన్ని అందించి.. నచ్చిన రంగాల్లో వెన్నుతడితే ఆడపిల్లలు ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఈ తరం అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోరు.. ఎన్నో రంగాల్లో ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు..’ అంటోంది సృష్టి. ఇలా బాలికల అభ్యున్నతికి పాటుపడడంతో పాటు.. తన పుట్టినరోజు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో పేదలకు సహాయం కూడా చేస్తుంటుందీ యంగ్‌ స్కేటర్.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్