చదివింది సీఏ.. మనసేమో పెయింటింగ్స్ వేయమంది!

పెయింటింగ్‌ అనగానే.. పికాసో వేసిన చిత్రాలే గుర్తొస్తాయి. నిజ జీవితానికి దగ్గరగా ఎంతో అద్భుతంగా ఉంటాయివి. ఇలాంటి అద్భుతమైన చిత్తరువులను తానూ సృష్టించాలనుకుంది  బెంగళూరుకు చెందిన శ్వేత. చదివింది సీఏ అయినా.. పెయింటింగ్‌పై మక్కువతో దీన్నే తన పూర్తి స్థాయి....

Published : 06 Oct 2022 15:50 IST

(Photos: Instagram)

పెయింటింగ్‌ అనగానే.. పికాసో వేసిన చిత్రాలే గుర్తొస్తాయి. నిజ జీవితానికి దగ్గరగా ఎంతో అద్భుతంగా ఉంటాయివి. ఇలాంటి అద్భుతమైన చిత్తరువులను తానూ సృష్టించాలనుకుంది  బెంగళూరుకు చెందిన శ్వేత. చదివింది సీఏ అయినా.. పెయింటింగ్‌పై మక్కువతో దీన్నే తన పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకుందామె. తన ఊహల్ని కాన్వాస్‌పై చిత్రీకరిస్తూ.. వినియోగదారుల అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ.. ఆమె వేసే చిత్రాలు ఆమెకు పేరు ప్రఖ్యాతులే కాదు.. బోలెడంత డబ్బూ సంపాదించి పెడుతున్నాయి. ‘సీఏను కెరీర్‌గా ఎంచుకుంటే జీవితంలో ఇంత సంతృప్తి దక్కేది కాదేమో!’ అంటోన్న శ్వేత.. నచ్చిన అంశాన్ని ఎంచుకుంటేనే విజయం, ఆనందం.. రెండూ మన సొంతమవుతాయని నిరూపిస్తోంది.

శ్వేత చిన్న వయసు నుంచే చదువులో మహా చురుకు. గణితం, డ్రాయింగ్‌ సబ్జెక్టుల్లో క్లాసులో ప్రతిసారీ తానే ఫస్టొచ్చేది. ఈ ఇష్టంతోనే స్కూల్లో ఎన్నో పెయింటింగ్‌ పోటీల్లో పాల్గొని బోలెడన్ని అవార్డులూ గెలుచుకుంది శ్వేత. అయితే ఈ కళను ఓ అభిరుచిగానే పరిగణించిన ఆమె.. సీఏ పూర్తి చేసింది. 2016లో ఈ పరీక్షల్లో అర్హత సాధించిన శ్వేత.. ‘ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ సభ్యురాలిగానూ ఎంపికైంది.

సవాలని తెలిసినా..!

అలాగని పెయింటింగ్‌ని వదిలిపెట్టాలన్న ఆలోచన ఆమెకు అస్సలు లేదు. మొదట కొన్నేళ్ల పాటు సీఏ వృత్తిలో ఉండి.. ఆ తర్వాత ఈ కళపై పూర్తి దృష్టి పెట్టాలనుకుంది శ్వేత. కానీ ఇందుకు తన మనసు అంగీకరించలేదంటోందామె.
‘సీఏ, పెయింటింగ్‌.. ఈ రెండూ నాకు ఇష్టమైన సబ్జెక్టులే..! దేన్నీ వదులుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే ఏది ఎంచుకోవాలో తేల్చుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. బాగా ఆలోచించాక నా మనసు పెయింటింగ్‌ వైపే మొగ్గు చూపింది. కెరీర్‌, సంతృప్తి.. రెండూ ఇందులోనే ఉన్నాయనిపించింది. అందుకే పెయింటింగ్‌ని నా పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకున్నా. సీఏతో పోల్చితే ఇందులోనే సవాళ్లు ఎక్కువ! అయినా సరే.. నేను ఇందులోనే విజయం సాధించగలనన్న పూర్తి నమ్మకంతో పెయింటింగ్స్‌ వేయడం మొదలుపెట్టా..’ అంటుందీ యువ పెయింటర్.

సంతృప్తి, సంతోషం.. రెండూ!

ఎంతో మక్కువతో పెయింటింగ్‌ని ఎంచుకున్న శ్వేత.. అంతే అంకితభావంతో తన కెరీర్‌ని కొనసాగిస్తోంది. తన సృజనాత్మకత, ఊహాశక్తిని కాన్వాస్‌పై చిత్రాలుగా మలుస్తోంది. వాటిని ఎగ్జిబిషన్లు, సోషల్‌ మీడియా వేదిక ద్వారా విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తోంది.
‘సొంతంగా చిత్తరువులు వేయడమే కాదు.. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా కస్టమైజ్‌డ్‌ పెయింటింగ్స్‌ కూడా వేస్తున్నా.. నేను వేసే చిత్రాలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. అందుకే దేశవిదేశాల నుంచి ఆర్డర్లూ అందుకుంటున్నా. పెయింటింగ్‌ కాకుండా సీఏ ఎంచుకుంటే నాకు ఇంత సంతృప్తి, సంతోషం దక్కేవి కాదేమో! ఆకట్టుకునే రంగులు, విభిన్న ఆకృతులు-డిజైన్లు, కాన్వాస్‌.. నేనెక్కడున్నా నా కళ్లు వీటినే వెతుకుతుంటాయి..’ అంటూ ఈ కళ అంటే తనకు ఎంత మక్కువో చెప్పుకొచ్చింది శ్వేత. ఇలా మాటలే కాదు.. తన చేతలూ ఈ కళపై తనకున్న మక్కువను చాటుతాయి. అంటే.. ఆమె వేసే పెయింటింగ్స్‌ అంత వాస్తవికంగా, ఆకట్టుకునేలా ఉంటాయన్నమాట!

మనసు మాట వింటేనే..!

సీఏ లాంటి ఉన్నత వృత్తిలో స్థిరపడే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి.. సృజనాత్మకంగా, కష్టపడుతూ డబ్బు ఆర్జించడానికి ఎవరూ మొగ్గుచూపరు. అలాగని మన కలలను వదులుకొని అసంతృప్తిగా కెరీర్‌ని కొనసాగించినా అర్థం లేదంటోంది శ్వేత. ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.. అదే మనకు పేరు తీసుకొస్తుంది. ఆ తపనేంటో గుర్తించి.. దాన్నే కెరీర్‌గా మలచుకుంటే ఇక మనకు తిరుగుండదు. అంతేకానీ.. బంగారం లాంటి ఉద్యోగం/వృత్తిని వదులుకొని ఇంతలా కష్టపడాలా? అనుకున్నా, ఇతరులు అన్న మాటలు పట్టించుకున్నా.. అది జీవితంలో విజయం సాధించడం కాదు.. రాజీ పడడమే అవుతుంది..’ అంటూ తన మాటలతోనూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోందీ పెయింటింగ్‌ క్వీన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్