అది వ్యసనంగా మారిపోయిందా..?

వృత్తిపరంగా లేదా టైంపాస్‌ కావట్లేదంటూ.. ప్రస్తుతం చాలామంది డిజిటల్‌ ప్రపంచమే లోకంగా గడుపుతున్నారు. కానీ ఎంతలా దీనికి అలవాటు పడితే మన ఆరోగ్యంపై అంత ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు.. ఇది కుటుంబ బంధాలను సైతం దెబ్బతీస్తుంది.. పనిలో నాణ్యతను తగ్గిస్తుంది.. చదువుపై ఆసక్తినీ కోల్పోయేలా చేస్తుంది.. కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే గ్యాడ్జెట్స్‌ని వినియోగించుకోవాలి.

Updated : 29 Feb 2024 20:49 IST

వృత్తిపరంగా లేదా టైంపాస్‌ కావట్లేదంటూ.. ప్రస్తుతం చాలామంది డిజిటల్‌ ప్రపంచమే లోకంగా గడుపుతున్నారు. కానీ ఎంతలా దీనికి అలవాటు పడితే మన ఆరోగ్యంపై అంత ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు.. ఇది కుటుంబ బంధాలను సైతం దెబ్బతీస్తుంది.. పనిలో నాణ్యతను తగ్గిస్తుంది.. చదువుపై ఆసక్తినీ కోల్పోయేలా చేస్తుంది.. కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే గ్యాడ్జెట్స్‌ని వినియోగించుకోవాలి.

ఆలోచిస్తే ఆప్షన్లు బోలెడు!

ఒకవేళ టైంపాస్‌ కోసమే డిజిటల్‌ని ఆశ్రయిస్తున్నట్లయితే.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. ఈ క్రమంలో మీకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపచ్చు. ఆటలు, పాటలు, కళలు.. వంటి అంశాల్లో మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఆలోచించాలే గానీ ఇలాంటి ఆప్షన్స్ బోలెడున్నాయి. వీటివల్ల డిజిటల్‌ ప్రపంచం నుంచి కాస్త విరామం దొరకడంతో పాటు శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది.

8-8-8 రూల్!

రోజులో ఉండేదే 24 గంటలు. మరి ఎప్పుడూ డిజిటల్‌ ప్రపంచంలోనే మునిగి తేలితే ఇక నిద్రెప్పుడు పోతారు? ఇతర పనులన్నీ ఎప్పుడు పూర్తిచేసుకుంటారు? ఇలా నిరంతరం గ్యాడ్జెట్స్‌ మాయలో పడిపోయి చాలామందికి నిద్ర కరవవుతుంది. తద్వారా ఆరోగ్యానికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుంది. కాబట్టి అటు మీ పనిని, ఇటు నిద్రను, మీ కంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి.. ఇలా అన్నింటినీ సమన్వయం చేయాలంటే ‘8-8-8 రూల్‌’ పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు! అంటే.. 8 గంటలు మీ వృత్తికి, 8 గంటలు గ్యాడ్జెట్స్‌ని పక్కన పెట్టేసి హాయిగా నిద్ర పోవడానికి, మరో ఎనిమిది గంటలు ఇంటి పనులు పూర్తి చేసుకొని మీకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి వినియోగించండి.. ఇలా బ్యాలన్స్‌ చేసుకోగలిగితే జీవితం ఎంత ప్రశాంతంగా సాగుతుందో మీకే తెలుస్తుంది.

గ్యాడ్జెట్స్‌కీ వీక్లీ-ఆఫ్!

వృత్తిరీత్యా మనకు వారాంతాల్లో ఒకటి లేదా రెండు రోజులు సెలవులుంటాయి.. కానీ గ్యాడ్జెట్స్‌కు మాత్రం మనం ఒక్క పూటైనా సెలవివ్వం. ఇలా నిర్విరామంగా పనిచేయడం వల్ల అవి అలసిపోతాయో లేదో గానీ.. మనమైతే విపరీతంగా అలసిపోవడం ఖాయం. ఎందుకంటే వారంలో ఐదారు రోజులు పనిలో భాగంగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతాం.. డిజిటల్‌ లోకంలోనే విహరిస్తాం.. తద్వారా ఎదురయ్యే ఒత్తిడి నుంచి రిలాక్సవడానికే వారాంతాల్లో వచ్చే సెలవులు ఉపయోగపడతాయి. అలాంటిది అప్పుడు కూడా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతామంటే ఎలా చెప్పండి? ఇలా అయితే మానసిక ప్రశాంతత ఎప్పుడు దొరుకుతుంది?

అందుకే వారాంతాల్లో మీరు కూడా మీ గ్యాడ్జెట్స్‌కి వీక్లీ-ఆఫ్‌ ఇచ్చేయండి..! మరీ రోజంతా అంటే కష్టమనుకుంటే కనీసం ఓ పూటైనా వాటిని కనికరించండి! ఆ సమయంలో హాయిగా నిద్రపోండి.. కాసేపు వ్యాయామం చేయండి.. కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పండి.. ఇలా కనీసం వారానికొకసారైనా అలవాటు చేసుకున్నారంటే మీలోని ఒత్తిళ్లు, ఆందోళనలు అన్నీ హుష్‌కాకి అయిపోవాల్సిందే! శరీరానికైనా, మనసుకైనా ఇంతకుమించిన రిలాక్సేషన్‌ ఏముంటుంది చెప్పండి!

అనవసరంగా ముప్పు కొని తెచ్చుకోవద్దు!

సోషల్‌ మీడియా ఉపయోగించడం ఇప్పుడు అందరికీ కామనైపోయింది. అయితే వాటిని అవసరం కోసం వినియోగించుకొనే వారు కొందరైతే.. టైంపాస్‌ అంటూ వాటి వెంట పడే వారు మరికొందరు. దేన్నైనా అతిగా వాడితే మొదటికే మోసమొస్తుంది. ఉదాహరణకు.. అవసరం లేకపోయినా కొంతమంది ప్రతి ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. దీనికి తోడు చిన్న పిల్లల ఫొటోలు, సమాచారం కూడా అందులో షేర్‌ చేస్తుంటారు. అసలే ఆన్‌లైన్‌ మోసాలు, ఫొటో మార్ఫింగ్స్, డీప్‌ ఫేక్‌లు, ఖాతాల్ని హ్యాక్‌ చేసి వాటిని దుర్వినియోగపరచడం.. వంటివి ఎక్కువగా జరుగుతోన్న ఈ రోజుల్లో సోషల్‌ మీడియాను వీలైనంత తక్కువగా వాడుకోవడం ఉత్తమం. అది కూడా అవసరమైతేనే అకౌంట్స్‌ క్రియేట్ చేసుకోవడం, దాన్ని అందరికీ కనిపించేలా కాకుండా ప్రైవేట్‌గా ఉంచుకోవడం.. ఇలా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా అవసరమున్నప్పుడే వాటిని వినియోగించుకుంటాం కాబట్టి స్క్రీన్‌ టైమ్‌ని కాస్త తగ్గించచ్చు.. ఆ విలువైన సమయంలో మరో పని పూర్తిచేసుకోవచ్చు. ఇది శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను అందిస్తుంది.

ఇవి కూడా!

⚛ చాలామంది ఖాళీగా కూర్చున్నారంటే చాలు.. చేతులు ఫోన్‌ దగ్గరికే పరుగులు పెడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికీ రోజువారీ ప్రణాళిక తప్పనిసరి. దాని ప్రకారమే వ్యాయామం, ఆఫీస్‌ పని, ఇంటి పని, పిల్లల బాధ్యత, కుటుంబంతో గడపడం, నిద్రపోవడం.. వీటన్నింటినీ బ్యాలన్స్‌ చేసుకోవచ్చు.. తద్వారా డిజిటల్‌ ప్రపంచంలో విహరించే సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

⚛ ఫోన్‌, ల్యాపీ.. ఇలా వీటిని మన ఖాళీ సమయాల్లో కూడా వెంటే ఉంచుకోవడం వల్ల పదే పదే వాటి పైకే మన దృష్టి మళ్లుతుంది. అందుకే డిజిటల్‌ డీటాక్స్‌లో భాగంగా వాటిని మన కంటికి కనిపించనంత దూరంగా పెట్టేయడం మంచిది. తద్వారా మనం చేసే ఇతర పనులపై పూర్తి శ్రద్ధ పెట్టచ్చు.

⚛ డిజిటల్‌ డీటాక్స్‌ని ఇంట్లో మీరొక్కరే పాటిస్తూ.. ఇతరులు విచ్చలవిడిగా గ్యాడ్జెట్స్‌తోనే గడుపుతున్నారనుకోండి.. మీకూ వాటి పైకే మనసు మళ్లుతుంది. కాబట్టి ఈ పద్ధతిని ఇంట్లో అందరూ పాటించేలా ఒక నియమం పెట్టుకోండి.. కావాలంటే ‘ఈ పద్ధతిని ఎవరు ఎక్కువసేపు పాటిస్తారో చూద్దాం..!’ అంటూ ఓ ఛాలెంజ్ విసురుకోండి.. ఈ సమయంలో అందరూ కలిసి ఏదో ఒక గేమ్‌ ఆడడం, వంటలో ఒకరికొకరు సహాయపడడం.. వంటివి చేయచ్చు. ఇలా చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.. అనుబంధాలూ దృఢమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్