సోషల్‌ మీడియా నుంచి.. కేన్స్‌ వేదిక పైకి.. ఎవరీ నాన్సీ?!

కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఎవర్‌గ్రీన్‌గా మెరిసిపోవాలనుకుంటారు అందాల తారలు. ఈ క్రమంలోనే ప్రముఖ డిజైనర్ల సృజనతో, తమ అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకుంటారు. కానీ నాన్సీ త్యాగి మాత్రం అలా చేయలేదు. తొలిసారి రెడ్‌కార్పెట్‌పై తన లుక్‌ కోసం తనకు తానే డిజైనర్‌ అయింది....

Published : 21 May 2024 12:58 IST

(Photos : Instagram)

కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఎవర్‌గ్రీన్‌గా మెరిసిపోవాలనుకుంటారు అందాల తారలు. ఈ క్రమంలోనే ప్రముఖ డిజైనర్ల సృజనతో, తమ అభిరుచులకు అనుగుణంగా ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని కస్టమైజ్‌ చేయించుకుంటారు. కానీ నాన్సీ త్యాగి మాత్రం అలా చేయలేదు. తొలిసారి రెడ్‌కార్పెట్‌పై తన లుక్‌ కోసం తనకు తానే డిజైనర్‌ అయింది. తన అభిరుచులకు సృజనాత్మకతను జోడించి.. అందమైన గౌన్‌ను స్వయంగా డిజైన్‌ చేసుకుంది. ఇదే గౌన్‌లో కేన్స్‌ వేదికపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ లుక్‌కు అక్కడున్న వారే కాదు.. ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. నాన్సీ తన రెడ్‌కార్పెట్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. మరి, కేన్స్‌ వంటి ప్రముఖ చిత్రోత్సవం నుంచి తొలిసారి పిలుపు అందుకున్న ఈ అమ్మాయెవరు? ఆమె గౌన్‌ కథేంటో తెలుసుకుందాం రండి..

కేన్స్‌ చిత్రోత్సవంలో అంతర్జాతీయంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలే కాదు.. గ్లోబల్‌ స్టార్స్‌ ధరించే ఫ్యాషనబుల్‌ దుస్తులూ ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలుస్తుంటాయి. అలా ఈసారి కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై మెరిసిన కొందరు భారతీయ భామలు తమ అవుట్‌ఫిట్స్‌తో మాయ చేశారు. వారిలో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నాన్సీ త్యాగి ధరించిన అందమైన గౌన్‌ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ గౌన్‌ని తనకు తానే స్వయంగా డిజైన్‌ చేసుకుంది నాన్సీ!

20 కిలోలు.. 30 రోజులు!
ఈసారి కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై మెరిసిన భారతీయ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లలో నాన్సీ ఒకరు. తొలిసారి తనకు ఈ అవకాశం దక్కడంతో.. మరింతగా మురిసిపోయిన ఈ అమ్మాయి.. తన డ్రీమీ అవుట్‌ఫిట్‌తోనే ఈ చిత్రోత్సవంలో పాల్గొనాలనుకుంది. ఈ క్రమంలోనే తనలోని సృజనాత్మకతను, ఫ్యాషన్‌ నైపుణ్యాల్ని రంగరించి ఓ అందమైన గౌన్‌ని తయారుచేసుకుంది. లేత గులాబీ రంగులో రఫుల్స్‌ తరహాలో కుట్టుకున్న ఈ స్ట్రాప్‌లెస్‌ గౌన్‌ని వెడల్పాటి లేయర్లుగా తీర్చిదిద్దింది. ఇక దీనికి వెనుక వైపు ఉన్న పొడవాటి వెయిల్‌ డ్రస్‌ అందాన్ని రెట్టింపు చేసిందని చెప్పచ్చు.
‘కేన్స్‌ చిత్రోత్సవంలో తొలిసారి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నా అభిరుచులు, సృజనాత్మకత, ఫ్యాషన్‌ నైపుణ్యాల్ని రంగరించి ఈ పింక్‌ గౌన్‌ని స్వయంగా డిజైన్‌ చేసుకున్నా. ఇందుకోసం సుమారు వెయ్యి మీటర్ల స్క్రాచ్‌/డ్యామేజ్‌డ్‌ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించా. 20 కిలోల బరువున్న ఈ గౌన్‌ను డిజైన్‌ చేయడానికి సరిగ్గా 30 రోజుల సమయం పట్టింది. నా శ్రమ ఫలించింది.. మీ ఆశీస్సులూ దక్కాయి..’ అంటూ సంబరపడిపోతోంది నాన్సీ.
తన అవుట్‌ఫిట్‌కు జతగా మెడలో సిల్వర్‌ చెయిన్‌, ఇయర్‌ స్టడ్స్‌, వదులైన హెయిర్‌స్టైల్‌, చేతులకు ఎల్బో-హై గ్లోవ్స్‌ ధరించి.. అచ్చం దేవకన్యలా మెరిసిపోయిందీ ఇన్‌స్టా బ్యూటీ. ఇలా ఈ గౌన్‌లో రెడ్‌కార్పెట్‌పై తళుక్కుమన్న ఫొటోల్ని నాన్సీ తన సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అవి వైరల్‌గా మారాయి. ‘సూపర్‌ అవుట్‌ఫిట్‌.. సూపర్‌ డెబ్యూ’ అంటూ చాలామంది ఆమెను, ఆమె పనితనాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. కేన్స్‌ వేదికపై ఈ పింక్‌ గౌన్‌లోనే కాదు.. మరో స్టైలిష్‌ శారీ లుక్‌లోనూ దర్శనమిచ్చింది నాన్సీ. అది కూడా ఆమే స్వయంగా రూపొందించుకోవడం విశేషం!


సివిల్స్‌ రాయాలనుకొని..!

నాన్సీది ఉత్తరప్రదేశ్‌లోని బర్నావా అనే చిన్న గ్రామం. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. భవిష్యత్తులో సివిల్స్‌ సాధించి దేశ సేవ చేయాలని సంకల్పించుకుంది. ఈ కలతోనే ఇంటర్‌ పూర్తయ్యాక సివిల్స్‌లో శిక్షణ తీసుకునేందుకు దిల్లీ వెళ్లింది. అదే సమయంలో కొవిడ్‌ విజృంభణతో దేశమంతా లాక్‌డౌన్‌ విధించడంతో చేసేది లేక తిరిగి ఇంటికి చేరిందామె. నాన్సీకి ఫ్యాషన్‌ పైనా మక్కువ ఎక్కువే! ఈ క్రమంలోనే తనలోని సృజనకు పదును పెట్టి విభిన్న దుస్తులు రూపొందించి ధరించేదామె. తద్వారా తన స్నేహితులు, బంధువుల మెప్పూ పొందేది. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఇలా తాను రూపొందించిన విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్‌ కంటెంట్‌/వీడియోల్ని క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేదామె. దీంతో ఫ్యాషన్‌ క్రియేటర్‌గా ఆమెకు క్రమంగా పాపులారిటీ పెరిగింది. అందులోనూ తాను డిజైన్‌ చేసే ఫ్యాషనబుల్‌ దుస్తులు ప్రముఖ ఫ్యాషన్‌ లేబుల్స్‌ రూపొందించే మాస్టర్‌పీస్‌లకు ఏమాత్రం తీసిపోవనడంలో సందేహం లేదు. అంతేకాదు.. వీటిలో చాలావరకు స్థానిక టెక్స్‌టైల్‌ మార్కెట్ల నుంచి సేకరించిన డ్యామేజ్‌/స్క్రాచ్‌ పీసెస్‌తో రూపొందించినవే కావడం మరో విశేషం!

లక్షల్లో ఫాలోయింగ్‌..!
అంతేకాదు.. బాలీవుడ్‌ తారలు ధరించే విభిన్న దుస్తుల్ని ఉదాహరణగా తీసుకొని.. తన ఫ్యాషన్‌ సెన్స్‌తో అచ్చం అలాంటి అవుట్‌ఫిట్స్‌ని రీక్రియేట్‌ చేయడంలోనూ ఈ ఫ్యాషనర్‌ దిట్టే! ఇలా తాను రూపొందించే విభిన్న డ్రస్సులను ధరించి.. ఆ ఫొటోల్ని ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో పోస్ట్‌ చేయడమే కాదు.. ఈ మాధ్యమాల వేదికగా ఫ్యాషన్‌, బ్యూటీ చిట్కాల్ని సైతం అందిస్తుంటుంది నాన్సీ. ఇలా ఫ్యాషన్‌-బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, వీడియో క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్న ఈ చక్కనమ్మకు.. ప్రస్తుతం ఇన్‌స్టాలో 12 లక్షలకు పైగా, యూట్యూబ్‌లో 10 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.

తన ఫ్యాషన్‌ సెన్స్‌కి గుర్తింపుగా ఈ ఏడాది ‘నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు’ల్లో భాగంగా ‘డిస్రప్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘ది ఫ్యాషన్‌ ఫేవరెట్‌ హెరిటేజ్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. అనే రెండు కేటగిరీలకు నామినేట్‌ అయింది నాన్సీ. ఇక మరో ఫ్యాషన్‌ అవార్డుల వేదికపై ‘క్రియేటర్స్‌ ఫర్‌ గుడ్‌’ కేటగిరీలో ఆమెకు గుర్తింపు దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్