Women’s Cricket: వేతన వ్యత్యాసం తొలగింది.. ఇది నిజంగా మహర్దశే!

ఎకానమీ క్లాసుల్లో ప్రయాణం, అరకొరగా జరిగే మ్యాచ్‌లు, టెస్ట్‌ మ్యాచుల్లోనూ రోజులు-గంటలు కుదింపు, శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తూ గ్రౌండ్‌ వైశాల్యం తగ్గించడం, రోజువారీ అలవెన్సులు-మ్యాచ్‌ ఫీజుల్లోనూ పురుషులకు దరిదాపుల్లో కూడా లేనంత....

Published : 30 Oct 2022 14:07 IST

ఎకానమీ క్లాసుల్లో ప్రయాణం, అరకొరగా జరిగే మ్యాచ్‌లు, టెస్ట్‌ మ్యాచుల్లోనూ రోజులు-గంటలు కుదింపు, శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తూ గ్రౌండ్‌ వైశాల్యం తగ్గించడం, రోజువారీ అలవెన్సులు-మ్యాచ్‌ ఫీజుల్లోనూ పురుషులకు దరిదాపుల్లో కూడా లేనంత వ్యత్యాసం.. ఐదు దశాబ్దాల భారత మహిళల క్రికెట్‌లో అడుగడుగునా అసమానతలే స్వాగతం పలికాయి. కానీ గత కొన్నేళ్లుగా ఈ సమీకరణాలు మారుతున్నాయి. పురుషులతో సమానంగా బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణాలు, మ్యాచ్‌ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల, ప్రత్యక్షంగా-పరోక్షంగా పెరిగిన ప్రేక్షకాదరణ, వచ్చే ఏడాది నుంచి మహిళా ఐపీఎల్‌ ప్రారంభ సంకేతాలు.. వెరసి మహిళల క్రికెట్‌ మహర్దశ వైపు అడుగులేస్తోందనడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణలు ఇంకేం కావాలి..! తాజాగా ఆ జాబితాలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

ప్రతిభ, ప్రేక్షకాదరణ.. వంటి అంశాల్లో పురుష క్రికెటర్లకు సరిసమానంగా రాణిస్తోన్న మన మహిళల జట్టును వేతన వ్యత్యాసంతో చిన్నబుచ్చడమెందుకనుకుందో ఏమో బీసీసీఐ.. ఈ విషయంలో తాజాగా చారిత్రక నిర్ణయానికి తెరతీసింది. మ్యాచ్‌ ఫీజు, వార్షిక వేతనాన్ని పురుష క్రికెటర్లతో సమానంగా మహిళలకూ అందించనున్నట్లు ప్రకటించింది. ఇదంతా మహిళా క్రికెటర్ల ప్రతిభ, పట్టుదల, అంకితభావం వల్లే సిద్ధించిందంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారిన మహిళల క్రికెట్‌ పురుషులతో సమానంగా ఎదిగిన తీరును ఒక్కసారి నెమరువేసుకుందాం..!

అసమానతల్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని..!

క్రికెట్‌ అంటే ‘జెంటిల్మెన్‌ గేమ్’.. 2017 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు వరకు చాలామంది ఈ ఆటను పురుషుల ఆటగానే భావించేవారు.. ఆదరించేవారు. ఆట విషయంలో వారికి దక్కే సౌకర్యాలు, సౌలభ్యాలు, జీతభత్యాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆది నుంచి చాలా వ్యత్యాసం ఉండేది. అయినా ‘మనకూ ఓ రోజొస్తుంద’న్న ఆత్మవిశ్వాసంతో తమ ప్రదర్శనను అంతకంతకూ పెంచుకుంటూ పోయారే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదు మన అమ్మాయిలు. గుర్తింపు లేని దశ నుంచి బలమైన జట్టుగా మారడానికి డయానా ఎడుల్జీ, శాంతా రంగస్వామి, అంజుమ్‌ చోప్రా, మమతా మబేన్‌.. వంటి నాటి క్రికెటర్ల దగ్గర్నుంచి మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి.. వంటి నేటి తరం సారథుల దాకా ప్రతి ఒక్కరి కృషి అనిర్వచనీయం! ఇలా వారి పట్టుదల, కృషి ఫలితంగానే గత కొన్నేళ్లుగా మహిళల క్రికెట్‌పై ఉన్న అసమానతలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయని చెప్పచ్చు.

ఆదరణ అమాంతం పెంచేసిన మ్యాచ్‌ అది!

ఇక 2017 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తృటిలో టైటిల్‌ చేజారినా తమ అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది భారతీయుల మనసు గెలుచుకుంది మిథాలీ సేన. అప్పట్నుంచే అమ్మాయిల ఆటను ప్రత్యక్షంగా స్టేడియంకు వెళ్లి వీక్షించే అభిమానుల సంఖ్య అమాంతం పెరిగిందని చెప్పచ్చు. అంతేనా.. ఈ మ్యాచ్‌తోనే మహిళల మ్యాచ్‌లకు టీఆర్‌పీ రేటింగ్‌ కూడా భారీగా పెరిగిపోయింది. ఐసీసీ గణాంకాల ప్రకారం.. 2013 మహిళల ప్రపంచకప్‌తో పోల్చితే 2017 ప్రపంచకప్‌ టోర్నీని అదనంగా 300 శాతం మంది వీక్షించారంటేనే మహిళల క్రికెట్‌కు అభిమాన గణం ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక నాటి నుంచి నేటి దాకా మ్యాచ్‌ల సంఖ్య, ప్రతిభ, విజయాల విషయంలో పురుషుల జట్టుతో మహిళల జట్టు సరిసమానమైన ప్రదర్శన చేస్తోందని వారి విజయాలే నిరూపిస్తున్నాయి.

వేతన ‘సమానత్వం’!

1973లో ఏర్పడిన ‘భారత మహిళల క్రికెట్‌ అసోసియేషన్‌’ను 2006లో బీసీసీఐ విలీనం చేసుకున్న తర్వాత మహిళల జట్టుకు మహర్దశ మొదలైందని చెబుతుంటారు క్రికెట్‌ విశ్లేషకులు. ఇందుకు.. మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలు పెరగడం.. అమ్మాయిలు తమ సత్తా చాటడానికి మరిన్ని అవకాశాలు దొరకడం, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ‘విమెన్‌ ఇన్‌ బ్లూ’ సక్సెసయ్యారని చెప్పచ్చు. ఇక 2017 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌ వెళ్లేందుకు వారికి బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్‌ ఏర్పాటుచేయడం, ఫైనల్‌ చేరిన నేపథ్యంలో జట్టుకు ప్రోత్సాహకాలు ప్రకటించడం.. ఇవన్నీ మహిళా-పురుష క్రికెటర్ల మధ్య ఉన్న అంతరాలను క్రమంగా చెరిపేస్తూ వచ్చాయి. అలాగే పురుషుల ఐపీఎల్‌లాగే వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ నిర్వహించనున్నట్లు ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే! ఇలా ఇవన్నీ ఒకెత్తయితే.. ఇక ఇప్పుడు వీరి మధ్య ఉన్న వేతన వ్యత్యాసాన్ని తొలగించి.. ఇరువురికీ సమాన జీతభత్యాలు దక్కేలా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో ఆయా గ్రేడ్లు, మ్యాచ్‌లను బట్టి.. ఫీజు, ప్యాకేజీల విషయంలో ఇకపై పురుష క్రికెటర్లతో సమాన వేతనం అందుకోనున్నారు మన అమ్మాయిలు. ‘క్రికెట్లో లింగ సమానత్వానికి తెర తీసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్న’ట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు.


అప్పుడలా.. ఇప్పుడిలా..!

ఈ తాజా నిర్ణయం నేపథ్యంలో మహిళా క్రికెటర్ల జీతభత్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనుండడం గమనార్హం.

⚛ ఇదివరకు టెస్ట్‌ మ్యాచ్‌కు రూ. 4 లక్షలు, వన్డే-టీ20 మ్యాచ్‌లకు తలా రూ. 1లక్ష చొప్పున అందుకునే మన అమ్మాయిలు.. ఈ కొత్త వేతన సవరణతో.. టెస్టులకు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టీ 20లకు రూ. 3 లక్షల చొప్పున మ్యాచ్‌ ఫీజు అందుకోనున్నారు. ప్రస్తుతం పురుషులకు కూడా ఆయా ఫార్మాట్‌ను బట్టి ఇవే ఫీజులున్నాయి.

⚛ దీంతో ఆయా ఫార్మాట్‌ను బట్టి.. గతంలో పోల్చితే టెస్ట్‌ ఫీజు - 275 శాతం, వన్డే - 500 శాతం, టీ20 – 200 శాతం పెరిగాయని చెప్పచ్చు.

⚛ బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో మన మహిళల క్రికెట్ జట్టు మరో చరిత్ర లిఖించింది. ప్రపంచంలో స్త్రీపురుష క్రికెటర్లకు సమాన వేతనం అందించే రెండో దేశంగా నిలిచింది భారత్‌. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ ముందుంది.

⚛ ప్రస్తుతం ఉన్న వార్షిక కాంట్రాక్ట్‌ ప్రకారం.. క్రీడాకారుల గ్రేడ్‌లను బట్టి వేతన ప్యాకేజీలు అందుతున్నాయి. అంటే.. గ్రేడ్‌ ‘ఎ’లో ఉన్న హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతీ మందాన, పూనమ్‌ యాదవ్‌.. వంటి క్రికెటర్లు రూ. 50 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఇక గ్రేడ్‌ ‘బి’, ‘సి’లలో ఉన్న క్రీడాకారిణులు వరుసగా రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు ఆర్జిస్తున్నారు.

⚛ ఇక పురుష క్రికెటర్ల విషయానికొస్తే.. గ్రేడ్‌ ‘ఎ+’లో ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా.. రూ. 7 కోట్ల వార్షిక ప్యాకేజీ అందుకుంటున్నారు. ఇక గ్రేడ్‌ ‘ఎ’, ‘బి’, ‘సి’లలో ఉన్న క్రికెటర్లకు వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. కోటి వేతనం అందుతోంది.

⚛ ఇలా గ్రేడ్‌ ‘ఎ’లో ఉన్న మహిళా క్రికెటర్ల కంటే గ్రేడ్‌ ‘సి’లో ఉన్న పురుష క్రికెటర్లకే రెట్టింపు మ్యాచ్‌ ఫీజు దక్కుతోందంటేనే అర్థమవుతోంది.. ప్రస్తుతం స్త్రీపురుష క్రికెటర్లపై వేతన వ్యత్యాసం ఎంతలా ఉందో! కానీ దీన్ని పూర్తిగా చెరిపేస్తూ.. ఇకపై స్త్రీపురుషులిద్దరికీ సమానమైన మ్యాచ్‌ ఫీజును అందించనుంది బీసీసీఐ.

⚛ సాధారణంగా కాంట్రాక్టు మేరకు ఏడాదిలో ఆడే మ్యాచ్‌ల సంఖ్యను బట్టే క్రీడాకారుల వార్షిక వేతనాలు  ఉంటాయి. అయితే మహిళల జట్టుతో పోల్చితే పురుషుల జట్టుకు ఎక్కువ పర్యటనలు, మ్యాచ్‌లు ఉండడం వల్ల వారికి వార్షిక వేతనం ఎక్కువగా దక్కుతుందనడంలో సందేహం లేదు. మున్ముందు ఈ విషయంలో సైతం అంతరాలు తొలగాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఉన్నత శిఖరాలకు.. మహిళా క్రికెట్!

బీసీసీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో అటు మహిళా క్రికెటర్లు, ఇటు క్రికెట్‌ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళల క్రికెట్‌ను ఇది ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

⚛ ‘భారత మహిళల క్రికెట్లో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. వేతన వ్యత్యాసం తొలగించడంతో పాటు వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ కూడా ప్రారంభం కానుండడం.. కొత్త శకానికి నాంది!’ - మిథాలీ రాజ్‌, మాజీ క్రికెటర్

⚛ ‘మహిళల క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చే గొప్ప మార్పు ఇది. ఈ నిర్ణయం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే అమ్మాయిల్ని మరింత ప్రోత్సహిస్తుంది. జీతభత్యాల విషయంలో లింగ సమానత్వానికి తెర తీసిన బీసీసీఐ అడుగుజాడల్ని అనుసరిస్తూ ఇతర క్రీడల్లోనూ మార్పులొస్తాయని ఆశిస్తున్నా..’ - జులన్‌ గోస్వామి, మాజీ క్రికెటర్

⚛ ‘భారత మహిళల క్రికెట్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం ఇది. స్త్రీపురుష క్రికెటర్ల మధ్య వేతన వ్యత్యాసం తొలగించడం హర్షణీయం!’ - హర్మన్‌ ప్రీత్‌ కౌర్, భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్

వీళ్లతో పాటు ఇతర మహిళా క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు.. పలువురు విదేశీ మహిళా క్రికెటర్లు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్