Toolika Rani : సవాళ్లకు వెరవదీ సాహస ‘రాణి’!

నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత చిన్నదైనా శిఖరంలాగే కనిపిస్తుంది.. అదే స్వీయ నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎంత పెద్ద లక్ష్యమైనా సునాయాసంగా అధిగమించచ్చు. ఈ మాటల్ని అక్షర సత్యం చేసి చూపించింది మీరట్‌కు చెందిన తులికా రాణి. చిన్నవయసు నుంచే సాహసాలంటే....

Updated : 30 Jan 2023 15:56 IST

(Photos: Instagram)

నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత చిన్నదైనా శిఖరంలాగే కనిపిస్తుంది.. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఎంత పెద్ద లక్ష్యమైనా సునాయాసంగా అధిగమించచ్చు. ఈ మాటల్ని అక్షర సత్యం చేసి చూపించింది మీరట్‌కు చెందిన తులికా రాణి. చిన్నవయసు నుంచే సాహసాలంటే ఇష్టపడే ఆమె.. కెరీర్‌లోనూ అలాంటి రంగాల్నే ఎంచుకుంది. ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తూనే.. మరోవైపు పర్వతారోహణనూ తన ప్రవృత్తిగా మార్చుకుంది. వక్తగా, రచయిత్రిగానూ రాణిస్తోన్న తులికా.. తన ప్రసంగాలతో ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జీ-20 సదస్సు కోసం తమ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆమెను నియమించింది. ఈ నేపథ్యంలో తులికా స్ఫూర్తి గాథ మీకోసం..!

ఆర్మీతో పదేళ్ల అనుబంధం!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టిపెరిగిన తులికా.. ప్రస్తుతం లక్నోలో స్థిరపడింది. చరిత్రలో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమెకు చిన్న వయసు నుంచి సాహసాలంటే మక్కువ. ఈ ఇష్టంతోనే ఎన్‌సీసీలో చేరిన తులిక.. 2005లో భారత ఆర్మీలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా ఉద్యోగంలో చేరింది. అవుట్‌డోర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గానూ పనిచేసింది. ‘ఇండియన్‌ ఆర్మీలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించా. ఇందులో భాగంగా ఏడున్నరేళ్ల పాటు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేసిన నాకు.. హైదరాబాద్‌లో అవుట్‌డోర్‌ మిలిటరీ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా అవకాశమొచ్చింది. నేను శిక్షణ పొందిన చోటే.. ఇతరులకు శిక్షణ ఇవ్వడం ఓ మధురానుభూతి. నేను ఇక్కడ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నప్పుడే తొలిసారి మహిళా యుద్ధ విమాన పైలట్లుగా నియమించిన భావనా కాంత్‌, అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌.. ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో వాళ్లకు నేనే అవుట్‌డోర్‌ మిలిటరీ ట్రైనింగ్‌ ఇవ్వడం గర్వకారణం!’ అంటూ చెప్పుకొచ్చింది తులికా.

పట్టుదలతో విజయం!

తులికాకు పర్వతారోహణ అన్నా చాలా ఇష్టం. అయితే ఆర్మీలో చేరాక దీనిపై దృష్టి పెట్టే అవకాశం దొరికిందంటోందామె.

‘ఐఏఎఫ్‌ చేపట్టిన మహిళల మౌంటెనీరింగ్‌ బృందంలో భాగంగా నాకు తొలిసారి పర్వతారోహణ చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో రెండేళ్ల పాటు శిక్షణ పొందిన నేను.. 2011లో ఎవరెస్టును అధిరోహించే మహిళల బృందంలో భాగమయ్యా. అయితే శారీరక ఫిట్‌నెస్‌ సమస్యలతో శిఖరాగ్రం దాకా చేరుకోలేకపోయా. అప్పుడు లక్ష్యంపై పట్టుదల మరింత పెరిగింది. అందుకే ఆ మరుసటి ఏడాదే రెండు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి, అప్పటిదాకా దాచుకున్న డబ్బుతో ఎవరెస్ట్‌ సాహస యాత్ర ప్రారంభించా. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో సవాళ్లు నాకు అడ్డుపడ్డాయి. అయినా వెరవకుండా సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. తద్వారా ఎవరెస్ట్‌ను అధిగమించడమే కాదు.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎవరెస్ట్‌ ఎక్కిన తొలి మహిళగానూ కీర్తి గడించాను. ఇక అప్పట్నుంచి నా పర్వతారోహణ ప్రయాణం కొనసాగుతూనే ఉంది.. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా, ఫిట్‌నెస్‌ పరంగా ఎదురైన సమస్యల్ని దాటుకుంటూ.. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 24కు పైగా సుప్రసిద్ధ పర్వతాల్ని అధిరోహించా..’ అంటూ గర్వంగా చెప్పుకుంటుంది తులికా. ఇలా తన సాహసాలకు గుర్తింపుగా యూపీ ప్రభుత్వం నుంచి ‘రాణీ లక్ష్మీబాయి బ్రేవరీ అవార్డు’తో పాటు ‘అవుట్‌స్టాండింగ్‌ గ్లోబల్‌ ఉమన్‌ అవార్డు’, పదికి పైగా ఇతర పురస్కారాలు ఆమెను వరించాయి.

ప్రసంగాలతో ప్రేరణ!

అడుగడుగునా సాహసాలతో సహవాసం చేసే తులికా మంచి వక్త, రచయిత్రి కూడా! జాతీయ, అంతర్జాతీయంగా నిర్వహించిన టెడెక్స్‌ వేదికలు, పలు కార్యక్రమాల్లో పాల్గొని.. మహిళల్లో స్ఫూర్తి నింపేలా వందలాది ప్రసంగాలు చేసిన ఆమె.. పుస్తకాలు కూడా రాస్తుంటారు. పర్వతారోహణలో భాగంగా తనకెదురైన అనుభవాల్ని రంగరించి ‘Beyond That Wall: Redemption On Everest’ పేరుతో ఆమె రాసిన పుస్తకం.. బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది. ఇక మహిళల్లో స్ఫూర్తి నింపేలా వార్తాపత్రికలు, జర్నల్స్‌కి.. ఆర్టికల్స్‌, గేయాలు కూడా రాస్తుంటారు తులికా.

‘కెరీర్‌ విషయంలో ఒక మహిళగా ఈ సమాజం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. ఆర్మీలో చేరతానన్నప్పుడు చాలామంది నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ సమయంలో నా కుటుంబం నాకు అండగా నిలిచింది. కాబట్టి మనకు నచ్చిన దారిలో నడవడానికి భయపడకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటే సవాళ్లనైనా సునాయాసంగా అధిగమించచ్చు..’ అంటారామె.

అదో గొప్ప గౌరవం!

తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంతో ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న తులికాను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జీ-20 సదస్సు కోసం తమ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఇటీవలే నియమించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే సమావేశాల్లో భాగంగా.. ఆ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రసంగాలతో విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయనుంది తులికా.

‘జీ-20 వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్రం తరఫున బ్రాండ్‌ అంబాసిడర్‌గా పాల్గొనడం గొప్ప గౌరవం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పాలు పంచుకునేలా ఈ వేదికగా విద్యార్థుల్ని ప్రభావితం చేస్తా..’ అంటోందీ మాజీ స్క్వాడ్రన్‌ లీడర్. ఇక గతేడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘SVEEP’ అనే కార్యక్రమానికీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది తులికా. తద్వారా తన ప్రసంగాలతో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చే దిశగా తన వంతుగా కృషి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్