Sreemukhi & Rakul: మా బంగారు తల్లులు!

‘అమ్మే తొలి దైవం’ అంటుంటారు. కడుపులో ఉన్నప్పట్నుంచే బిడ్డ ఆలనా పాలన, మంచి చెడుల గురించి ఆలోచించే మాతృమూర్తి.. ఆ చిన్నారికి బంగారు భవిష్యత్తును అందించడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. జీవితానికే స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తుంటుంది.

Updated : 16 Mar 2024 14:26 IST

(Photos: Instagram)

‘అమ్మే తొలి దైవం’ అంటుంటారు. కడుపులో ఉన్నప్పట్నుంచే బిడ్డ ఆలనా పాలన, మంచి చెడుల గురించి ఆలోచించే మాతృమూర్తి.. ఆ చిన్నారికి బంగారు భవిష్యత్తును అందించడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది. జీవితానికే స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తుంటుంది. అలా తమ తల్లులే తమ జీవితానికి ‘సూపర్‌ విమెన్‌’ అని చెబుతున్నారు ఇద్దరు ముద్దుగుమ్మలు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన అమ్మ మనసు వెన్న అని ఒకరంటే.. తన మనసు తెలుసుకొని ప్రోత్సహించి తననింత దాన్ని చేసిందని మరొకరు చెబుతున్నారు. ఇంతకీ ఎవరు వాళ్లు? తమ జీవితాల్లో తమ తల్లులు పోషించిన పాత్ర గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో స్ఫూర్తి నింపిన మహిళల్ని తలచుకొని.. వాళ్ల గురించి అందరితో పంచుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలూ తమ జీవితాల్లోని ‘సూపర్‌ విమెన్‌’ గురించి సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వారిలో టాలీవుడ్‌ యాంకర్‌ శ్రీముఖి, నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఉన్నారు. తమ తల్లులు తమ జీవితాల్లో స్ఫూర్తి నింపిన వైనాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోయారు.


బాడీ షేమింగ్‌.. అమ్మే ధైర్యం చెప్పింది!

మనకు సంతోషం కలిగించే విషయాలే కాదు.. బాధ కలిగించిన సంఘటనల్నీ అమ్మలతో పంచుకొని ఉపశమనం పొందుతుంటాం. ఈ క్రమంలో వారు ఆ బాధను దూరం చేసే తీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటుంది. గతంలో బాడీ షేమింగ్‌ని ఎదుర్కొన్నప్పుడూ తన తల్లి తనలో ఇలాగే స్ఫూర్తి నింపిందంటూ.. తన తల్లితో దిగిన కొన్ని అపురూపమైన ఫొటోల్ని పంచుకుంది శ్రీముఖి.

‘నా బంగారు తల్లి. ఊహ తెలిసినప్పట్నుంచి నేను చూసిన అందమైన రూపం మా అమ్మ. ఆమె ప్రయాణం నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చేందుకు దోహదపడింది. ఓ మారుమూల గ్రామానికి చెందిన తాను.. తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. చిన్న వయసులో వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటికీ తనకున్న అభిరుచితో బ్యుటీషియన్‌గా మారింది. ఆ వృత్తిలో ఎన్నో నైపుణ్యాలు నేర్చుకుని అతి తక్కువ సమయంలోనే పలువురు మహిళలకు ఉపాధి కల్పించి ఆసరాగా నిలిచింది. మా కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందించడం కోసం ప్రతిక్షణం శ్రమించింది. ఎన్నో త్యాగాలు చేసింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను చాలా బొద్దుగా ఉండేదాన్ని. శరీరాకృతి విషయంలో ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో అమ్మే ధైర్యం చెప్పింది. ప్రతిక్షణం నన్ను ప్రోత్సహించి, ప్రేమించి, ఆత్మస్థైర్యంతో నిలబడేలా చేసింది. త్వరలో ఆమె 50వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. అయినా ఇప్పటికీ నాలో స్ఫూర్తి నింపుతూనే ఉంది. జీవితాంతం నీకు రుణపడి ఉంటానమ్మా..’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చిందీ బ్యూటిఫుల్‌ యాంకర్‌. ఇలా తన తల్లితో పాటు ప్రతి మహిళకూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిందామె.


ఆమె వల్లే నాకీ గుర్తింపు!

తమ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలామందే ఉంటారు. తమ పేరెంట్స్ కూడా ఇదే కోవకు చెందుతారని చెబుతోంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్. ప్రత్యేకించి తన తల్లి తనలో స్ఫూర్తి రగిలించిన తీరును ఓ సందర్భంలో పంచుకుందామె.

‘చిన్నతనం నుంచి మా అమ్మానాన్నల ప్రోత్సాహమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది. నా ప్రతిభను గుర్తించి, నేను నటించగలనని మా అమ్మ నమ్మింది. అందుకే సినీ నేపథ్యం లేకపోయినా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం రాలేదు. మా నాన్న ఎంతో సపోర్ట్‌ చేశారు. వారు ఎప్పుడూ అమ్మాయి, అబ్బాయి అనే భేదం చూపించలేదు. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి, అందులో విజయం సాధించండి.. అని వెన్నుతట్టేవారు. నాకు మక్కువని తెలిసి టేబుల్‌ టెన్నిస్‌, స్విమ్మింగ్‌, గోల్ఫ్‌.. వంటి ఆటలు కూడా నేర్పించారు. మన కష్టానికి తోడు తల్లిదండ్రుల సపోర్ట్‌ కూడా ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించచ్చు.. అలాగే మహిళల ఉన్నతికి బాటలు వేస్తూ ప్రోత్సహిస్తోన్న పురుషులందరికీ నా సెల్యూట్‌!’ అంది రకుల్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్