Anjana Sarja: నటన వద్దనుకుని.. బిజినెస్‌లో రాణిస్తూ..

నటీనటుల వారసులు నటనను ఎంచుకుంటారన్న రోజులు పోయాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా.. వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తోన్న స్టార్‌ కిడ్స్‌ ఎంతోమంది! కన్నడ స్టార్‌ నటుడు అర్జున్‌ సర్జా చిన్న కూతురు అంజనా సర్జా కూడా ఇదే కోవకు....

Published : 22 Dec 2022 12:35 IST

(Photos: Instagram)

నటీనటుల వారసులు నటనను ఎంచుకుంటారన్న రోజులు పోయాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా.. వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యమిస్తూ ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తోన్న స్టార్‌ కిడ్స్‌ ఎంతోమంది! కన్నడ స్టార్‌ నటుడు అర్జున్‌ సర్జా చిన్న కూతురు అంజనా సర్జా కూడా ఇదే కోవకు చెందుతుంది. తన తండ్రి అడుగుజాడల్లో కాకుండా.. తనకిష్టమైన ఫ్యాషన్‌ రంగంలోకి ఇటీవలే అడుగుపెట్టిందామె. ఇక్కడా నలుగురిలో ఒకరిగా కాకుండా.. ‘ఒక్క’రిగా నిరూపించుకుంటూ ‘తన రూటే సెపరేటు’ అంటోంది. ప్రకృతిపై ప్రేమతో పర్యావరణహితమైన హ్యాండ్‌బ్యాగ్స్‌ రూపొందిస్తూ.. ఎంతోమంది ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటోన్న అంజన ఫ్యాషన్‌ జర్నీ ఇది!

ప్రతి విషయంలోనూ పర్యావరణహిత ఆప్షన్లను ఎంచుకునే వారు క్రమంగా పెరిగిపోతున్నారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. చిన్నతనం నుంచే నాకు పచ్చదనం, ప్రకృతి అంటే విపరీతమైన ప్రేమ. మూగజీవాలన్నా ఇష్టమే! ముఖ్యంగా కుక్కలంటే మరీనూ! న్యూయార్క్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదివేటప్పుడు పర్యావరణహితంగా ఉండేలా నా జీవనశైలిలో చాలా మార్పులు చేసుకునేదాన్ని. కిచెన్‌లోనూ ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులు, వస్తువులు ఉండేలా జాగ్రత్తపడేదాన్ని. ఈ ఆసక్తిని నా ఫ్యాషన్‌ అభిరుచితో ముడిపెట్టి ఓ కొత్త బ్రాండ్‌ని సృష్టించాలనుకున్నా.

అక్క ఇచ్చిన ఐడియాతో..!

ఫ్యాషన్ రంగంలోకి రావాలనుకున్నప్పుడు.. ఎలాంటి ఉత్పత్తిని తీసుకురావాలన్న విషయం గురించి నేను, అక్క ఐశ్వర్య బాగా ఆలోచించాం. ఈ క్రమంలోనే ‘నువ్వు హ్యాండ్‌బ్యాగ్స్‌ ఎందుకు తయారుచేయకూడదు?’ అని హింట్‌ ఇచ్చింది అక్క. ఐడియా బాగుంది.. కానీ అదీ పర్యావరణహితంగా ఉండాలన్న దిశగా మరింత లోతుగా ఆలోచించా. అప్పుడే పండ్ల తొక్కల్ని ప్రధాన మెటీరియల్‌గా తీసుకొని హ్యాండ్‌బ్యాగ్స్‌ రూపొందించాలన్న ఆలోచన నాకు తట్టింది. దీని గురించి సుమారు రెండు నెలల పాటు పరిశోధన చేశా. ఈక్రమంలో వీటివల్ల వ్యర్థాలు తగ్గిపోయి.. పర్యావరణానికీ మేలు జరుగుతుందన్న విషయం నాకు అర్థమైంది. ఇక వ్యాపారం, దాన్ని చక్కగా మార్కెటింగ్‌ చేసుకొని వినియోగదారుల్ని ఆకట్టుకోవడం ఎలా అన్న విషయాల్లో గత ఉద్యోగానుభవాలు నాకు పనికొచ్చాయి. ఈ ఆత్మవిశ్వాసమే ‘సర్జా’ పేరుతో హ్యాండ్‌బ్యాగ్స్‌ బ్రాండ్‌ నెలకొల్పేలా చేసింది. ఇటీవలే హైదరాబాద్‌ వేదికగా దీన్ని ప్రారంభించాను.

పండ్ల తొక్కలతో..!

ఈ ప్రకృతిలో ఏదీ వ్యర్థం కాదు.. ఆఖరికి మనం వృథా అని పడేసే పండ్ల తొక్కలు కూడా! అందుకే పర్యావరణానికి హాని కలిగించకుండా వీటితో హ్యాండ్‌బ్యాగ్స్‌ రూపొందిస్తున్నా. ఈక్రమంలో పండ్ల రసాలు తయారుచేసే సంస్థల నుంచి తొక్కలు, ఇతర వ్యర్థాలను స్వీకరించి.. వీటిని రీసైకిల్‌ చేసి లెదర్‌గా మారుస్తున్నాం. వాటితో ఎకో-ఫ్రెండ్లీ హ్యాండ్‌బ్యాగ్స్ రూపొందిస్తున్నాం. ప్రస్తుతం మా వద్ద యాపిల్‌, పైనాపిల్‌, కాక్టస్‌.. వంటి పదార్థాల తొక్కలతో రూపొందించిన బ్యాగ్స్‌ తయారవుతున్నాయి. అంతేకాదు.. వీటిని తయారుచేసే క్రమంలోనూ పాలీవినైల్‌ క్లోరైడ్‌, విషపూరిత రసాయనాలు, డైలు.. వంటివీ ఉపయోగించట్లేదు. మెటీరియల్‌ దగ్గర్నుంచి రంగుల దాకా ప్రతిదీ సహజసిద్ధమైనదే వాడుతున్నాం. నాణ్యత విషయంలోనూ రాజీ పడట్లేదు. అలాగే ఒకేసారి ఎక్కువ బ్యాగ్స్‌ ఉత్పత్తి చేసి మార్కెట్లో డంప్ చేయడం కాకుండా.. వినియోగదారుల అభిరుచులు, అవసరాల్ని బట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే రూపొందిస్తున్నాం. ఇది కూడా వృథాను అరికట్టడానికి ఓ మార్గమే అని నా నమ్మకం.

అమ్మానాన్నలు ప్రోత్సహించారు!

చిన్న ఆలోచనే పెద్ద మార్పు తీసుకొస్తుందన్నట్లు.. ప్రస్తుతం నేను తయారుచేస్తోన్న ఈ ఎకో-ఫ్రెండ్లీ హ్యాండ్‌బ్యాగ్స్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యాపిల్‌ తొక్కలతో హ్యాండ్‌బ్యాగ్స్‌ తయారుచేసే సంస్థలు మన దేశంలో ఎక్కడా లేవు. మాదే మొదటిది కావడం గర్వంగా అనిపిస్తోంది. ఇటీవలే పెటా ఇండియా నుంచి ‘ఉత్తమ వీగన్‌ బ్యాగ్స్‌’ విభాగంలో ‘వీగన్‌ ఫ్యాషన్‌ అవార్డ్‌’ అందుకున్నా. ఇక ఏరికోరి ఎంచుకున్న ఫ్యాషన్‌ రంగంలో నేను తయారుచేస్తోన్న ఈ ఉత్పత్తికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కూడా దక్కుతోంది. ఇది చూసి అమ్మానాన్నలు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. నటనను కాదని.. నా అభిరుచి మేరకు ఫ్యాషన్‌ రంగంలోకి వస్తానన్నప్పుడు వాళ్లు నన్ను ప్రోత్సహించారు.. కేవలం ఇదే కాదు.. ఆటలు, ఫొటోగ్రఫీల్లోనూ నాకు పట్టుంది. ఇక భవిష్యత్తులో.. రీసైక్లింగ్‌ పద్ధతిలో దుస్తులు, గృహాలంకరణ వస్తువులు తయారుచేయాలన్న ఆలోచన ఉంది. తద్వారా పర్యావరణానికి మరింతగా మేలు చేయాలన్నదే నా లక్ష్యం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్