నచ్చింది చేస్తే.. మెచ్చింది ఫోర్బ్స్‌!

‘సారా’.. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో నటించిన అమ్మాయెవరా అని సినీప్రియులే కాదు ప్రముఖులూ గూగుల్‌లో వెతికారు. అన్నా బెన్‌.. కెరియర్‌ ప్రారంభించి మూడేళ్లే! ఎన్నో అవార్డులు అందు కుంది.

Published : 07 Feb 2023 00:25 IST

అందరూ నడిచిన దారిలో నడవాలనుకోలేదీ అమ్మాయిలు. తమదైన ప్రత్యేకత చాటాలనుకున్నారు. అందుకు అహోరాత్రాలూ శ్రమించారు. కష్టాలకు ఎదురీదారు. అనుకున్నది సాధించి ప్రపంచ దృష్టినీ ఆకర్షించారు. అంతేనా.. యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ.. ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు.


నాన్న సాయం వద్దని

‘సారా’.. గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో నటించిన అమ్మాయెవరా అని సినీప్రియులే కాదు ప్రముఖులూ గూగుల్‌లో వెతికారు. అన్నా బెన్‌.. కెరియర్‌ ప్రారంభించి మూడేళ్లే! ఎన్నో అవార్డులు అందు కుంది. నిజానికి తనసలు సినిమాల్లోకే రావాలనుకోలేదు. పుట్టింది కొచ్చి. నాన్న మలయాళ సినీరచయిత. అపారల్‌ డిజైనింగ్‌ చదివింది. తనను తాను పరీక్షించుకోవాలని ఇంట్లో చెప్పకుండా ఆడిషన్లకు వెళ్లింది. 2019లో ‘కుంబాలాంగీ నైట్స్‌’లో అవకాశమొచ్చాకే ఇంట్లో చెప్పింది. ‘పీజీ దేనిపై చేయాలో తోచక కెమెరా ముందు నిల్చున్నానంటే నమ్ముతారా? అవకాశం వస్తుంది అనుకోలేదు. వచ్చాక మాత్రం ప్రత్యేకంగా నిలవాలన్న కోరిక మొదలైంది. అందుకే మహిళా సమస్యలను చూపించే విభిన్న పాత్రలు చేస్తున్నా. నాన్న పేరూ వాడలేదు. మంచి కథలు ఎంచుకుంటున్నావ్‌ అని చాలామంది అంటోంటే తర్వాతి దానిలో మెప్పించ గలనా అన్న భయం వేస్తుంటుంది. ఒకసారి తప్పటడుగు వేస్తే బాగుండూ అనీ అనుకుంటా. తప్పులేవైనా ప్రారంభంలోనే! తర్వాత నటిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవే చేయాలి. ఇదే నా కోరిక’ అని చెప్పే అన్నాబెన్‌ ఏది ఎంచుకున్నా వందశాతం ప్రయత్నంతోనే విజయం సాధించొచ్చని నమ్ముతుంది.


లావు అయితేనేం?

న్నమే అందం.. లావు  అనారోగ్యం  అన్న ధోరణిని మార్చాలనుకుంది సాక్షి సింద్వానీ. డిగ్రీ పూర్తయ్యాక ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో పీజీ చేసింది. సన్నగా, నాజూగ్గా ఉండటమే అందం, అలా ఉండేవాళ్లే మోడళ్లు అనే ఆలోచనను మార్చాలనుకుంది. ‘ప్లస్‌ సైజ్‌’ వాళ్లకోసం వస్త్ర సంస్థను ప్రారంభించింది. అంతేకాదు వాళ్లకి ఫ్యాషన్‌ చిట్కాలు చెబుతూ లక్షల మంది అభిమానం సంపాదించుకుంది. ‘ఇప్పటికీ నా సోషల్‌ మీడియా ఖాతాల్లో ‘లావు’ పేరుతో బోలెడు కామెంట్లు. ఎవరూ అధిక బరువు కోరుకోరు. కొందరి శరీరతత్వమే అంత. నేనూ తగ్గడానికి ప్రయత్నించి అనారోగ్యం పాలయ్యా. ఒత్తిడి, డిప్రెషన్లనీ ఎదుర్కొన్నా. కొలతలు కాదు.. ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని  అర్థం  చేసుకున్నాక అవగాహన కల్పించడం మొదలుపెట్టా. ‘స్టైల్‌ విత్‌ మీ సాక్షి’ యూట్యూబ్‌, ఇన్‌స్టా ఖాతాల ద్వారా లక్షల మందికి చేరువయ్యా. ఎన్నో ప్రముఖ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ని. మోడల్‌గానూ చేస్తున్నా. నేను ఒబెసిటీకి కాదు.. ఆరోగ్యాన్నీ,  ఎవరిని వారు స్వీకరించడాన్నీ ప్రచారం చేస్తున్నా. అందుకే ఎవరేమన్నా పట్టించుకోను’ అనే 26 ఏళ్ల సాక్షి గత ఏడాది దేశంలో ఫోర్బ్స్‌ టాప్‌ 100  డిజిటల్‌ స్టార్స్‌ జాబితాలో చోటు సహా ఎన్నో పురస్కారాలూ దక్కించుకుంది. తనో మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా.


అనుమానాల మధ్యే ఎదిగి..

‘మగవాళ్లెవరూ లేరా? నీకు పెళ్లైతే పరిస్థితేంటి? పిల్లలు పుడితే ఎలా?’ పెట్టుబడి కోసం చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు, అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి రోమితా మజుందార్‌కి. వాటన్నింటినీ దాటుకొని ఫాక్స్‌టేల్‌ని రూ.100కోట్ల సంస్థగా తీర్చిదిద్దిందామె. లాయర్ల కుటుంబం. కానీ ఈ ఝార్ఖండ్‌ అమ్మాయి కాలిఫోర్నియాలో బిజినెస్‌ ఎకనామిక్స్‌ చదివి, వెంచర్‌ కాపిటలిస్ట్‌ అయ్యింది. కొన్నేళ్ల తర్వాత మనసు వ్యాపారం వైపు మళ్లింది. ‘‘మహిళవి’ అన్న ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ‘మీ పెట్టుబడి అవసరం లేదు’ అనేదాన్ని. ఉద్యోగం చేస్తున్నప్పుడు విమెన్‌ బ్యాంకర్‌, విమెన్‌ వీసీ అని చెప్పుకోలేదు. వ్యాపార విషయంలో మాత్రం ఎందుకు? అలాగని ఒత్తిడిగా భావించలేదు. నేను చేస్తున్నదానిపై నమ్మకం ఉంది. ‘ఫాక్స్‌టేల్‌’ ప్రారంభించే ముందు వేల మంది మహిళలతో మాట్లాడా. తర్వాతే నాణ్యతతోపాటు అందరికీ అందుబాటు ధరల్లో స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చా. ఈక్రమంలో ఎన్నో అవాంతరాలు. అవన్నీ దాటి రెండేళ్లలో రూ.కోట్ల వ్యాపారంగా తీర్చిదిద్దా’ అనే 28 ఏళ్ల రోమిత లక్ష్యం 2025 నాటికి ఫాక్స్‌టేల్‌ని వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దడమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్