లక్షల జీతం వద్దనుకొని.. డ్యాన్స్‌ను ఎంచుకుంది!

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తమకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి సారిస్తుంటారు చాలామంది. కానీ కర్ణాటకకు చెందిన అనూష శెట్టి మాత్రం తనకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ కోసం బంగారం లాంటి ఐటీ ఉద్యోగం సైతం....

Published : 22 Oct 2022 13:27 IST

(Photos: Instagram)

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది.. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు తమకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి సారిస్తుంటారు చాలామంది. కానీ కర్ణాటకకు చెందిన అనూష శెట్టి మాత్రం తనకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ కోసం బంగారం లాంటి ఐటీ ఉద్యోగం సైతం వదులుకుంది. ఏసీ గదిలో కాలు మీద కాలేసుకొని లక్షలు సంపాదించే కంటే.. నచ్చిన పని చేసినప్పుడు కలిగే సంతృప్తి, సంతోషమే వేరంటోందామె. ప్రస్తుతం భర్తతో కలిసి డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోన్న అనూష.. తన నైపుణ్యాలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.

కర్ణాటక ఉడుపిలోని కుండాపూర్‌ గ్రామానికి చెందిన అనూష శెట్టిది మధ్య తరగతి కుటుంబం. తండ్రి వ్యాపారం అంతంత మాత్రంగానే సాగడంతో కుటుంబమంతా ప్రభుత్వోద్యోగి అయిన ఆమె తల్లి పైనే ఆధారపడాల్సి వచ్చేది. అయితే కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా.. అనూష మాత్రం తన చదువు పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేది. మరోవైపు ఇతర వ్యాపకాల్లో, క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది.

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపికై..!

స్కూలింగ్‌ అంతా గ్రామంలోనే పూర్తి చేసుకున్న అనూష.. కష్టపడి చదివి బెంగళూరులోని టాప్‌-2 కాలేజీలో ఇంజినీరింగ్‌ సీటు సంపాదించింది. మధ్యమధ్యలో ఫీజులు, ఇతర ఖర్చుల రీత్యా ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. మంచి మార్కులతో బీటెక్‌ పూర్తిచేసిందామె. క్యాంపస్‌ సెలక్షన్స్‌లోనే ఐటీ ఉద్యోగం కూడా సంపాదించింది.

‘కుటుంబమంతా ఆర్థికంగా అమ్మ పైనే ఆధారపడాల్సి రావడంతో కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నా.. తద్వారా అమ్మపై అదనపు భారం తగ్గించాలనుకున్నా. అనుకున్నట్లుగానే లక్షల కొద్దీ జీతం ఆర్జించే ఉద్యోగం వచ్చింది. ఇక నాకు డ్యాన్స్‌ అంటే చిన్నప్పట్నుంచీ ప్రాణం. టీవీ షోలు, ఇతర డ్యాన్స్‌ కార్యక్రమాలు చూస్తూ డ్యాన్స్‌ సాధన చేసేదాన్ని. బహుశా డ్యాన్స్‌పై నాకున్న మక్కువే ఇందులో నేను ఆరితేరేలా చేసిందేమో అనిపిస్తుంటుంది. ఇందుకు అమ్మానాన్నల ప్రోత్సాహం కూడా తోడవడంతో దీనిపై మరింత దృష్టి పెట్టా..’ అంటూ చెప్పుకొచ్చింది అనూష.

సౌరభ్‌తో పరిచయం అలా..!

ఐటీ ఉద్యోగంలో స్థిరపడ్డాక మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌ అనే అబ్బాయితో అనూషకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి వృత్తులు ఒకటే కావడం, అభిరుచులూ కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. ‘2015లో ఓ డేటింగ్‌ యాప్‌లో సౌరభ్‌ను కలుసుకున్నా. తనూ ఐటీ ఉద్యోగే! పైగా డ్యాన్స్‌ అంటే నాకు ప్రాణమైతే.. తనకు ఆరోప్రాణం. తను అప్పటికే ఓ డ్యాన్స్‌ స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. ఇలా అభిరుచులు, ఆలోచనలు కలవడంతో ఇద్దరం పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాం. పెళ్లయ్యాక కూడా వారాంతాలు, ఇతర ఖాళీ సమయాల్లో డ్యాన్స్‌ వీడియోలు చేసేవాళ్లం. వీటిని ‘జోడీ అనురభ్‌’ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసేవాళ్లం. వీటికి మంచి స్పందన రావడంతో.. కొన్నాళ్లకు నేను ఐటీ ఉద్యోగం వదిలేసి పూర్తి దృష్టి డ్యాన్స్ పైనే కేటాయించాను. అయితే నా ఈ నిర్ణయానికి ఇంట్లో నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.. అయినా నేను వెనక్కి తగ్గలేదు..’ అంటోంది అనూష.

అభిమానం లక్షల్లో!

ప్రస్తుతం కవర్‌ సాంగ్స్‌కి తమదైన రీతిలో డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటోన్న ఈ జంట.. తాము వెళ్లిన పర్యటక ప్రదేశం బ్యాక్‌డ్రాప్‌గా పలు డ్యాన్స్‌ వీడియోలు రూపొందిస్తుంటుంది. మరోవైపు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌ వేదికగా ఔత్సాహిక డ్యాన్స్‌ ప్రియులకు డ్యాన్స్‌ శిక్షణ తరగతులు, వర్క్‌షాప్స్‌ సైతం నిర్వహిస్తున్నారు. ఇలా వీళ్ల డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఎంతో అద్భుతంగా ఉంటాయనడానికి వీళ్లు పోస్ట్‌ చేసే వీడియోలే ప్రత్యక్ష నిదర్శనం! అంతేకాదు.. నేటి యువ జంటలకు జీవనశైలికి సంబంధించిన పలు చిట్కాలూ అందిస్తున్నారీ డ్యాన్స్‌ కపుల్.

‘కాలాన్ని బట్టి మనమూ మారినట్టే.. మన డ్యాన్స్‌ మెలకువల్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. తరానికి తగ్గట్లుగా కొత్త కొత్త డ్యాన్స్‌ నైపుణ్యాల్ని అందిపుచ్చుకున్నప్పుడే నేటి యువతను ఆకట్టుకోగలం. ప్రస్తుతం మేం చేస్తోంది కూడా అదే! భవిష్యత్తులో సినిమాలో కొరియోగ్రాఫర్‌గా అవకాశాలొస్తే తప్పకుండా స్వీకరిస్తాం..’ అంటోంది అనురభ్‌ జోడీ. ప్రస్తుతం వీళ్ల యూట్యూబ్‌ ఛానల్‌కి నాలుగు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ఇన్‌స్టా పేజీని 6.3 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్