బైక్‌పై భూగోళాన్ని చుట్టేస్తూ..

ప్రపంచమంతా ఒకే కుటుంబం... మనుషులంతా మంచి వాళ్లే అని నిరూపించాలనుకుందామె. అంతేకాదు... దేశ దేశాల పురాణాలు, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం కోసం బైక్‌పై ఒంటరిగా భూగోళాన్ని చుట్టేస్తోంది ఎలీనా ఆక్సింటే. లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకు చేరుకున్న ఈమె యాత్ర అనుభవాల కథనమిది.

Updated : 17 Jan 2023 00:23 IST

ప్రపంచమంతా ఒకే కుటుంబం... మనుషులంతా మంచి వాళ్లే అని నిరూపించాలనుకుందామె. అంతేకాదు... దేశ దేశాల పురాణాలు, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం కోసం బైక్‌పై ఒంటరిగా భూగోళాన్ని చుట్టేస్తోంది ఎలీనా ఆక్సింటే. లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకు చేరుకున్న ఈమె యాత్ర అనుభవాల కథనమిది.

టి, నాటక నైపుణ్యాల శిక్షకురాలు ఎలీనా. ప్రపంచ దేశాల్లో పురాణాలు, ఆయా సంప్రదాయాలన్నీ అనుసంధానమై ఉంటాయని తన నమ్మకం. దీనిపై అవగాహన కోసం వివిధ దేశాల సంప్రదాయాలను తెలుసుకోవాలనుకుందామె. అందుకోసం దేశాలన్నీ చుట్టాలనే ఆలోచనతో ఆగస్టు, 2019లో బైక్‌పై ఒంటరి ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇటలీకి చెందిన ఎలీనా ఈ మూడున్నరేళ్లలో 1.2 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి కేరళకు చేరుకుంది. ఇప్పటికి 28 దేశాల్లో పర్యటించిన తను గతంలోనూ యాత్రలు చేసింది. ‘ఇంతకు ముందు బైక్‌పై ఒంటరిగానే ఆఫ్రికా దేశాల్లో తిరిగొచ్చా. నా నెట్‌వర్క్‌, సోషల్‌ మీడియా ద్వారా బైకర్స్‌ బృందం అందించే సమాచారంతో ఎక్కడికక్కడ స్థానికుల ఆతిథ్యాన్ని పొందే దాన్ని. హోటల్‌లో గది తీసుకోవల్సిన అవసరం రాలేదు. అక్కడి ప్రజల ఆదరణా మరవలేను. ఆ అనుభవాలను పంచుకొంటున్నప్పుడు వేరే దేశాల్లో ఇలాంటి మర్యాద దక్కడం అసంభవమని అనే వారు చాలా మంది. ఇది నన్ను ఆలోచనలో పడేసింది. ఈ అంశాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని, ప్రపంచమంతా ఒంటరిగా చుట్టాలనుకున్నా. ఎక్కడికెళ్లినా స్థానికుల ఆతిథ్యాన్ని మాత్రమే పొందాలని నియమంగా పెట్టుకున్నా’ అని వివరిస్తుందీమె.


పాండమిక్‌లో..

యూరప్‌ నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఎలీనా టర్కీ, లెబనాన్‌, తదితర దేశాల మీదుగా పశ్చిమ ఆసియాకు చేరుకుంది. కొవిడ్‌ సమయానికి సౌదీ అరేబియాలో ఉంది. ‘ఒక కుటుంబం నాకు నాలుగు నెలలు ఆశ్రయమిచ్చింది. అక్కడ నాకు కరోనా సోకింది. అప్పుడూ వాళ్లు నన్ను హోటల్‌కి వెళ్లమన లేదు. నన్ను కుటుంబ సభ్యురాలిలా, కంటికి రెప్పలా సంరక్షించారు. కొవిడ్‌ నేపథ్యంలో దేశాల సరిహద్దులు దాటడానికి చాలా ఆంక్షలెదురయ్యాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ... అరబ్‌ దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడి సంప్రదాయాలన్నీ తెలుసుకొన్నా. మహిళలకు నిబంధనలెక్కువగా ఉంటాయని అందరూ చెప్పే వారు. అయితే నాకే సమస్యలూ ఎదురవలేదు. ఇరాక్‌, ఇరాన్‌, పాకిస్థాన్‌ దేశాలు చుట్టాక వాఘా సరిహద్దుల గుండా ఇండియాలోకి ప్రవేశించా. ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో 6 వేల కిలో మీటర్లు ప్రయాణించి ప్రస్తుతం కేరళ చేరుకొన్నా. నేను ప్రయాణించే ప్రతి ప్రాంతంలోనూ స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, పురాణ కథలను తెలుసుకుంటున్నా. వీటన్నింటికీ ఎక్కడో ఒకచోట సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భావన కలుగుతోంది. దాన్నే వెళ్లిన ప్రతి చోటా చాటుతున్నా’ అంటోన్న ఎలీనా హిమాలయాలు, నేపాల్‌, తర్వాత బంగ్లాదేశ్‌కు వెళ్లాలనుకుంటోంది. ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లోనూ పర్యటించనున్న 37 ఏళ్ల ఎలీనా ఆశయం, ఆమె అందిస్తోన్న సందేశం స్ఫూర్తిదాయకం కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్