Young Change Maker: నా కథలకు ఆ సమస్యలే ఊపిరి!

‘కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు.. నీ శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవడానికి వచ్చాయి..’ అన్నారు కలాం. ఈ మాటల్నే నమ్మింది బిహార్‌ గోపాల్‌గంజ్‌ జిల్లాకు చెందిన ప్రియస్వర భారతి. తొమ్మిదేళ్ల ప్రాయంలో తండ్రి ప్రమాదంతో మొదలైన ఆమె కష్టాలు.. మొన్నటి కొవిడ్‌ దాకా కొనసాగాయి. అయినా సానుకూల దృక్పథంతో....

Published : 24 Sep 2022 18:55 IST

(Photos: Instagram)

‘కష్టాలు నిన్ను సాధించడానికి రాలేదు.. నీ శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవడానికి వచ్చాయి..’ అన్నారు కలాం. ఈ మాటల్నే నమ్మింది బిహార్‌ గోపాల్‌గంజ్‌ జిల్లాకు చెందిన ప్రియస్వర భారతి. తొమ్మిదేళ్ల ప్రాయంలో తండ్రి ప్రమాదంతో మొదలైన ఆమె కష్టాలు.. మొన్నటి కొవిడ్‌ దాకా కొనసాగాయి. అయినా సానుకూల దృక్పథంతో వాటిని జయించడానికే ప్రయత్నించింది.. కానీ కుంగిపోలేదు. ఈ ఆత్మవిశ్వాసమే ఆమెను నలుగురిలో ప్రత్యేకంగా నిలబెట్టింది. ప్రస్తుతం ఓ సామాజిక సేవకురాలిగా, బాలల హక్కుల పరిరక్షకురాలిగా, డాక్యుమెంటరీ డైరెక్టర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తోన్న భారతి.. తన కష్టాల కడలిని ఎలా అధిగమించిందో తెలుసుకుందాం రండి..

ప్రియస్వర భారతి చిన్న వయసు నుంచే చాలా చురుకైన అమ్మాయి. ఆమె తల్లిదండ్రులిద్దరూ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్లుగా పనిచేసేవారు. నలుగురు తోబుట్టువులు, అమ్మానాన్నలతో హాయిగా సాగిపోతోన్న వారి జీవితంపై విధి చిన్న చూపు చూసింది. అప్పుడు భారతికి 9 ఏళ్లు. అదే సమయంలో ఆమె తండ్రి ప్రమాదానికి గురి కావడంతో తన కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి.

ట్యూషన్లు చెబుతూ..!

తన తండ్రి చికిత్స రీత్యా పట్నాకు మకాం మార్చిన ఈ కుటుంబానికి.. అక్కడ వైద్యం, పిల్లల విద్య, ఇతర ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. కానీ కుటుంబ పెద్దే మంచం పడితే ఇక చేసే వారెవరుంటారు?! ఇదే సమయంలో కుటుంబ పోషణ కోసం తన వంతుగా పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది భారతి. ఆపై కొన్నాళ్లకు పలు కారణాల రీత్యా తన చదువును ఆపేసి ఇంటికే పరిమితమైందామె. ఇదే సమయంలో అక్కడి ‘కిల్కారీ ఫౌండేషన్‌’లో చేరింది. పేద చిన్నారుల్ని, బాలబాలికల్ని విద్య వైపు ప్రోత్సహించే సంస్థ ఇది. ఈ క్రమంలో వివిధ సైన్స్‌ ప్రాజెక్టుల్లో భాగమవుతూ.. తన విజ్ఞానాన్ని పెంచుకుంటూ పోయిందామె. ఇలా ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి స్ఫూర్తి పొందిన తనకు సమాజ సేవ, పిల్లల హక్కులపై పూర్తి అవగాహన వచ్చిందంటోంది భారతి.

హక్కులపై అవగాహన..!

‘నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో బాల్య వివాహాల్ని దగ్గర్నుంచి చూశాను. వాళ్లలో నా ఫ్రెండ్సే ఎక్కువగా ఉన్నారు. ఇక మా బంధువుల్లో చాలామంది తమ పిల్లల్ని యుక్త వయసులోనే పనిలోకి పంపడం చూశా. కన్న కూతురిని భారంగా భావించే భర్తల సహకారం లేకపోయినా.. ఎంతోమంది మహిళలు ఒంటరిగా తమ కూతురిని పెంచి పెద్ద చేయడం చూసి ప్రేరణ కలిగేది. అంతెందుకు.. ఇప్పటికీ చదువు ఆపేసిన అమ్మాయిల్ని భారంగా భావించి.. బాల్యవివాహాలు చేస్తోన్న తల్లిదండ్రులెంతోమంది ఉన్నారు. నేను ఎప్పుడైతే కిల్కారీ సంస్థలో చేరానో అప్పుడే బాలల హక్కుల గురించి నాకు ఓ అవగాహన వచ్చింది. ‘నేషనల్‌ ఛైల్డ్‌ పాలసీ’లో వర్క్‌షాప్‌కి హాజరైనప్పుడు ఈ హక్కుల గురించి పూర్తిగా అర్థమైంది. కానీ వీటి గురించి చాలామందికి తెలియదన్న విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే బాలల హక్కుల గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాలనుకున్నా. ఈ ఆలోచనే ‘బిహార్‌ యూత్‌ ఫర్‌ ఛైల్డ్‌ రైట్స్‌’ అనే ప్రచార కార్యక్రమానికి తెరతీసింది..

కరోనా సమయంలోనూ సేవలు..!

పిల్లలు, యువత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా.. చిన్నారులకు విద్యా ప్రాధాన్యం, బాల్య వివాహాలు, లింగ సమానత్వం, బాలికలు/మహిళల ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి ఇలాంటి అంశాలపై అవగాహన కలిగించే దిశగా వివిధ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో ‘ఎడ్యుకేషన్‌ మ్యాటర్స్‌’ పేరుతో క్యాంపెయిన్‌ నిర్వహించి.. దీని ద్వారా ఆన్‌లైన్‌ విద్యకు నోచుకోని వందలాది పేద చిన్నారులకు స్కూల్‌ కిట్స్‌, స్టడీ మెటీరియల్‌.. వంటివి అందించాం..’ అంటూ చెప్పుకొచ్చింది భారతి. ఇలా ఓవైపు తన బృందంతో కలిసి బాలలు-యువత హక్కుల కోసం పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న భారతి.. మరోవైపు ‘యునిసెఫ్‌ బిహార్‌’ సంస్థలో వలంటీర్‌గానూ కొనసాగుతోంది. అంతేకాదు.. ‘యునిసెఫ్‌ అడ్వైజరీ బోర్డ్-యంగ్‌ పీపుల్‌ యాక్షన్‌ టీమ్‌’లోనూ భాగమైందామె. ఇలా తన సేవలకు గుర్తింపుగా ‘అశోకా యంగ్‌ ఛేంజ్ మేకర్‌-2021’ అవార్డును అందుకుంది భారతి.

అలా సినిమాటోగ్రాఫర్‌గా..!

భారతి తన కుటుంబ పరిస్థితులు, కష్టాల్ని దాటుకుంటూ సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే.. కరోనా మహమ్మారి ఆమె తల్లిని, చెల్లిని తనకు శాశ్వతంగా దూరం చేసింది. దీంతో మరోసారి కుంగిపోయిన ఆమె.. ఈ బాధను దిగమింగుకొని.. గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు హాజరైంది. దీంతో పాటు కిల్కారీ సంస్థ, ‘ఫిల్మ్‌ అండ్‌ టెలి విజన్‌ ఇన్‌స్టిట్యూట్‌’ సంయుక్తంగా నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లోనూ పాల్గొంది భారతి. ఈ రెండు కార్యక్రమాలే తనకు సినిమాటోగ్రఫీ, సినిమా చిత్రీకరణపై మక్కువ పెంచాయంటోందీ యంగ్‌ వారియర్.

‘ఈ రెండు కార్యక్రమాల స్ఫూర్తితో ‘Gelotology’ అనే డాక్యుమెంటరీని రూపొందించా. అది నేషనల్‌ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివ్‌లో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకుంది. ఆ తర్వాత డాక్యుమెంటరీలు రూపొందించడం పైనా దృష్టి పెట్టా. వాటిలో కొన్ని జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నామినేట్‌ అవడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. నా కథలకు బిహార్‌లోని సామాజిక సమస్యలే ఊపిరి..’ అంటోందీ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్.

‘నాకు లక్ష్యంపై పూర్తి స్పష్టత ఉంది.. ఎలాంటి కష్టాలు, సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని నా జీవితం నాకు నేర్పించింది. ఈ రెండే నాకు సమాజంలో ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి..’ అంటోన్న భారతి.. ప్రస్తుతం ఓవైపు సమాజ సేవలో, మరోవైపు డాక్యుమెంటరీలు/లఘుచిత్రాల్ని రూపొందించడంలో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్