Moomal Mehar: షాట్‌ కొట్టి శభాష్‌ అనిపించుకుంది

‘నీ ఆటను బాగా ఎంజాయ్‌ చేశా’ సచిన్‌ నుంచి ఈ ప్రశంసలు అందుకున్నది ఏ పేరు మోసిన క్రికెటరో కాదు. ఓ గ్రామీణ బాలిక. ఆమె ఆటతీరు స్టార్‌ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోదు.

Updated : 17 Feb 2023 04:28 IST

‘నీ ఆటను బాగా ఎంజాయ్‌ చేశా’ సచిన్‌ నుంచి ఈ ప్రశంసలు అందుకున్నది ఏ పేరు మోసిన క్రికెటరో కాదు. ఓ గ్రామీణ బాలిక. ఆమె ఆటతీరు స్టార్‌ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోదు. అందుకే ‘అరె.. నిన్నేగా డబ్ల్యూపీఎల్‌ వేలం జరిగింది. అప్పుడే ఆట మొదలైందా? ఏదైతేనేం నేను మాత్రం నీ ఆటను బాగా ఎంజాయ్‌ చేశా’ అంటూ దిగ్గజ క్రికెటర్‌ నుంచి కితాబు అందుకుంది.

14 ఏళ్ల ముమల్‌ మెహర్‌ది రాజస్థాన్‌లోని కనాసర్‌ అనే చిన్న గ్రామం. ఎనిమిదో తరగతి చదువుతోంది. అబ్బాయిలతో పోటాపోటీగా ఆడుతున్న ముమల్‌ ఆటతీరు చూసి ఆమె స్కూల్‌ టీచర్‌ రోషన్‌ శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అబ్బాయిలతోనే ఆమె సాధన. సూర్యకుమార్‌ యాదవ్‌ ఆటతీరును ఇష్టపడే ముమల్‌ అతనిలానే పెద్ద షాట్లు ఆడుతుంది. రాజస్థాన్‌ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ‘రూరల్‌ ఒలింపిక్‌ గేమ్స్‌’ నిర్వహిస్తే అక్కడ తన ప్రతిభ చాటిన ఆమె దగ్గర కనీసం కిట్‌ కూడా లేదు. ఆమెకి ఎనిమిది మంది తోబుట్టువులు. తండ్రి రైతు. ఆయన సంపాదన కుటుంబ పోషణకే చాలదు. దీంతో సాదా బ్యాటే దిక్కు.

అలా అబ్బాయిలతో ఇసుకలో చెప్పుల్లేకుండా క్రికెట్‌ ఆడుతోన్న వీడియో సచిన్‌ కంటపడింది. ఆమె కొట్టే ప్రతి షాటూ ఫోర్‌, సిక్సరే! ముమల్‌ స్టైల్‌, బంతిని కొట్టే తీరు, ఆత్మవిశ్వాసం నచ్చి సచిన్‌ ఆ వీడియోను తన ట్విటర్‌, ఇన్‌స్టా ఖాతాల్లో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌ అయ్యింది. ఆమె గురించి తెలుసుకున్న రాజస్థాన్‌ రాజకీయ నాయకుడొకరు తనకి క్రికెట్‌ కిట్‌ని బహుమతిగా ఇచ్చారు. జెర్సీ, కిట్‌ను చూసుకొని మురిసిపోయింది ముమల్‌. ఆమె ఆటకు ముగ్ధులైన వారిలో ఆనంద్‌ మహీంద్రా కూడా చేరారు. పొగడ్తలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని ఇలాంటి వాళ్లకి తగిన అవకాశాలూ దక్కితే దేశానికి కీర్తి కిరీటాలు అవుతారంటున్నారు నెటిజన్లు. తన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలుసుకున్న ముమల్‌ మాత్రం అండర్‌-19 జాతీయ జట్టుకు అర్హత సాధించడమే తన లక్ష్యమంటోంది. తను కోరుకున్న స్థాయికి ఎదగాలని మనమూ కోరుకుందామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్