కష్టాల కెరటాలకు తల వంచక!

నడి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలకు ఆమె భయపడదు. సముద్రం కన్నా ఎక్కువగా భయపెట్టే జీవితానుభవమే ఆమెకా ధైర్యాన్నిచ్చిందేమో! నాన్న లేకపోయినా ఒంటి చేత్తో అమ్మ పెంచిన ధీశాలి ప్రీతి కొంగర.

Updated : 01 Feb 2023 07:22 IST

నడి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలకు ఆమె భయపడదు. సముద్రం కన్నా ఎక్కువగా భయపెట్టే జీవితానుభవమే ఆమెకా ధైర్యాన్నిచ్చిందేమో! నాన్న లేకపోయినా ఒంటి చేత్తో అమ్మ పెంచిన ధీశాలి ప్రీతి కొంగర. సెయిలింగ్‌ పోటీల్లో అద్భుతంగా రాణిస్తూ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు అందుకున్న ఈ 18 ఏళ్ల హైదరాబాద్‌ అమ్మాయి స్ఫూర్తి కథేంటో తెలుసుకుందాం రండి...    

నాన్నతో సంతోషంగా గడిపిన జ్ఞాపకాలేవీ నాకు గుర్తులేవు. ఆయన వాచ్‌మెన్‌. నాకు ఏడేళ్లు కూడా రాకుండానే ఆయన అనారోగ్యంతో చనిపోయారు. అమ్మ విజయలక్ష్మి దుస్తుల దుకాణంలో పనిచేసి అక్క ప్రియను, నన్ను పెంచింది. కాస్త పెద్దయ్యాక అక్క కూడా పార్ట్‌టైం ఉద్యోగం చేసి అమ్మకు తోడు నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నప్పుడు.. నాందీ కళ్యాణ్‌ ఫౌండేషన్‌ వాళ్లు వాటర్‌గేమ్స్‌లో ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేస్తోంటే.. నేను వెళ్తానన్నా. అమ్మేమో వద్దని! అప్పటివరకూ నీళ్లలోకి దిగాలంటేనే భయపడేదాన్ని మరి. ఎలాగోలా బతిమాలి, ఒప్పించి శిక్షణలో చేరిపోయా.

మొదట్లో భయపడ్డా..

బోటు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు బలమైన గాలులకు నిలవలేక నీళ్లలో పడిపోయా. దాంతో ‘సెయిలింగ్‌ వద్ద’ంటూ భయంతో ఏడుస్తుంటే మా మెంటార్‌ సుహీమ్‌  ధైర్యం చెప్పారు. దాంతో తిరిగి శిక్షణలో చేరి పోటీలకు సిద్ధమయ్యా. అలా 2016లో తెలంగాణా రాష్ట్ర సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌ 15 పోటీలకు హాజరై, జూనియర్‌ ఫ్లీట్‌లో వెండి పతకాన్ని సాధించా. అదే ఏడాది మాన్సూన్‌ రెగట్టా పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలిచా. సెయిలింగ్‌లో చేరినప్పట్నుంచీ నా చదువుకు కావాల్సిన సాయం, పోషకాహారం తదితర అవసరాలన్నీ నా మెంటారే చూసుకొనేవారు. మొదటిసారి చెన్నైలో శిక్షణ కోసం సముద్రంలోకి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం.. బలమైన కెరటాలు నన్ను వణికించాయి. అప్పటివరకు హుస్సేన్‌సాగర్‌లో నడపడం అలవాటైన నన్ను ఒక్కసారిగా అంత పెద్ద సముద్రం కాస్త భయపెట్టింది. అంతర్జాతీయపోటీలకు అర్హత సాధించగలనా అనిపించింది. కానీ శిక్షణతో నెమ్మదిగా అలవాటైంది. ఆ తర్వాత ముంబయి, పాండిచ్చేరి, కృష్ణపట్నంలోని సముద్రాల్లో అవలీలగా సెయిలింగ్‌ చేయగలిగా. అంతర్జాతీయ స్థాయిలో ఒమన్‌లో ఇండియా తరఫున మొదటిసారి సముద్రంలో సెయిలింగ్‌ పోటీల్లో పాల్గొన్నప్పుడు కొంత తడబడ్డా. 300మంది ఒకేసారి పోటీలో ఉండటం కూడా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకూ అయిదు బంగారు పతకాలు, నాలుగు వెండి, అయిదు కాంస్య పతకాలను అందుకున్నా. ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌ కోసం ఏడాదిగా ముంబయిలోనే ఉంటూ.. శిక్షణ తీసుకుంటున్నా. దూరవిద్యలో ఇంటర్‌ చదువుతున్నా. ఒలింపిక్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో పాల్గొనాలన్నది నా లక్ష్యం. దానికోసం కఠిన సాధన చేస్తున్నా.

గర్వంగా ఉంది..

నీదగ్గర సెయిలింగ్‌లో శిక్షణ తీసుకుంటానంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. గర్వంగా అనిపించింది. అవకాశం వస్తే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఏదైనా నేర్చుకోవాలంటే భయాన్ని మనసు నుంచి తీసిపారేయాలి. మనల్ని మనం నమ్మితే చాలు. విజయం చెంతకొస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్