Women Judges: వచ్చారు.. యువ న్యాయమూర్తులు
ఒకప్పుడు వీళ్లంతా సాధారణ మహిళలే! న్యాయం అందరికీ అందేలా చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా పట్టు వదల్లేదు.
ఒకప్పుడు వీళ్లంతా సాధారణ మహిళలే! న్యాయం అందరికీ అందేలా చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదురైనా పట్టు వదల్లేదు. ఫలితమే చిన్న వయసులో జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. తమ స్ఫూర్తిమంతమైన ప్రయాణాల్ని వసుంధరతో పంచుకున్నారు.
మగ్గంవర్క్ చేసి...
గొల్లపల్లి స్రవంతి
మాది కాకినాడ జిల్లా పెద్దాపురం. నాన్న సూర్యప్రకాశరావు. అమ్మ వసంతలక్ష్మి. నాన్న కిరాణాబడ్డీ నడిపేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. తొమ్మిదో తరగతిలో టైపింగ్‌లో చేరదామంటే ఫీజుకీ డబ్బుల్లేవు. వేసవి సెలవుల్లో ఏదో ఒకటి నేర్చుకొనేదాన్ని. అలా నేర్చుకున్న శారీ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గంవర్క్‌లతోనే టైపింగ్‌కి, ఇంటర్‌కీ డబ్బులు సమకూర్చుకున్నా. డిగ్రీ చదువుతున్నప్పుడే పెళ్లిచేశారు. మావారు శ్రీకాంత్ ప్రోత్సాహంతో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేశా. తర్వాత మగ్గం వర్క్ చేసుకుంటూ బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యా. ఆ సమయంలో ఆయన ఉద్యోగం పోయింది. అప్పుడే కోర్టులో కాపీయర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించా. 2010లో జ్యుడీషియల్ విభాగంలో కాపీయర్‌గా చేరా. పనిచేస్తూనే షార్ట్‌హ్యాండ్ నేర్చుకుని.. స్టెనోగ్రాఫర్‌గా పదోన్నతి పొందా. కోర్టులో రోజూ న్యాయమూర్తులను చూసి అలా నేనెందుకు కాలేననుకుని, ఎల్‌ఎల్‌బీలో చేరా. హైకోర్టుకు దరఖాస్తు పెట్టుకుంటే 5 ఏళ్ల తర్వాత అంగీకరించింది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించా. ఇంతలో కొవిడ్ సోకింది. అంబులెన్స్ ఎక్కిస్తున్నప్పుడూ పుస్తకాలు వెంట తీసుకెళ్లా. అలా మెయిన్స్ పాస్ అయ్యా. 2021లో ఏపీ హైకోర్టు నుంచి జూనియర్ సివిల్ జడ్జికి నోటిఫికేషను వెలువడింది. రెండో ప్రయత్నంలో ఎంపికయ్యా. ప్రస్తుతం గుంటూరు మొబైల్ కోర్టులో మెజిస్ట్రేటుగా విధులు నిర్వర్తిస్తున్నా. ఇన్నేళ్లలో ఏ రోజూ నావల్ల కాదని అనుకోలేదు. సంకల్పం గట్టిదైతే గమ్యాన్ని చేరుకోవడం సులువని నమ్ముతా.
నరాల త్రిమూర్తులు, ద్రాక్షారామం
టీచరు నుంచి జడ్జిగా..
గాదె మంజుల
ఆర్థిక ఇబ్బందులతో ఇంటరయ్యాక చదువాపేశా. మాది జనగామ జిల్లా మండెలగూడెం. నాన్న ఆటో డ్రైవర్. బంధువుల అబ్బాయితో పెళ్లైంది. ఆయన మార్కెటింగ్ ఉద్యోగి. నేనూ కొన్నాళ్లు టీచర్‌గా చేశా. మావారి ప్రోత్సాహంతో దూరవిద్యలో పీజీ చేశా. ఇంతలో ఆయనకి పక్షవాతం. అదే అదను అనుకొని అయినవాళ్లు ఊళ్లో భూసమస్యను లేవనెత్తారు. కోర్టు, పోలీసుల్లేకుండా.. తృణమో, పణమో ఇచ్చి సరిపెట్టాలనుకున్నారు..పోరాడా. ఇలా ఇంకెవరికీ అన్యాయం జరగకూడదనుకున్నా. ఆయన్ని చూసుకుంటూనే లా పూర్తిచేశా. ప్రస్తుతం అనంతపురం మొబైల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నా.
సత్వర న్యాయం లక్ష్యంగా..
దామెర్ల ప్రీతి
అమ్మనాన్నలిద్దరూ విద్యావంతులు. ఆదిలాబాద్‌లో పాఠశాల నడుపుతున్నారు. వాళ్లని చూసి ఉన్నత విద్య వైపు వచ్చా. చుట్టుపక్కల సమస్యలు, సామాన్యులకి న్యాయం అందటంలో జాప్యం ఇవే నన్ను న్యాయ విద్య ఎంచుకునేలా చేశాయి. ఎల్‌ఎల్‌బీ.. 2021లో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశా. కొవిడ్ సమయంలో జూనియర్ సివిల్ జడ్జి అవ్వాలనుకొని సన్నద్ధమయ్యాను. ‘ఆడపిల్లకు ఈ వృత్తి ఎందుకు? పెళ్లి చేయరా?’ అనేవారు. నీ తోటి వాళ్లంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావని హేళన చేసేవారు. ఇవేవీ నేను పట్టించుకునేదాన్ని కాదు. జడ్జిగా తీర్పు ఇవ్వాలనే లక్ష్యమే నన్ను ముందుకు నడిపించింది. రోజులో పదిగంటలు చదివేదాన్ని. యూట్యూబ్‌లో తరగతులు వింటూ నిద్ర మర్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అమ్మనాన్నలు వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యానంటే వారిచ్చిన ధైర్యమే కారణం.
రెండో ప్రయత్నంలో..
పద్మ సాయిశ్రీ
ఆడపిల్ల ఎవరిపైనా ఆధారపడకూడదు. మంచైనా, చెడైనా తన నిర్ణయాలు తానే తీసుకోవాలని నా ఉద్దేశం. ఇలా ఆలోచించడానికి నాన్న పద్మ పండరి కారణం. ఆయన సీనియర్ న్యాయవాది. అమ్మ మేఘమాల టీచర్. మాది నిజామాబాద్. చిన్నప్పుడు నాన్నతో కోర్టుకి వెళ్లేదాన్ని. నా దృష్టంతా న్యాయమూర్తిపైనే! కోర్టు కార్యక్రమాలు, మహిళల సమస్యలను గమనించేదాన్ని. వాటికి పరిష్కారాలుగా న్యాయమూర్తి ఇచ్చే తీర్పులు నన్ను ప్రభావితం చేసేవి. ఆ స్ఫూర్తితోనే జడ్జిని కావాలనుకున్నా. అది విని చాలామంది ‘ఆడపిల్లకు ఈ వృత్తెందుకు? టీచర్ ఉద్యోగమే సరైనది’ అనే సలహాలిచ్చారు. నేను పట్టించుకునేదాన్ని కాదు. రేయింబవళ్లు కష్టపడి చదివాను. తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష రాస్తే రెండు మార్కుల్లో పోయింది. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. ఈసారి పట్టుదలగా ప్రయత్నించి విజయవంతమయ్యా. హైకోర్టు జడ్జి కావాలనేది నా ఆశయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.