UPSC Toppers : అదే వీరి ‘గెలుపు’ మంత్రం!

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే దాకా విశ్రమించకండి..’ అన్న అబ్దుల్‌ కలాం మాటల్ని అక్షర సత్యం చేసి చూపించారు ఈ ఏటి మేటి సివిల్స్‌ టాపర్స్‌. ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’న్న వీరి సంకల్పం దేశ అత్యున్నత ప్రభుత్వ కొలువును వీరికి కట్టబెట్టింది. గతేడాదిలాగే ఈసారీ అబ్బాయిల్ని వెనక్కి నెట్టి......

Updated : 24 May 2023 14:31 IST

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునే దాకా విశ్రమించకండి..’ అన్న అబ్దుల్‌ కలాం మాటల్ని అక్షర సత్యం చేసి చూపించారు ఈ ఏటి మేటి సివిల్స్‌ టాపర్స్‌. ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’న్న వీరి సంకల్పం దేశ అత్యున్నత ప్రభుత్వ కొలువును వీరికి కట్టబెట్టింది. గతేడాదిలాగే ఈసారీ అబ్బాయిల్ని వెనక్కి నెట్టి తొలి నాలుగు ర్యాంకుల్ని అమ్మాయిలే కైవసం చేసుకోవడం విశేషం. సవాళ్లను సానుకూలంగా తీసుకుంటూ, ఒడిదొడుకుల్ని ఓర్పుతో ఎదుర్కొంటూ సాగిన వీరి ‘గెలుపు’ ప్రయాణం ప్రత్యేకంగా మీకోసం..!

నాన్న స్ఫూర్తితో..!

తల్లిదండ్రుల స్ఫూర్తితో పిల్లలు తమ కెరీర్‌కు బాటలు వేసుకోవడం సహజమే! అలా తానూ తన తండ్రి స్ఫూర్తితో దేశ సేవ చేయాలని సంకల్పించుకున్నానంటోంది తాజా సివిల్స్‌ టాపర్‌ ఇషితా కిశోర్‌. ఆలిండియా మొదటి ర్యాంక్‌ సాధించిన ఆమె చిన్నతనం నుంచి చదువులోనే కాదు.. ఆటల్లోనూ రాణించేది. బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, తైక్వాండో.. వంటి క్రీడల్లో ప్రతిభ చూపేది. దిల్లీ యూనివర్సిటీకి చెందిన ‘శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌’ నుంచి 2017లో ఎకనామిక్స్‌ (ఆనర్స్‌) విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఇషిత.. ఓ కన్సల్టింగ్‌ కంపెనీలో ‘రిస్క్‌ అడ్వైజరీ’ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్‌కు సన్నద్ధమవుతూ వచ్చిందామె. ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజయం సాధించిందీ టాప్‌ ర్యాంకర్‌.

‘నాన్న మిలిటరీ ఆఫీసర్‌. చిన్నప్పట్నుంచి ఆయన్ని చూసి స్ఫూర్తి పొందేదాన్ని. నాన్నలా దేశానికి సేవ చేయాలని సంకల్పించుకున్నా. నా ఆశయానికి అమ్మానాన్నల ప్రోత్సాహం తోడైంది. మూడోసారి విజయం సాధించా. సివిల్స్‌ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలో ఎంపికవడమే గొప్పనుకుంటే మొదటి ర్యాంక్‌ సాధించడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సివిల్స్‌కు ఎంపికవుతానన్న నమ్మకమైతే ముందు నుంచే ఉంది. కానీ టాపర్‌గా నిలుస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో కష్టపడ్డా. ఆత్మవిశ్వాసమే నన్ను విజయతీరాలకు చేర్చింది..’ అంటోంది ఇషిత.


కోచింగ్‌ తీసుకోకుండానే..!

సాధారణంగా సివిల్స్‌ అంటే లక్షల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టి మరీ కోచింగ్‌ తీసుకుంటారు చాలామంది. కానీ ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా, అదీ ఆన్‌లైన్‌ క్లాసులు వింటూ సన్నద్ధమైంది బిహార్‌లోని బక్సర్‌ ప్రాంతానికి చెందిన గరిమా లోహియా. తొలి ప్రయత్నంలో విఫలమైన ఆమె.. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకు సాధించడం విశేషం. ఈ ప్రయాణంలో తాను నిరాశకు గురైన ప్రతిసారీ తన తల్లే వెన్నుతట్టేదని చెబుతోంది గరిమ.

‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. అయితే ఏడేళ్ల క్రితం మా నాన్నను కోల్పోయా. ఆ సమయంలో మా జీవితం శూన్యమైపోయింది. కానీ ఆ బాధను దిగమింగి నేను ఐఏఎస్‌ కావాలని కలలు కన్న నాన్న చివరి కోరికను నెరవేర్చాలనుకున్నా. ఈ సంకల్పంతోనే స్కూలింగ్‌, కళాశాల విద్యాభ్యాసం పూర్తిచేశా. ఆపై సివిల్స్‌ సన్నద్ధతపై దృష్టి పెట్టా. ఇందుకోసం కోచింగ్‌ లేకుండానే ఇంటి వద్దే ప్రిపేరవ్వాలనుకున్నా. అయితే మొదటి ప్రయత్నంలో సక్సెస్‌ సాధించలేకపోయా. రెండోసారి మరింత పట్టుదలతో చదివాను. యూట్యూబ్‌ వీడియోలు, అంతర్జాలంలో సమాచారం సేకరించుకొని ప్రిపేరయ్యా. ఈ ప్రయాణంలో అనుక్షణం అమ్మే నా వెన్ను తట్టింది. అమ్మానాన్నల కల నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నాన్న ఉండి ఉంటే ఎంత ఆనందించే వారో..!’ అంటూ తన గెలుపు రహస్యాన్ని పంచుకుంది గరిమ.


ఐదేళ్ల కష్టమిది!

నాన్న స్ఫూర్తితో తాజా సివిల్స్‌ ఫలితాల్లో ముచ్చటగా మూడో ర్యాంకు సాధించింది తెలుగమ్మాయి నూకల ఉమా హారతి. నారాయణ్‌పేట్‌ ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు కూతురు ఆమె. ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఉమ.. ఆంథ్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకొని సక్సెసైంది.

‘ఏ అంశంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల మద్దతు, ప్రోత్సాహం తప్పనిసరి. విజయం సాధించడంలో మన ప్రయత్నం సగమైతే.. కుటుంబం నుంచి అందే మానసిక ప్రోత్సాహం మనకు అదనపు బలం. అదే నా విజయంలో కీలక పాత్ర పోషించింది. నేను గత ఐదేళ్లుగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకుల్ని, ఓటముల్ని చవిచూశా. అయినా నా తల్లిదండ్రులు నాపై పూర్తి నమ్మకం ఉంచారు.. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లేలా నా వెన్నుతట్టారు. దాని ప్రతిఫలమే నా ఈ విజయం..’ అంటోంది ఉమ.


ఏడెనిమిది గంటలు చదివా!

బరేలీ డీఎస్పీ రాజ్‌కుమార్‌ మిశ్రా కుమార్తె స్మృతీ మిశ్రా తాజా సివిల్స్‌ ఫలితాల్లో నాలుగో ర్యాంకు సాధించింది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆమె దిల్లీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. ప్రస్తుతం లా చదువుతోన్న స్మృతి.. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. మొదటిసారి విఫలమైనా రెండో ప్రయత్నంలో అనుకున్నది సాధించగలిగానంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోందీ కాబోయే కలెక్టరమ్మ.

‘ఐఏఎస్‌ కావాలన్న లక్ష్యాన్ని చిన్నప్పుడే ఏర్పరచుకున్నా. ఈ దిశగానే అడుగులు వేశాను. ప్రస్తుతం లా చదువుతూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. రోజుకు ఏడెనిమిది గంటలు చదివేదాన్ని. సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం వల్ల ఆయా అంశాలపై పట్టు పెరిగింది. ఇదే నా విజయంలో కీలక పాత్ర పోషించింది.. నా విజయం మా అమ్మానాన్నలకు అంకితం!’ అంటూ తన సక్సెస్‌ స్టోరీని పంచుకుంది స్మృతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్