అలా మంచుపై జారుతూ.. రికార్డు కొట్టేసింది!

‘ABFTTB - Always Be Faster Than The Boys’.. అమెరికన్‌ యంగ్‌ స్కీయర్ మైకేలా షిఫ్రిన్‌ ఇన్‌స్టా బయోలో, ఆమె హెల్మెట్‌పై ఇదే రాసుంటుంది. అంటే.. ఆటలో తాను అబ్బాయిల కంటే ఎప్పుడూ ముందుంటానని ఇలా చెప్పకనే చెప్పిందామె. ఇలా మాట వరసకే కాదు.. తాజా ప్రపంచ రికార్డుతో ఈ విషయం....

Published : 12 Mar 2023 10:30 IST

‘ABFTTB - Always Be Faster Than The Boys’.. అమెరికన్‌ యంగ్‌ స్కీయర్ మైకేలా షిఫ్రిన్‌ ఇన్‌స్టా బయోలో, ఆమె హెల్మెట్‌పై ఇదే రాసుంటుంది. అంటే.. ఆటలో తాను అబ్బాయిల కంటే ఎప్పుడూ ముందుంటానని ఇలా చెప్పకనే చెప్పిందామె. ఇలా మాట వరసకే కాదు.. తాజా ప్రపంచ రికార్డుతో ఈ విషయం నిరూపించింది కూడా! అల్పైన్‌ స్కీయింగ్‌ క్రీడలో మొత్తంగా 87 ప్రపంచకప్‌ టైటిళ్లు గెలుచుకొని.. ఈ ఘనత సాధించిన తొలి స్కీయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పిందామె. ఇప్పటివరకు ఈ రికార్డు స్వీడన్‌కు చెందిన 66 ఏళ్ల ఇంగెమార్‌ స్టెన్‌మార్క్‌ పేరిట ఉంది. ప్రస్తుతం స్వీడన్‌లో జరుగుతోన్న ‘అల్పైన్‌ స్కీయింగ్‌ ప్రపంచకప్‌’ పోటీల్లో భాగంగా.. ఈ రికార్డును తిరగరాసిన షిఫ్రిన్.. 27 ఏళ్ల వయసులోనే అన్ని ప్రపంచకప్‌ టైటిళ్లు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ యువ స్కీయర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

ఆమెకు తిరుగులేదు!

సాధారణంగా మంచుపై నిల్చుంటేనే జారిపోతాం.. అలాంటిది స్కీయింగ్‌ చేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది అమెరికాకు చెందిన యువ స్కీయర్ మైకేలా షిఫ్రిన్‌. 27 ఏళ్ల ఈ చిన్నది.. ప్రస్తుతం స్వీడన్‌లోని అరెలో జరుగుతోన్న ‘అల్పైన్‌ స్కీయింగ్‌ ప్రపంచకప్‌’ పోటీల్లో తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. ఇందులో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోన్న ఆమె.. తన కెరీర్‌లో భాగంగా తాజాగా 87వ ప్రపంచకప్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో ప్రపంచంలోనే అత్యధిక ప్రపంచకప్‌ టైటిల్స్‌ సాధించిన స్కీయర్‌గా రికార్డు నెలకొల్పిందామె. గతంలో ఈ రికార్డు స్వీడన్‌కు చెందిన 66 ఏళ్ల ఇంగెమార్‌ స్టెన్‌మార్క్‌ (86 ప్రపంచకప్‌ టైటిళ్లు) పేరిట ఉంది. తాజా గేమ్‌లో ఈ రికార్డును సమం చేసిన షిఫ్రిన్.. తాజాగా మరో టైటిల్ సాధించి తనకు తిరుగులేదనిపించింది. ‘ఇంత చిన్న వయసులోనే ఈ యువ స్కీయర్‌ ప్రపంచ రికార్డును బద్దలుకొడితే.. ఇక తన కెరీర్‌లో ఇంకెన్ని టైటిల్స్‌ సాధిస్తుందో చూడాలం’టూ అందరి ప్రశంసలు అందుకుంటోంది షిఫ్రిన్.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..!

అమెరికాలోని కొలరాడోలో జన్మించింది షిఫ్రిన్. ఆమె తల్లిదండ్రులిద్దరూ స్కీయింగ్‌ క్రీడాకారులే. ఆట నుంచి విరమణ పొందాక ఈ క్రీడలో శిక్షకులుగా మారారు. ఆమె అన్నయ్య కూడా స్కీయింగ్‌ క్రీడాకారుడే! ఇలా చిన్న వయసు నుంచి స్కీయింగ్‌ వాతావరణంలో పుట్టిపెరిగిన ఆమెకు.. ఈ క్రీడపై మక్కువ పెరిగింది. దీనికి తోడు పసితనం నుంచే తల్లిదండ్రులతో కలిసి శిక్షణ ప్రదేశం వద్దకు వెళ్లేదామె. ఇలా తన కూతురికీ ఈ క్రీడ పట్ల మక్కువ ఉందని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు.. షిఫ్రిన్నూ ఈ దిశగా ప్రోత్సహించారు.. ఆటలో శిక్షణ ఇచ్చి ఆరితేరేలా చేశారు. అలాగని చదువును పూర్తిగా పక్కన పెట్టలేదీ యంగ్‌ ప్లేయర్‌. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొనేది. అయితే మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తూ తండ్రిని కోల్పోయిన ఆమె.. ఆ బాధను దిగమింగి మరీ క్రీడలో రాణిస్తోంది.

‘మా నాన్న మరణం మా కుటుంబాన్నే కుంగదీసింది. అయినా నా మనసులోని బాధను దిగమింగుతూ ఆయనిచ్చిన స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నా. నా విజయాల్ని చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు.. గర్వపడతారు..’ అంటూ భావోద్వేగానికి గురైంది షిఫ్రిన్.

అత్యుత్తమ స్కీయర్‌గా!

యుక్త వయసు నుంచే స్కీయింగ్‌ పోటీల్లో పాల్గొంటూ పతకాల వేట ప్రారంభించిన షిఫ్రిన్.. తన 15వ ఏట స్కీయింగ్‌ ప్రపంచకప్‌ పోటీల్లో అడుగుపెట్టింది. ఈ 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మరపురాని విజయాలు సాధించిందామె. రెండుసార్లు ‘ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌’గా, ఐదుసార్లు ‘ఓవరాల్‌ ప్రపంచకప్‌ ఛాంపియన్‌’గా నిలిచిన ఆమె.. ఏడుసార్లు ‘ప్రపంచకప్‌ డిసిప్లిన్ టైటిల్‌’ గెలుచుకుంది. అంతేకాదు.. తన 18 వ ఏట ‘ఒలింపిక్‌ ఆల్పైన్‌ స్కీయింగ్‌ చరిత్ర’లోనే ‘అతిపిన్న స్లాలోమ్‌ ఛాంపియన్‌’గా అవతరించిందీ అమెరికన్‌ స్కీయర్‌. ఇక తాజాగా తన కెరీర్‌లో 87 వ ప్రపంచకప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆమె.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కీయర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ క్రీడలో మహిళల, పురుషుల విభాగాల్లో కలుపుకొని మొదటి ర్యాంక్‌లో కొనసాగుతోంది.

నిద్రంటే బంగారం!

షిఫ్రిన్ ముద్దు పేరు ‘సర్‌ న్యాప్స్‌ ఎ లాట్‌’. వినడానికి విచిత్రంగా అనిపించినా.. నిద్రపై తనకున్న ఇష్టమే తనకీ పేరు పెట్టేలా చేసిందని చెబుతోందామె. ‘స్కీయింగ్‌ తర్వాత నీకు ఇష్టమైందేంటని అడిగితే నిద్ర అని చెబుతా. నాకు నిద్రంటే బంగారం. రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినా సరే.. మధ్యాహ్నం ఓ రెండు గంటలు కునుకు తీయందే మనసొప్పదు. అంతేకాదు.. నా పడకగదిని కూడా ఎప్పుడూ చాలా సౌకర్యవంతంగా ఉంచుకుంటా. క్రీడా పోటీల కోసం ఎక్కడికెళ్లినా నా పర్సనల్‌ బ్లాంకెట్‌ నాతో ఉండాల్సిందే! ఒకవేళ ఏవైనా కారణాల వల్ల నిద్ర పట్టకపోయినా, నిద్ర లేకపోయినా.. తీవ్ర ఒత్తిడికి గురవుతా..’ అంటోన్న షిఫ్రిన్.. తన ఇన్‌స్టా బయోలోనూ ‘స్లీప్‌ లవర్’ అని రాసుకుంది!

డ్యాన్స్‌ లవర్!

స్కీయింగ్‌, నిద్రే కాదు.. తానో పెద్ద డ్యాన్స్‌ లవర్‌ని కూడా అంటోందీ అమెరికన్‌ స్కీయర్‌. తన ప్రతి విజయాన్నీ డ్యాన్స్‌తో సెలబ్రేట్‌ చేసుకునే ఈ చక్కనమ్మ.. పియానో, గిటార్‌.. వంటి సంగీత వాయిద్య పరికరాలు వాయించడంలోనూ దిట్టేనట! ఇక ఖాళీ సమయాల్లో ‘వర్డ్‌ సెర్చ్‌ గేమ్స్‌’ బాగా ఆడతానంటోందీ స్కీయింగ్‌ బ్యూటీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్