తనను తానే ఉదాహరణగా చూపి..

ఉన్నత విద్యాభ్యాసం చేయాలనేది ఆమె కల. పెళ్లి చేయడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులను ఎన్జీవో సాయంతో ఆపగలిగారీమె. తిరిగి చదువుకొని పోలీసు కానిస్టేబుల్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామీణ మహిళల్లో విద్య, ఆరోగ్యం, నెలసరిపై అవగాహన కలిగిస్తున్న అన్నూ కుమారి స్ఫూర్తి కథనమిది.

Updated : 18 Feb 2023 03:13 IST

ఉన్నత విద్యాభ్యాసం చేయాలనేది ఆమె కల. పెళ్లి చేయడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులను ఎన్జీవో సాయంతో ఆపగలిగారీమె. తిరిగి చదువుకొని పోలీసు కానిస్టేబుల్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామీణ మహిళల్లో విద్య, ఆరోగ్యం, నెలసరిపై అవగాహన కలిగిస్తున్న అన్నూ కుమారి స్ఫూర్తి కథనమిది.

చిన్నప్పటి నుంచి కుమారికి చదువుకోవాలనే ఆశ. తల్లిదండ్రుల ప్రోత్సాహమే లేదు. ఎంత చదివినా ఒక ఇంటికి కోడలిగా వెళ్లాల్సిందేగా అనేవారు. బిహార్‌లోని అమవాన్‌ గ్రామం ఈమెది. ఇక్కడ స్థానిక గ్రామీణ ప్రాంత మహిళల్లో నెలసరి, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన అందించడానికి ‘పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ సేవాసంస్థ ‘కిషోరీ సమూహ్‌’ బృందాన్ని ప్రారంభించింది. ఆసక్తితో కుమారి ఇందులో చేరి శిక్షణ తీసుకొన్నారు. తర్వాత సభ్యురాలై చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలను కలుసుకొని నెలసరి పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ, పౌష్టికాహారం, బాల్యవివాహాలపై అవగాహన కలిగించేవారు. గ్రామాలన్నీ పర్యటించి మహిళల్లో అవగాహన పెంచండంలో కుమారి చురుగ్గా ఉండటంతో బృందంలో యూత్‌ ఛాంపియన్‌ అయ్యింది కూడా.

విమర్శలెన్నో..

కిషోరీ సమూహ్‌లో చేరినప్పుడు మొదట్లో కుమారికెన్నో విమర్శలెదురయ్యాయి. గ్రామంలో మిగతా అమ్మాయిలను ఇందులో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు ఈమెపట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కలిగిస్తూ మహిళలందరినీ ఇందులో చేరేలా ప్రోత్సహించారీమె. మొదట అయిదుగురు మాత్రమే అమ్మాయిలుండేవారు. ఆమె చొరవతో సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘ఇంట్లో అమ్మానాన్న నాకెప్పుడు పెళ్లి చేద్దామా అనే చూసేవారు. మా ఊరి సంప్రదాయం ప్రకారం యుక్తవయసు వచ్చేసరికి ఆడపిల్లకు వివాహం చేస్తారు. దీంతో ఎన్నో ఆశలుండీ నేరవేర్చుకోలేక నిస్సహాయంగా ఉండిపోయేవారు. నాకు కూడా వివాహ ఏర్పాట్లు చేశారు. వరకట్నంగా రూ.10 నుంచి రూ.15 లక్షలివ్వడానికి అమ్మానాన్న సిద్ధపడ్డారు. ఆ నగదుతో నన్ను చదివించొచ్చు కదా అని అడిగా. వారు వినలేదు. ‘పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వాహకులకు సమాచారాన్నిస్తే, వారొచ్చి మాట్లాడారు. అమ్మ ససేమిరా అంది. నాన్న మాత్రం ఒప్పుకొన్నారు. అలా నా పెళ్లిని ఆపగలిగా. ఆ తర్వాత మగధ్‌ యూనివర్శిటీలో బీఎస్‌సీలో చేరా. కాలేజీకి వెళ్లడానికి నాన్న నాకు బైకు కొనిచ్చారు’ అని వివరిస్తారీమె.

పోలీసు కొట్టడంతో..

ఒక రోజు కాలేజీకి హెల్మెట్‌ లేకుండా కుమారి బైకుపై వెళుతుంటే ఓ మహిళా పోలీసు ఆపారు. ‘హెల్మెట్‌ ధరించనందుకు నన్ను చెంపపై కొట్టి, జరిమానా వేశారు. నా జీవితంలో మొదటిసారి ఒక మహిళాపోలీసును మా ప్రాంతంలో చూశా. అంతే.. పోలీసు కావాలని గట్టిగా అనుకున్నా. దీనికి సంబంధించిన పరీక్షలకు హాజరై పాసయ్యా. కానిస్టేబుల్‌గా శిక్షణ పొందుతున్నా. త్వరలో డ్యూటీలో చేరతా. ఆ తర్వాత ఇన్‌స్పెక్టరు కావడానికి పరీక్ష రాస్తా. ప్రస్తుతం ఓవైపు శిక్షణ తీసుకుంటూ, సమయం ఉన్నప్పుడల్లా గ్రామీణ ప్రాంతాలకు పర్యటించి అందరిలో ఆరోగ్యంసహా విద్యపట్ల అవగాహన కలిగిస్తున్నా. నన్ను నేనే ఉదాహరణగా చూపిస్తున్నా. ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడుతున్నారు. మొదట విమర్శించిన వారంతా ఇప్పుడు వారి పిల్లలను చదివించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు’ అని గర్వంగా చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్