ఆమె చిత్రం.. తారలకే అపురూపం

రెడీ.. వన్‌.. టూ.. త్రీ స్మైల్‌! తరహా ఫొటోల్లో నవ్వు ఉంటుంది కానీ సహజ ఆనందం కనిపించదు కదా! ఫొటోలు.. అపురూపంగా దాచుకునే జ్ఞాపకాలు. ఆ క్షణాల్లో సహజత్వం ఉన్నప్పుడే అవి ప్రత్యేకం. అలాంటి అపురూప జ్ఞాపకాలను తల్లులకు అందించాలనుకున్నారు అమృత. గర్భిణులు, పసిపిల్లలకు ఫొటోలన్న ఊహే లేని రోజుల్లో దాన్ని పరిచయం చేసి, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగారు.

Updated : 11 Feb 2023 07:13 IST

రెడీ.. వన్‌.. టూ.. త్రీ స్మైల్‌! తరహా ఫొటోల్లో నవ్వు ఉంటుంది కానీ సహజ ఆనందం కనిపించదు కదా! ఫొటోలు.. అపురూపంగా దాచుకునే జ్ఞాపకాలు. ఆ క్షణాల్లో సహజత్వం ఉన్నప్పుడే అవి ప్రత్యేకం. అలాంటి అపురూప జ్ఞాపకాలను తల్లులకు అందించాలనుకున్నారు అమృత. గర్భిణులు, పసిపిల్లలకు ఫొటోలన్న ఊహే లేని రోజుల్లో దాన్ని పరిచయం చేసి, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగారు.

ది దేశాల్లో వేల షూట్‌లు.. విజయవంతమైన ఫొటోగ్రాఫర్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మదర్‌-బేబీ ఫొటోషూట్‌లూ ఇప్పుడు కొత్త కాదు. 2013.. అవేంటో తెలియని రోజుల్లో దేశంలో వాటిని పరిచయం చేశారు అమృత సమంత్‌. ‘చిన్నప్పట్నుంచీ ఆర్టిస్ట్‌ కావాలని కోరిక. పెయింటింగ్‌, డ్యాన్స్‌, థియేటర్‌ ఆర్ట్స్‌.. సృజనాత్మకత చూపించగల ప్రతిదాన్నీ ప్రయత్నించేదాన్ని. మాది చెన్నై. హ్యూమన్‌ రిసోర్స్‌లో పీజీ చేశా. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం చేస్తూనే డ్యాన్స్‌ కొరియోగ్రఫీ, నటన, మేగజీన్లకు వ్యాసాలు రాయడం, బొమ్మలు గీయడం వంటివెన్నో కొనసాగించా. నచ్చిన ఉద్యోగమే అయినా ఏదో అసంతృప్తి. ఓసారి స్నేహితురాలి పెళ్లికి వెళ్లినపుడు ఫొటోగ్రఫీపై మనసు పారేసుకున్నా. దాన్నే కెరియర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించేసుకున్నా’ అంటారు అమృత.


ఆ క్షణాలు బంధించాలనీ..

ద్దరు బిడ్డల తల్లి. పిల్లలంటే సహజంగానే ఇష్టం. దీంతో అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పిల్లల ఫొటోలే ప్రత్యేకంగా తీయాలనుకున్నారు. ‘గర్భిణులు.. పొట్ట చూపించడం, పసిపిల్లల ఫొటోలు తీయడం అనాచారమనేవారు. పైగా కొత్త కాన్సెప్టు. ఒప్పించడం చాలా కష్టమయ్యేది. ఎంతో ప్రయత్నించాక ‘పోనీలే ఎవరికీ చూపించకపోయినా దాచుకోవచ్చ’ని కొందరు ముందుకొచ్చారు. అలా కస్టమర్లు పెరిగారు. అసలే పురుషాధిక్య రంగం. నెగ్గుకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. డబ్బు, పేరు కాదు.. అందమైన జ్ఞాపకాలు ఇవ్వాలన్నది లక్ష్యం. గర్భం దాల్చడం, జన్మనివ్వడం ఒక మహిళ జీవితంలో అద్భుత క్షణాలు. ఎన్నో భావోద్వేగాల సమ్మిళితం. స్వచ్ఛమైన నవ్వులు పసివాళ్ల ముఖాల్లోనే కనిపిస్తాయి. వీటన్నింటినీ బంధించాలంటే ఓపిక కావాలి. అదీ కాక నాకు సైకాలజీపై పట్టు ఉంది. పిల్లల మనస్తత్వం, వాళ్ల సౌకర్యాన్ని బట్టి తీసినప్పుడే నిర్మలమైన నవ్వులు, ఆనందాన్ని బంధించగలమని నమ్ముతా. వాళ్ల కుటుంబ వాతావరణం, పెరిగే విధానాలపై హోంవర్క్‌ చేస్తా. ఆ తీరే సామాన్యుల నుంచి హీరోయిన్లు స్నేహ, కాజల్‌, శ్రీదేవి, ప్రణీత, సమీరారెడ్డి, క్రికెటర్లు అశ్విన్‌, రైనా.. ఇలా ఎంతోమందితో పనిచేసే అవకాశమిచ్చింది. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్యుమెంటరీలనూ తీస్తున్నా’నంటారు. సింగపూర్‌, చెన్నై, బెంగళూరుల్లో ‘మామీ షాట్స్‌ బై అమృత’ పేరుతో ఆవిడ స్టూడియోలున్నాయి.


మనసూ అందమైనదే!

సంపాదించడమే కాదు.. సమాజానికీ సాయపడాలంటారు 37 ఏళ్ల అమృత. తల్లిపాల ఆరోగ్యం, చనుబాలు దొరకని చిన్నారులకు పాలు దానం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు పోషకాహారం అందించే సంస్థలకు విరాళాలు సేకరిస్తున్నారు. పసిపిల్లల్లో గుండె జబ్బులపై అవగాహన కల్పించడమే కాదు.. ఉచితంగా సర్జరీలు చేసే ఎన్‌జీఓతో, మహిళా నెట్‌వర్క్‌ ‘లీప్‌ క్లబ్‌’తో కలిసి పనిచేస్తున్నారు. అమృతకు ప్రపంచాన్ని చుట్టడమంటే ఇష్టం. ‘ఒక్కటే జీవితం. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలను చుట్టాలి. ఆ జ్ఞాపకాలను నా కెమెరాలో బంధించాలని కోరిక’ అంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్