Aditi: నా కోసం వాళ్లు.. ఆ పని చేశారు

2021 టోక్యో ఒలింపిక్స్‌ క్రీడా ప్రాంగణం అది. అక్కడ జరగబోయే పోటీల్లో గోల్ఫ్‌ కూడా ఒకటి. అయితే, ఈ విభాగంలో పతకంపై మన దేశానికి పెద్దగా ఆశలేం లేవు. 

Published : 22 May 2023 00:14 IST

2021 టోక్యో ఒలింపిక్స్‌ క్రీడా ప్రాంగణం అది. అక్కడ జరగబోయే పోటీల్లో గోల్ఫ్‌ కూడా ఒకటి. అయితే, ఈ విభాగంలో పతకంపై మన దేశానికి పెద్దగా ఆశలేం లేవు.  అలాంటి చోట తన ఆటతో... అందరి అంచనాలనూ తలకిందులు చేసి.. దేశం చూపుని తన వైపునకు తిప్పుకొంది. ఆమే బెంగళూరుకి చెందిన గోల్ఫర్‌ అదితీ అశోక్‌. తాజాగా ఎల్‌పీజీఎ ఫౌండర్స్‌ కప్‌లో టీ5 స్థానంలో నిలిచి ప్రపంచ ర్యాంకింగ్‌ టాప్‌ 50లోకి ప్రవేశించింది. ఈ ఘనత అందుకున్న మొదటి భారతీయురాలు అదితి..

ఐదున్నరేళ్ల వయసులో క్రీడారంగంలోకి అడుగుపెట్టింది అదితి. తల్లి మహేశ్వరి. తండ్రి ఆశోక్‌ గోల్ఫ్‌ క్రీడాకారుడు. కూతురు గోల్ఫ్‌పై ఆసక్తి కనబరచడంతో అందులోనే శిక్షణ ఇప్పించాలనుకున్నారాయన. కర్ణాటక గోల్ఫ్‌ అసోసియేషన్‌ డ్రైవింగ్‌ రేంజ్‌కు రోజూ తీసుకెళ్లి సాధన చేయించేవారు. ఏ టెన్నిస్సో నేర్పించకుండా ఇదేంటని ఎందరడిగినా...ఆమె ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చారు. అదితి ఆటను ప్రేమించిం ది... గెలవాలంటే తనలోని లోపాలను అధిగ మించాలని చిన్నవయసులోనే అర్థం చేసుకుంది. అందుకోసం అవసరమైన శారీరక సామర్థ్యం కోసం పట్టు తెచ్చుకుంది. తన తోటిపిల్లలంతా ఆడుకుంటుంటే తాను మాత్రం తెల్లవారు జామునే లేచి ప్రాక్టీస్‌ చేసేది. ‘గెలుపోటములతో సంబంధం లేకుండా  ఆటని ఆస్వాదించి ఆటపై పట్టు సాధించానని’ చెబుతోంది అదితి. ఇక్కడే ‘ది ఫ్రాంక్‌ ఆంథోనీ పబ్లిక్‌ స్కూల్‌’లో ప్రాథమికోన్నత విద్యను పూర్తిచేసిన ఆమె, 2016లో గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంది.

తొలి అడుగు ఆమెదే...!

గోల్ఫ్‌ ఆటను ఎంచుకున్న కొన్నాళ్లకే.... బెంగళూరు గోల్ఫ్‌ క్లబ్‌, కర్ణాటక గోల్ఫ్‌ అసోసియేషన్‌ తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొంది అదితి.2015 డిసెంబర్‌ వరకు అదితి అమెచ్యూర్‌ గోల్ఫర్‌గా రాణించింది. ఆ సమయంలోనే ఆమె ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఏషియన్‌ యూత్‌ గేమ్స్‌ (2013), యూత్‌ ఒలింపిక్స్‌ (2014), ఆసియా క్రీడలు.. ఈ మూడింట్లో పాల్గొన్న తొలి, ఏకైక భారత గోల్ఫ్‌ క్రీడాకారిణిగా నిలిచింది. 2016లో జరిగిన సమ్మర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమె...అదే ఏడాది జరిగిన లేడీస్‌ యూరోపియన్‌ టూర్‌లో విజయం సాధించింది. ఈ ఘనత అందుకున్న తొలి గోల్ఫ్‌ క్రీడాకారిణి. ప్రొఫెషనల్‌ గోల్ఫర్‌గా కెరియర్‌ ప్రారంభించిన తొలిఏడాదే రియో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పోటీ పడింది. ప్రపంచ క్రీడల్లో గోల్ఫ్‌ ప్రవేశమూ అదే తొలిసారి. అక్కడ తనదైన ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. లేడీస్‌ యూరోపియన్‌ టూర్‌-2016 పాల్గొనే అవకాశంతో పాటు 2017లో మహిళల ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌(ఎల్‌పీజీఎ) ప్లేయర్‌గా అర్హత పొందిన మొదటి ఇండియన్‌గానూ రికార్డులకెక్కింది అదితి. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్‌ మరో మైలురాయి. భారతీయులకు ఏ మాత్రం అంచనాల్లేని గోల్ఫ్‌ విభాగంలో అడుగుపెట్టి ప్రపంచస్థాయిలో టాప్‌టెన్‌ క్రీడాకారిణులకు ముచ్చెమటలు పట్టించింది. పతకం దక్కించుకోలేకపోయినా ప్రపంచ క్రీడల్లో ఆమె పోరాట పటిమను చూసి యావత్‌ భారతదేశం మురిసిపోయింది.

ఇబ్బందులెదురైనా...

ఆటైనా, జీవితమైనా ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటాయి. వాటిని ఓర్పుగా, నేర్పుగా అధిగమించాలి. అలాంటి ఇబ్బందులెన్నో తన జీవితంలో చూశా అంటోంది అదితి. ‘కొవిడ్‌ కొన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాల్ని దూరం చేసింది. ముఖ్యంగా డబుల్‌ వీసా కోసం ప్రయత్నించినప్పుడు పాస్‌పోర్ట్‌ కాన్సులేట్‌లో ఉండిపోవడంతో చాలా టోర్నీలను వదులుకోవాల్సి వచ్చింది. దాంతో రెండు నెలల పాటు గోల్ఫ్‌ స్టిక్‌ పట్టుకునే అవకాశమే రాలేదు. ఈ పరిస్థితి నన్ను మానసికంగా దెబ్బతీసింది. ఈలోగా కరోనా బారిన పడ్డా. ఆ సమయంలో అమ్మానాన్నలు ఇచ్చిన మద్దతు ఎప్పటికీ మరిచిపోలేను. తిరిగి సాధన ప్రారంభించా. ఒలింపిక్స్‌కి సన్నద్ధమయ్యా. రియో ఒలింపిక్స్‌లో నాన్న క్యాడీ (ప్లేయర్‌ వెంటే ఉండి, గోల్ఫ్‌ కిట్స్‌ను చూసుకునే వ్యక్తి)గా ఉన్నారు. ఈసారి అమ్మ ఆ బాధ్యత తీసుకుంది. పతకం చేజార్చుకోవడం బాధగా ఉన్నా...నా ఆటతీరుతో సంతృప్తిగా బయటకు వచ్చా’ అని చెబుతోన్న అదితి...తాజాగా ఎల్‌పీజీఎ ఫౌండర్స్‌ కప్‌లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. ఫలితంగానే మహిళల గోల్ఫ్‌ క్రీడలో...ప్రపంచ ర్యాంకింగ్‌లో 49వ స్థానానికి చేరుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయురాలిగా మరోసారి రికార్డు అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్