Updated : 09/02/2023 00:45 IST

136 ఏళ్ల చరిత్రలో మన అమ్మాయి!

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మూలాలున్న అప్సరా అయ్యర్‌ చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ‘హార్వర్డ్‌ లా రివ్యూ (హెచ్‌ఎల్‌ఆర్‌)కి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి ఇండియన్‌ అమెరికన్‌గా నిలిచింది. యేల్‌ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌, మేథ్స్‌, స్పానిష్‌ల్లో బ్యాచిలర్స్‌, ఆక్స్‌ఫర్డ్‌ నుంచి ఎంఫిల్‌ పూర్తిచేసిన అప్సర ప్రస్తుతం హార్వర్డ్‌ లా స్కూల్‌లో ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హార్వర్డ్‌ లా రివ్యూ.. పూర్తిగా విద్యార్థులు నిర్వహించే లీగల్‌ స్కాలర్‌షిప్‌ జర్నల్‌. నవంబరు నుంచి జూన్‌ వరకు నెలవారీ 2500 పేజీలతో ఈ సంచిక ప్రచురితమవుతుంది. సంపాదకీయం సహా సంస్థకు సంబంధించిన నిర్ణయాలన్నీ విద్యార్థులవే. లాయర్లుగా ప్రాక్టీసు చేస్తున్న వారికి, విద్యార్థులకు సహకరించే పరిశోధనా వస్తువుగా ఈ జర్నల్‌ ఉండాలన్నది లక్ష్యంతో 1887లో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దానికి 29 ఏళ్ల అప్సర 137వ ప్రెసిడెంట్‌. గతంలో బరాక్‌ ఒబామా వంటి ఎందరో ప్రముఖులు దీనికి ప్రెసిడెంట్‌గా చేశారు. ‘రైట్‌ ఆన్‌’ పేరుతో జరిగే ఎంపిక ప్రక్రియ కూడా కష్టంతో కూడుకున్నదే. తన తెలివితేటలు, పరిజ్ఞానం, విశ్లేషణ నైపుణ్యాలు, వాదనా పటిమతో అందరి మనసూ గెలుచుకుంది మన అప్సర. తనకి పురాతన వస్తువులపై అభిమానం. హార్వర్డ్‌లో చేరడానికి ముందు మన్‌హాటన్‌ డిస్ట్రిక్ట్‌ అటార్నీలో యాంటిక్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌లో పనిచేసింది. 15 దేశాలకు చెందిన దొంగతనానికి గురైన 1100 ఆర్ట్‌ వర్క్‌ను తిరిగి పొందేలా అధికారులకు సాయపడింది. అక్కడా పేరు ప్రఖ్యాతులను సంపాదించాక ఆమె మనసు మానవ హక్కులవైపు మళ్లింది. అప్సర గతంలో నేషనల్‌ సెక్యూరిటీ, హ్యూమన్‌ రైట్స్‌ జర్నల్స్‌లో పనిచేసింది. సౌత్‌ ఏషియన్‌ లా స్టూడెంట్‌ అసోసియేషన్‌ సభ్యురాలు కూడా. ‘కేసుల రివ్యూలు, వ్యాసాల ఎంపికలో మరింత మందిని భాగస్వాములను చేయడంతోపాటు నాణ్యమైన సమాచారాన్ని అందించడమే తన ధ్యేయ’మనే అప్సర భవిష్యత్తులో మానవ హక్కుల రక్షణలో తన గళాన్ని వినిపించాలనుకుంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి