Mehrunissa Shaukat Ali: ప్రోత్సహించలేదా.. పోరాడండి!

బురఖా లేనిదే అడుగు బయట పెట్టకూడదు. మగవాళ్లను కన్నెత్తి చూడ్డానికీ వీల్లేదు. చదువైనా కాస్త మంచి సంబంధం వస్తుందనే! ఇలాంటి సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది మెహరున్నీసా.

Updated : 24 Feb 2023 09:00 IST

బురఖా లేనిదే అడుగు బయట పెట్టకూడదు. మగవాళ్లను కన్నెత్తి చూడ్డానికీ వీల్లేదు. చదువైనా కాస్త మంచి సంబంధం వస్తుందనే! ఇలాంటి సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చింది మెహరున్నీసా. వీటన్నింటినీ దాటి దేశంలోనే మొదటి మహిళా బౌన్సర్‌గా ఎదగడమే కాదు.. తన బాటలోనే మరికొందరు అమ్మాయిలను నడిపిస్తోంది. ఇందుకు తను చేసిన పోరాటాలెన్నో!

‘అమ్మాయి బాగా చదువుకొని మాట వినకపోతే? తనకు నచ్చినవాడినే చేసుకుంటానని ఇంట్లోంచి వెళ్లిపోతే.. పరువు పోదూ!’ ఇలాగే ఉండేవి మెహరున్నీసా షౌకత్‌ అలీ నాన్న ఆలోచనలు. అందుకే సాయంత్రం కాగానే ఇంట్లో కరెంట్‌ తీసేసేవాడు. నలుగురు అమ్మాయిల్లో మూడోది తను. అక్కలిద్దరికీ 12 ఏళ్లకే పెళ్లిళ్లు చేశారు. చదువుకోవాలనుందని ఎంత బతిమాలినా వాళ్ల నాన్న వినలేదు. పెళ్లయ్యాక వాళ్లెంత చిత్రహింసలు అనుభవిస్తున్నారో చూసీ నోరు మెదపలేని స్థితి వాళ్లమ్మది. కనీస అక్షరజ్ఞానం ఉంటే భవిష్యత్తులో అక్కరకొస్తుందని ఆరో తరగతి వరకూ చదివించేలా ఇంట్లో ఒప్పించడం వరకూ చేయగలిగింది. మెహరున్నీసాకేమో చిన్నతనం నుంచీ ఆర్మీ లేదా పోలీసు శాఖలో చేరాలనే కోరిక. తన ఈడు అమ్మాయిలందరూ ఎండ కన్నెరగకుండా పెరుగుతోంటే తను మాత్రం ఆ ఎండలో నిలబడి ఆర్మీ వాహనాలను చూస్తూ ఉండేది. ఇంట్లో చెప్పకుండానే ఎన్‌సీసీలో చేరింది. కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌నీ నేర్చుకొంది. వీళ్లది ఉత్తరాఖండ్‌ సరిహద్దులోని సహరాన్‌పుర్‌.

మెహరున్నీసా ఆరోతరగతిలోకి వచ్చింది. తనకీ పెళ్లి చేద్దామనుకుంటున్నప్పుడు వాళ్ల నాన్న వ్యాపారం దెబ్బతింది. అప్పులు తీర్చడానికి ఉన్న ఇంటినీ అమ్మేయాల్సి వచ్చింది. ఇక అక్కడ ఉండలేక వీళ్ల కుటుంబం పొట్ట చేతపట్టుకొని దిల్లీ చేరుకుంది. చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మానాన్నకి సాయంగా ఉంటూనే పది వరకూ చదివింది మెహరున్నీసా. 2004లో ఒక కేఫ్‌లో బౌన్సర్‌ అవసరముందంటే వెళ్లింది. ఎన్‌సీసీ అనుభవం, మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉండటంతో చేర్చుకున్నారు. ‘పనంతా ఒకటే! కానీ పిలవడానికొచ్చేసరికి గార్డ్‌ అనేవారు. నాకు కోపమొచ్చేది. బౌన్సర్‌ హోదా దక్కించుకోవడానికి చాలా పోరాడా. వాదించో, అరిచో లాభం లేదని చేతల్లో చూపించా. ఓసారి ఓ సినిమా స్టార్‌ ప్రోగ్రామ్‌ జరుగుతోంది. ఇలాంటి చోట్ల గొడవలు, మగ బౌన్సర్లతో అమ్మాయిలు ఇబ్బంది పడటం సాధారణమే. నేను గొడవలు జరగకుండా చూడటమే కాదు. అమ్మాయిలకూ ఇబ్బంది కలగకుండా చూసుకున్నా. అలా క్రమంగా నాపై నమ్మకం వచ్చి బౌన్సర్‌గా మార్చారు. అలా 2014లో దేశంలోనే మొదటి బౌన్సర్‌నయ్యా’నంటోంది. ఇన్నేళ్లలో స్టార్ల కాన్సర్ట్‌లంటే మెహరున్నీసా ఉండాల్సిందే అన్నంతగా పేరు తెచ్చుకుంది. వేళకాని వేళల్లో తను చేసే పని, బురఖా లేకుండా బయటకు వెళ్లడం చూసి చుట్టుపక్కల వాళ్లు మానేయమనేవాళ్లు. అవమానించేవారు కూడా. వాళ్ల నాన్నా వేరే పని చూసుకోమన్నా అవేమీ తను పట్టించుకోలేదు. గత ఏడాది నవంబరులో ‘మర్దానీ బౌన్సర్‌ అండ్‌ డాల్ఫిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌’ ప్రారంభించి 2500 మందికి ఉపాధిని కల్పిస్తోంది. అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణిస్తున్న తను భర్త వదిలేసిన తన చెల్లెల్ని ఆదరించింది. ఆమె ముగ్గురు పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తోంది. అమ్మాయిలు ఏదైనా చేయగలరు. ప్రోత్సాహమిచ్చారా.. సరే! లేదంటే పోరాడైనా సాధించాలంటోంది 35 ఏళ్ల మెహరున్నీసా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్