జొన్న పిండితో... సంచులు చేస్తాం!

ప్లాస్టిక్‌ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమే. అయితే, అది మానవాళి మనుగడకే ముప్పు తెచ్చిపెడుతోందన్న విషయం ఆమెను ఆలోచింపజేసింది.

Updated : 03 Feb 2023 13:00 IST

ప్లాస్టిక్‌ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమే. అయితే, అది మానవాళి మనుగడకే ముప్పు తెచ్చిపెడుతోందన్న విషయం ఆమెను ఆలోచింపజేసింది. ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలనుకున్న తపన... తనని ప్రత్యామ్నాయ ఉత్పత్తుల తయారీలోకి అడుగుపెట్టేలా చేసింది. హైదరాబాద్‌కి చెందిన ప్రతిభా భారతి తన ‘నేచర్స్‌ బయోప్లాస్టిక్‌’ వ్యాపార ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

టా 300 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయని నివేదికలెన్నో స్పష్టం చేస్తున్నాయి. ఈ కాలుష్యం వల్ల వాతావరణమే కాదు.. మనతో పాటు చుట్టూ ఉండే ఇతర జీవుల మనుగడ కూడా ప్రశ్నార్థకమే. అందుకే ఈ ప్లాస్టిక్‌ భూతం నిర్మూలనకు నా వంతు ఏం చేయగలననే ఆలోచన ప్రత్యామ్నాయ ఉత్పత్తుల తయారీపై దృష్టిపెట్టేలా చేసింది. నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్‌ జిల్లా రామగుండంలో. ఎంబీఏ హైదరాబాద్‌లో పూర్తిచేశా. తర్వాత పద్నాలుగేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేశా. ఉద్యోగంలో ఉన్నానన్న మాటే కానీ.. మనసంతా వ్యాపారం పైనే ఉండేది. ఎందుకంటే, ఊహ తెలిసినప్పటి నుంచీ వ్యాపార రంగంలో రాణించాలనేది నా కల. దీనికి నాన్న ప్రోత్సాహం కూడా తోడవడంతో ఉద్యోగం వదులుకొని వ్యాపారంలోకి వచ్చేశా.


పరిశోధనలు చేశా..

వ్యాపారం చేసినా అది పర్యావరణహితంగా ఉండాలన్న ఒక స్పష్టమైన అవగాహనైతే నాకు ముందు నుంచే ఉంది.  ప్రత్యామ్నాయ ఉత్పత్తుల తయారీ గురించి ఆలోచిస్తుంటే మొదట జనపనారే మెదడుకి తట్టింది. కానీ అది చాలా ఖరీదైంది కావడంతో వద్దనుకున్నా. అప్పుడే అందరికీ అందుబాటు ధరల్లో ఉండే బయోప్లాస్టిక్స్‌ గురించి తెలిసి ఆ దిశగా పరిశోధనలు మొదలుపెట్టా. స్పెయిన్‌, పోర్చుగల్‌ వంటి దేశాల్లో అనుసరిస్తోన్న ఈ పద్ధతుల గురించి అధ్యయనం చేశా. మరెంతో పరిశోధన చేశా. అవగాహన వచ్చాక రూ. యాభై లక్షల పెట్టుబడి సేకరించుకుని ‘నేచర్స్‌ బయోప్లాస్టిక్స్‌’ పేరుతో సంస్థను నెలకొల్పాను.


దేశ విదేశాల నుంచి....

మొక్కజొన్న, బంగాళాదుంప స్టార్చ్‌లే ప్రధాన ముడి సరకులుగా, ఎక్స్‌ట్రూడర్‌ మెషీన్‌ సహాయంతో క్యారీబ్యాగులూ, పౌచ్‌లూ, చెత్త సేకరించే బ్యాగులూ, టెక్స్‌టైల్‌ ప్యాకింగ్‌, షాపింగ్‌ బ్యాగులూ, పంట పొలాల్లో ఉపయోగించే షీట్లూ, వంట పాత్రలు.. వంటి విభిన్న రకాల ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చాం. ప్లాస్టిక్‌ వినియోగం హానికరమని తెలిసినా...అలవాటు పడ్డ వారు అంత తొందరగా వాటిని వాడటం మానేయలేరు. అందుకే ముందు వివిధ వర్గాల వారికి అవగాహన కల్పించడం మొదలుపెట్టాం. మొదట్లో ఒక్క ఆర్డరు కోసం చాలా కష్టపడ్డాం. అయితే, కాస్త ఆదరణ లభిస్తోందనుకున్న సమయంలో కొవిడ్‌ మా సంస్థ కార్యకలాపాలకు అడ్డుపడింది. అప్పటికే సిద్ధంగా ఉన్న సరకుని ఫుడ్‌, కొరియర్‌ ప్యాకింగ్‌ మెటీరియళ్లూ కొన్ని సంస్థలకు ఉచితంగా అందించాం. దీనివల్ల మాకు మంచే జరిగిందని చెప్పాలి. తర్వాతే మా ఉత్పతులకు గిరాకీ మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్డర్లొస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు, నాబార్డ్‌, స్థానిక హోటళ్లు, ఎంఎన్‌సీలకూ ఎక్కువ మొత్తంలో చెత్త కవర్లను సరఫరా చేస్తున్నాం. ఆ మధ్య నైజీరియాకూ ప్లాంట్‌ బ్యాగులు ఎగుమతి చేశాం. తాజాగా యూఎస్‌ నుంచీ పెద్ద మొత్తంలో క్యారీబ్యాగుల ఆర్డర్‌ అందుకున్నాం. మా ఉత్పత్తులను ఆరు నెలల పాటు వాడుకోవచ్చు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ), జాతీయ స్థాయిలో అటల్‌ ఇన్నొవేషన్‌ అవార్డులనూ అందుకున్నాం. 


నాణ్యతే మా బలం..

మా సంస్థ ప్రయాణంలో వీ-హబ్‌ ఎంతో సాయం అందించింది. మా ఉత్పత్తుల్ని బయో ఏషియా సదస్సుతో పాటు వివిధ రకాల ఎగ్జిబిషన్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కమ్యూనిటీల్లో ప్రదర్శించాం. ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించాక  సవాళ్లెన్నో ఎదురయ్యాయి. అలాగని భయపడి అక్కడే ఆగిపోతే మనల్ని మనం నిరూపించుకోలేం. అందుకే మనపై మనకు నమ్మకంతో ముందుకు సాగాలి. మొదలుపెట్టిన ఏ పనైనా దశల వారీగా విభజించుకొని.. ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోగలిగితే ఒత్తిడీ ఉండదు.. అనుకున్న సమయానికి లక్ష్యాన్నీ చేరుకోగలుగుతాం..!

 కొండ గౌతమి, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్