అర్ధరాత్రి ఒంటరిగా సాధన చేసేదాన్ని...

అన్ని ఆటల్లో ప్రావీణ్యం ఉండి, ఒక్కదానిలో రాణించిన వారు మనకు తెలుసు. అదితి మాత్రం అందుకు భిన్నం. అడుగుపెట్టిన ప్రతిదానిలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది తను. తాజాగా వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టిన అదితి కక్కర్‌ ప్రయాణమేంటో.. చదివేయండి.

Published : 04 Feb 2023 00:25 IST

అన్ని ఆటల్లో ప్రావీణ్యం ఉండి, ఒక్కదానిలో రాణించిన వారు మనకు తెలుసు. అదితి మాత్రం అందుకు భిన్నం. అడుగుపెట్టిన ప్రతిదానిలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది తను. తాజాగా వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టిన అదితి కక్కర్‌ ప్రయాణమేంటో.. చదివేయండి.

మూడేళ్ల వయసులో కరాటే, స్విమ్మింగ్‌ నేర్చుకోవడం ప్రారంభించింది అదితి. జిమ్నాస్టిక్స్‌, రన్నింగ్‌లోనూ పాల్గొంది. 12 ఏళ్ల వయసులో కామన్‌వెల్త్‌ పోటీల్లో భాగంగా ‘ఖేలో ఇండియా’లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. కరాటేలో అంతర్జాతీయ మెడల్‌ సాధించిన తను ఆపై ఈతపైనే దృష్టిపెట్టింది. ఒలింపిక్స్‌లో దీనికి అవకాశం లేకపోవడమే అందుకు కారణం. దిల్లీ తరఫున పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు కొల్లగొట్టింది. 2017లో కాలేజ్‌ తరఫున వెయిట్‌ లిఫ్టింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. కాలేజీ వాళ్ల ప్రోత్సాహంతో వారం రోజులు సాధన చేసి, పాల్గొనడమే కాదు బంగారు పతకాన్నీ గెలుచుకుంది. అప్పుడే అన్ని ఆటల్లో పరిచయం కాదు.. ప్రతిదానిలోనూ రాణించాలి, గుర్తింపు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. శిక్షణ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.

‘అక్కడ క్రాస్‌ఫిట్‌ జిమ్‌.. వెయిట్‌లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, ఇతర ఆటలన్నింటిలో శిక్షణ ఉంటుంది. క్రాస్‌ఫిట్‌ పోటీలూ నిర్వహిస్తారు. దానిలో 2019, 20ల్లో దేశంలోనే రెండు, మూడు ర్యాంకులు సాధించా. అయితే 2020లో దేశానికి తిరిగొచ్చాక శిక్షణ కష్టమైంది. లాక్‌డౌన్‌లో బయటికి వెళ్లడమూ ఇబ్బందైంది. స్నేహితుల వద్ద వ్యాయామ పరికరాలను అరువుగా తెచ్చుకున్నా. 2021లో సాధన చేస్తోంటే ఓ కోచ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రయత్నించమన్నారు. ఒకసారి పతకం వచ్చింది కాబట్టి, ప్రయత్నిస్తే పోయేదేముందనుకున్నా. కొద్దిరోజుల్లోనే ఏళ్లుగా శిక్షణ తీసుకుంటున్న వాళ్లతో సమాన ప్రతిభ చూపా’ననే అదితి సాధన కోసం ఎన్నో ఇబ్బందులు పడింది. తను చదివిన కాలేజ్‌ నుంచి తిరస్కరణ, దిల్లీ స్టేడియంలో వేళలతో ఇబ్బంది లాంటివెన్నో ఎదుర్కొంది. దీంతో పార్క్‌లో సాధన మొదలుపెట్టింది. అక్కడా చేయొద్దన్న నిబంధన విధించడంతో ఇంట్లోనే పాత డంబెల్స్‌, ఇనుప ప్లేట్లతో సొంతంగా సాధన చేసింది. వాటిని వీడియోలు తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేది. యూనివర్సిటీ నేషనల్స్‌లో పాల్గొనడానికి పాండిచ్చేరి యూనివర్సిటీలో చేరిన తనిప్పుడు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో శిక్షణ అవకాశం దక్కించుకుంది.

వ్యాపారవేత్తగా..

అదితిది వ్యాపారస్థుల కుటుంబం. ఇండస్ట్రియల్‌ డిజైన్‌లో డిగ్రీ చేసిన తను ఫిట్‌నెస్‌ రంగంలో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. క్రీడాకారిణులకు అనుకూలంగా ఉండే ‘యాక్టివ్‌ వేర్‌’ను రూపొందించే సంస్థ ‘ఓక్రె’ను 2021లో స్నేహితురాలితో కలిసి ప్రారంభించింది. ‘క్రీడాకారిణులను ఇబ్బంది పెట్టే అంశాల్లో దుస్తులు కూడా ఒకటి. ఆ ఇబ్బంది నాకు తెలుసు. అందుకే వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా వీటిని రూపొందించాం. అలాగని ఆటని పక్కన పెట్టలేదు. నా లక్ష్యం మాత్రం ఒలింపిక్స్‌’ అనే అదితి.. ధైర్యంగా ప్రయత్నిస్తే చాలు.. అమ్మాయిలు కోరుకున్న రంగంలో రాణించొచ్చు అని సలహానీ ఇస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్