Published : 22/12/2022 00:31 IST

పేదరికం.. పెళ్లీ... తనకడ్డుకాలేదు

‘అమ్మాయికి కాస్త చేయూతనివ్వండి.. ఆకాశమే హద్దుగా ఎదుగుతుందంటుంది రూపా యాదవ్‌. అందుకు తన జీవితాన్నే ఉదాహరణగా చెబుతోంది. పేద కుటుంబం, దానికి తోడు ఎనిమిదేళ్లకే బాల్యవివాహం... వాటన్నింటినీ అధిగమించి.. డాక్టర్‌ అయ్యింది అలాగే మరి!

ఊహ తెలియని వయసులోనే పెళ్లి.. యవ్వనంలోకి అడుగుపెట్టగానే అత్తారింటికి వెళ్లిపోవడం రూప వాళ్ల ఊళ్లో  సహజం. రూప చదువులో చురుకు! తనను బాగా చదివించాలనుకున్నాడు ఆమె నాన్న. ఆయన ఉమ్మడి కుటుంబంలో చిన్నవాడు. పెదనాన్న మాటే వేదం. ఆయనకీ ఓ కూతురుంది. తనకు ఎనిమిదేళ్ల వయసులో... పెద్దనాన్న కూతురికి సంబంధం వచ్చింది. వాళ్లు దూరపుబంధువులు కూడా. వాళ్లిద్దరి అబ్బాయిలకు పెదనాన్న కూతురు, రూపను ఇచ్చేలా మాట్లాడేశారు. తన అన్న మాటిచ్చాడని రూప వాళ్ల నాన్న ఏమీ అనలేక పోయాడు. కాస్త ఊరట ఏంటంటే... కూతురి చదువు సాగనివ్వాలన్న నిబంధన పెట్టాడు. వాళ్లూ అంగీకరించడంతో పెళ్లయినా రూప చదువుకు ఆగలేదు. పదోతరగతి ఫలితాలు, రూప అత్తారింటికి వెళ్లాల్సిన సమయం ఒకేసారి వచ్చాయి. 86% మార్కులు సాధించిన ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీళ్లది రాజస్థాన్‌లోని కరిరి. అక్కడ అమ్మాయిలు చదవడమే గొప్ప. అబ్బాయిలు పదో తరగతి పాసైతేనే చాలనుకునేవారు. అలాంటిది రూప అన్ని మార్కులు సాధించింది.

కూతురి భవిష్యత్తు పాడు చేస్తున్నానేమోనని రూప తండ్రి కంగారుపడ్డాడు. ఈసారి ఆమె బావగారు కూడా తనను చదివిస్తామని మాటిచ్చాడు. ‘అత్తగారిదీ పేద కుటుంబమే. కానీ ఇచ్చిన మాట కోసం నన్ను చదివించారు. ఊళ్లో వాళ్లతో ఎన్నో మాటలు పడ్డారు. నా ఫీజుకోసం కుటుంబమంతా రేయింబవళ్లూ కష్టపడ్డారు. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించినప్పుడు నాకన్నా ఎక్కువగా వాళ్లు పొంగిపోయారు. నీట్‌ శిక్షణకు అప్పులు చేసి మరీ హాస్టల్‌లో చేర్చారు. మూడేళ్ల తర్వాత కోరుకున్నట్లుగా రాజస్థాన్‌లోనే వైద్యవిద్య చదివే అవకాశమొచ్చింది. నా అదృష్టమనుకుంటా.. ఎన్ని అవాంతరాలెదురైనా ప్రతి దశలో నాకు సాయపడే వాళ్లే ఎదురయ్యారు. కుటుంబానికితోడు నా స్నేహితులూ ఆర్థికంగా ఆదుకున్నారు. కాలేజీలో కొందరు ‘చిన్నారి పెళ్లికూతుర’ంటూ ఏడిపిస్తోంటే వాళ్లే అండగా నిలిచారు. అనుకోకుండా మెడిసిన్‌ మూడో ఏడాదిలో గర్భవతినయ్యా. అబార్షన్‌ చేసుకోమని కొందరు.. చదువు మానేయమని ఊళ్లోవాళ్లు సలహాలిచ్చారు. కానీ నాకు బిడ్డ, కెరియర్‌ రెండూ ముఖ్యమే. ఎప్పట్లానే ఇంట్లో వాళ్లూ నాకు మద్దతిచ్చారు. ప్రసవమైన నెలలోపే పరీక్షలు. పాపని అక్క, అత్తగారు చూసుకున్నారు. పాప పుట్టినరోజునే నాకు పరీక్ష. మూడు గంటల పరీక్షను సగం సమయంలో పూర్తి చేసొచ్చి జరిపా. ఈ ఏడాది విజయవంతంగా ఎంబీబీఎస్‌ పూర్తైంది’ అని ఆనందంగా చెప్పే రూపకి తన గ్రామంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడం కల. పీజీ కూడా చేయాలనుందట. కలలు కని, వాటిని నిజం చేసుకోవడానికి పోరాడేవారికి సాయం తప్పక అందుతుంది. కాబట్టి, పోరాడమని సలహానీ ఇస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి