Ravuri Poojitha: యూట్యూబ్‌లో చూసి...రూ.60లక్షల ప్యాకేజీ!

గూగుల్‌లో ఉద్యోగం! ఏడాదికి 60 లక్షల రూపాయల భారీ ప్యాకేజీతో.. యువత కలలుకనే కొలువుని సాధించింది గుంటూరు అమ్మాయి రావూరి పూజిత.

Updated : 09 Jan 2023 07:48 IST

గూగుల్‌లో ఉద్యోగం! ఏడాదికి 60 లక్షల రూపాయల భారీ ప్యాకేజీతో.. యువత కలలుకనే కొలువుని సాధించింది గుంటూరు అమ్మాయి రావూరి పూజిత. మీ విజయ రహస్యం ఏంటో  చెబుతారా అంటే ‘ఇదంతా లాక్‌డౌన్‌ మహాత్మ్యమే’ అంటోంది. లాక్‌డౌన్‌కీ... ఆమె విజయానికీ సంబంధం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అదేదో ఆమె నోటి నుంచే విందాం...

బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఉండగా కొవిడ్‌-19 మొదలైంది. అప్పుడే లాక్‌డౌన్‌ కూడా పెట్టారు. దాంతో చాలామందిలానే నాకూ కళాశాలకు వెళ్లి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగని నేనేమీ బాధపడలేదు. కాలేజీ వాళ్లు ఆన్‌లైన్లో చెప్పే పాఠాలని శ్రద్ధగా వినేదాన్ని. నా సందేహాలు, సమస్యలను వీలున్నంత వరకూ అధ్యాపకులనో, సీనియర్లనో అడిగేదాన్ని. వీలుకానప్పుడు ఆన్‌లైన్‌లో వెతికేదాన్ని. నాన్న ప్రైవేటు బ్యాంకులో అధికారి. ఇద్దరం అమ్మాయిలమే. చెల్లి ఏడో తరగతి. ఏం చదవాలి... ఎలా చదవాలి అని సరైన మార్గనిర్దేశం చేసేవాళ్లు లేరు. దాంతో నేనే సొంతంగా ఆ ప్రయత్నం చేసేదాన్ని. జేఈఈలో ఝార్ఖండ్‌ బిట్స్‌లో సీటు వస్తే అమ్మానాన్నలు అంత దూరం ఎందుకన్నారు. దాంతో గుంటూరులోని కేఎల్‌ వర్సిటీలో బీటెక్‌లో చేరా. ఫస్టియర్‌ మొదటి సెమ్‌లో ఉండగా కేఎల్‌ వర్సిటీ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ కోర్సు ప్రవేశపెట్టింది. అలా నా కోడింగ్‌ ప్రయాణం ప్రారంభమైంది. రెండో సెమిస్టర్‌ ముగిసే సమయానికి లాక్‌డౌన్‌. ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాకపోతే యూట్యూబ్‌ వీడియోలను చూసి కోడింగ్‌పై పట్టు సాధించా. ఏ సాప్ట్‌వేర్‌ కంపెనీ అయినా కోడింగ్‌ నుంచే ఎక్కువ ప్రశ్నలు సంధిస్తుంది కాబట్టి దానిపై పట్టుకోసం చాలా వెబ్‌సైట్లు చూసేదాన్ని. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కోడింగ్‌, ఇతర ప్రాబ్లమ్స్‌తో పాటు ఉద్యోగం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నా. రోజులో సగం సమయం ఆన్‌లైన్‌ క్లాసులు వింటే తక్కిన సమయంలో ఆన్‌లైన్‌లో సొంతంగా నేర్చుకొనేదాన్ని. నాకు నేనే పరీక్ష పెట్టుకునేదాన్ని. ఎక్కడ తప్పులు చేస్తున్నానో తెలుసుకునే దాన్ని. లీట్‌కోడ్‌, కోడ్‌ షెఫ్‌, ప్రెప్‌బైట్స్‌, బైనరీ సెర్చ్‌డాట్‌కాం వంటి సైట్లలో కోడింగ్‌, ఇతర అంశాలు బాగా ఉండేవి. టైం మేనేజ్‌మెంట్‌ నేర్చుకొని.. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్లు, ఇంటర్వ్యూలు సాధన చేశా. తరచూ మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యేదాన్ని. ఆన్‌లైన్‌లో సీనియర్లతో పరిచయాలు పెంచుకుని వాళ్ల అనుభవాలు తెలుసుకునేదాన్ని. ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఇవన్నీ నాకు బాగా ఉపకరించాయి. అలా గూగుల్‌, అడోబ్‌, అమెజాన్‌ సంస్థల్లో కొలువులు సాధించాను. చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే అమెజాన్‌, అడోబ్‌ కంపెనీల్లో వార్షిక ప్యాకేజీ రూ.45 లక్షలు ఉండటంతో రూ.60 లక్షల ప్యాకేజీతో గూగుల్‌ అవకాశాన్ని ఎంచుకున్నా. మరో వారంలో ఇంటర్న్‌షిప్‌కు వెళ్తున్నా. ఉద్యోగంలో బాగా గుర్తింపు, పట్టు తెచ్చుకున్నాక ప్రజలకు ఉపయోగపడే ప్రొడక్ట్స్‌కు రూపకల్పన చేయాలనేది నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్