Riti Kumari: ఐఐటీ కల విఫలమైనా.. కలల కొలువు సాధించింది!

ఐఐటీలో చేరాలనేది చాలామంది విద్యార్థుల కల. అయితే ఆ కల నిజమవుతుందో, లేదోనన్న ఆందోళన.. టాప్‌ ర్యాంక్స్‌ సాధించాలన్న మానసిక ఒత్తిడి భరించలేక ఈ మధ్య కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఐఐటీలో చదివితేనే మంచి సంస్థల్లో ఉద్యోగావకాశాలొస్తాయా? లేకపోతే.. మనసు చంపుకొని ఏదో ఒక ఉద్యోగంలో సెటిలవ్వాల్సిందేనా? అంటే.. కానే కాదని నిరూపిస్తోంది బెంగళూరుకు చెందిన రితీ కుమారి....

Updated : 18 Aug 2023 20:47 IST

(Photos : Instagram)

ఐఐటీలో చేరాలనేది చాలామంది విద్యార్థుల కల. అయితే ఆ కల నిజమవుతుందో, లేదోనన్న ఆందోళన.. టాప్‌ ర్యాంక్స్‌ సాధించాలన్న మానసిక ఒత్తిడి భరించలేక ఈ మధ్య కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఐఐటీలో చదివితేనే మంచి సంస్థల్లో ఉద్యోగావకాశాలొస్తాయా? లేకపోతే.. మనసు చంపుకొని ఏదో ఒక ఉద్యోగంలో సెటిలవ్వాల్సిందేనా? అంటే.. కానే కాదని నిరూపిస్తోంది బెంగళూరుకు చెందిన రితీ కుమారి. ఎక్కడ చదివామన్నది కాదు.. సంస్థలకు కావాల్సిన సాంకేతిక నైపుణ్యాలన్నీ మనలో ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యమంటోందామె. ఐఐటీలో చేరాలన్న తన కల విఫలమైనా.. తనదైన నైపుణ్యాలతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించి.. ప్రస్తుతం లక్షల ప్యాకేజీని అందుకుంటోన్న రితి కథ.. ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం!

రితీ కుమారిది బెంగళూరు. ఆమె తండ్రి అక్కడి ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌. అదే స్కూల్లో చదువుకున్న రితి.. ఎప్పటికైనా తన తండ్రి గర్వపడేలా కెరీర్‌లో ఉన్నత స్థితికి ఎదగాలనుకుంది. ఈ ఆలోచనతోనే చిన్న వయసు నుంచే చదువులో మేటిగా రాణించేది. పదో తరగతిలో 9.6 సీజీపీఏ, ఇంటర్‌లో 91 శాతం మార్కులు సాధించిన రితి.. ఐఐటీనే తన లక్ష్యంగా పెట్టుకుంది.

అసలేమీ సాధించలేదనిపించింది!
కానీ ఇందుకోసం నిర్వహించిన అర్హత పరీక్ష జేఈఈలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో.. తన ఐఐటీ కల చెదిరిపోయింది. ‘ఇంటర్‌ పూర్తయ్యాక నా అకడమిక్‌ కెరీర్‌ చూసుకొని మురిసిపోయేదాన్ని. కానీ జేఈఈలో విఫలమయ్యేసరికి.. అసలు నేను జీవితంలో ఏదీ సాధించలేదనిపించింది. ఈ మానసిక వేదనతోనే ఇంజినీరింగ్‌లో చేరాను. అది కూడా మా నాన్నకు ఆర్థికంగా భారమవడం ఇష్టం లేక ప్రభుత్వ కళాశాలలో చేరా. అయినా ఐఐటీలో చేరలేకపోయానన్న బాధ నా మనసులో నుంచి తొలగిపోలేదు. దాంతో ఎం.టెక్ అయినా ఐఐటీలో చేయాలని గేట్‌కు సన్నద్ధమవడం ప్రారంభించా. అయితే అది మాత్రమే నా అంతిమ లక్ష్యం కాకూడ దనిపించింది.. ఈ క్రమంలో లింక్డిన్‌లో సెర్చ్‌ చేస్తే.. మనం ఎక్కడ చదివాం.. ఏం చదివాం.. అన్న వాటితో సంబంధం లేకుండా- సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, కోడింగ్‌.. వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారి పట్లే ప్రతిష్టాత్మక సంస్థలు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుసుకున్నా. అందుకే ఆయా అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలనుకున్నా.. వాటిలో శిక్షణ తీసుకున్నా..’ అంటోంది రితి.

అన్నీ వదులుకొని.. ఇంటర్న్‌గా!
ఈ క్రమంలో- సీరియస్‌గా ఉద్యోగాన్వేషణ కొనసాగిస్తోన్న రితికి దిగ్గజ కంపెనీల నుంచి ఆఫర్లు వరుస కట్టాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో.. వంటి ప్రముఖ సంస్థలు లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేశాయి. అయినా ముందు నుంచీ వాల్‌మార్ట్‌ సంస్థలోనే చేరాలనుకున్న రితి.. ఈ ఉద్యోగావకాశాలన్నీ వదులుకొని వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌గా చేరింది.
‘దిగ్గజ సంస్థల్లో చక్కటి ఆఫర్లు వచ్చినా వాటిని పక్కన పెట్టి.. నెలకు రూ. 85000 స్టైపెండ్‌ అందించే వాల్‌మార్ట్‌ ఇంటర్న్‌షిప్‌ని ఎంచుకున్నా. ఎందుకంటే ఎప్పటికైనా ఇదే సంస్థలో చేరాలన్నది నా కల! అయితే నా నిర్ణయాన్ని అమ్మానాన్నలతో పాటు అందరూ వ్యతిరేకించారు. ఒక్క మా అక్క తప్ప! తను ప్రస్తుతం ఐఐటీ ధన్‌బాద్‌లో పీహెచ్‌డీ చదువుతోంది. అక్క కూడా గేట్‌ పరీక్ష కోసం పలు ఉద్యోగావకాశాల్ని వదులుకుంది. తను నాతో ఎప్పుడూ ఒకటే చెబుతుంటుంది.. మనసు మాట వినమని! వాల్‌మార్ట్‌ ఇంటర్న్‌షిప్‌ విషయంలోనూ నేను అక్క చెప్పిన సూత్రమే పాటించా. ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ పూర్తై.. అదే సంస్థలో నా కలల కొలువు సాధించా. ప్రస్తుతం బెంగళూరు వాల్‌మార్ట్‌ సంస్థలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. రూ. 21 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నా..’ అంటూ గర్వంగా చెబుతోంది రితి.

ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదు!
వాల్‌మార్ట్‌ సంస్థలో తన కలల కొలువు సాధించి కార్పొరేట్‌ ఉద్యోగిగా ఇటీవలే ఏడాది పూర్తి చేసుకుంది రితి. అప్పుడు తన ఐఐటీ ప్రయత్నం విఫలమైనా.. ప్రస్తుతం ఐఐటీ చదివిన వారితో కలిసి పనిచేస్తున్నానంటోందామె. మనం ఎంత టాప్‌ కాలేజీలో చదివామన్నది ముఖ్యం కాదు.. మనలో ఎన్ని నైపుణ్యాలున్నాయన్నదే ముఖ్యమంటూ.. ఇటీవలే తన కథను సోషల్‌ మీడియాలో పంచుకుందీ టెకీ.

‘ప్రస్తుతం చాలామంది చదువు ఒత్తిడి, ఐఐటీలో సీటు రాలేదన్న ఆందోళనతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. అలాంటి వారికి నేను చెప్పదల్చుకున్నది ఒకటే.. అనుకున్న కాలేజీలో సీటు రాలేదన్న ఆందోళనను పక్కన పెట్టి.. ఎలాంటి నైపుణ్యాలున్న వారిని కంపెనీలు ఎంచుకుంటున్నాయో దానిపై దృష్టి పెట్టాలి.. ఆయా నైపుణ్యాల్ని పెంచుకోవాలి. అప్పుడు కచ్చితంగా మన కలల ఉద్యోగాన్ని సాధించచ్చు. నేనూ ఐఐటీలో సీటు రాలేదని ముందు బాధపడ్డా.. కానీ ఆ తర్వాత రియలైజ్‌ అయి.. నా కలల కొలువు సంపాదించా. ఇప్పుడు ఐఐటీలో చదివిన వారితో కలిసి పనిచేస్తున్నా.. కాబట్టి ఒత్తిడికి గురికాకుండా.. ప్రశాంతంగా ఆలోచిస్తే లక్ష్యానికి చేరువయ్యే మార్గం దొరుకుతుంది..’ అంటోన్న రితి పోస్ట్‌ చాలామందిలో స్ఫూర్తి నింపుతోంది. కొంతమంది స్పందిస్తూ తమకెదురైన ఇలాంటి అనుభవాల్నే పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు డిజిటల్‌ క్రియేటర్‌గానూ రాణిస్తోందీ టెకీ. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వేదికగా సాంకేతిక అంశాలపై పాఠాలు చెబుతూ నేటి యువతలో ఆయా అంశాలపై పట్టు పెంచుతోందామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్