అమెరికాలో అంకుర విజయం

బ్యాటరీ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి! సెల్‌ఫోన్లు ఉండవు.. కార్లు పనిచేయవు.. అంతెందుకు మన గుండెను నడిపించే పేస్‌మేకర్లు కూడా ఉండవ్‌! ‘భవిష్యత్‌ అంతా బ్యాటరీలదే’ అంటూ వరంగల్‌కు చెందిన షీబా దావూద్‌ అమెరికాలో ‘మినర్వా లిథియం’ అనే అంకుర సంస్థని స్థాపించారు.

Updated : 19 Jan 2023 05:53 IST

బ్యాటరీ లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి! సెల్‌ఫోన్లు ఉండవు.. కార్లు పనిచేయవు.. అంతెందుకు మన గుండెను నడిపించే పేస్‌మేకర్లు కూడా ఉండవ్‌! ‘భవిష్యత్‌ అంతా బ్యాటరీలదే’ అంటూ వరంగల్‌కు చెందిన షీబా దావూద్‌ అమెరికాలో ‘మినర్వా లిథియం’ అనే అంకుర సంస్థని స్థాపించారు. కాలుష్య రహిత పద్ధతుల్లో బ్యాటరీ తయారీని ప్రోత్సహించే తన ఆవిష్కరణ విశేషాలను వసుంధరతో పంచుకున్నారు...

పెట్రోల్‌ వంటి సంప్రదాయ ఇంధన వనరులు అడుగంటుతున్నకొద్దీ... బ్యాటరీల వాడకం పెరుగుతోంది. ఇది తెలిసిందే! కాకపోతే బ్యాటరీ తయారీ కోసం లిథియం వంటి మూలకాలని వెలికితీసేటప్పుడు వాతావరణాన్ని కలుషితం చేసే వ్యర్థాలు కూడా వెలువడుతుంటాయి. దీనికి చెక్‌ చెప్పే ఆవిష్కరణ చేసి.. అమెరికా ప్రభుత్వాన్ని మెప్పించారు షీబా. ‘నా స్వస్థలం హనుమకొండ. నాన్న ఎండీ దావూద్‌ అలీ. అమ్మ గ్రేస్‌ ఫాస్టీన. ఇద్దరూ ఉపాధ్యాయులే. అమ్మానాన్నలు నడిపే ప్రైవేటు పాఠశాలలోనే పదో తరగతి వరకూ చదివా. అందరిలానే మా ఇంట్లోనూ నేను డాక్టర్‌ లేదా ఇంజినీరింగ్‌వైపు వెళ్లాలని అనుకున్నారు. ఇంటర్‌ హైదరాబాద్‌లో చదివా. 98 శాతంతో పాసయ్యా. అప్పుడే మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలాం కార్యక్రమానికి హాజరయ్యా. ‘దేశ భవిష్యత్తంతా నానో సైన్స్‌దే’ అని ఆయనన్న మాటలు నా లక్ష్యాన్నే మార్చేశాయి. నోయిడా అమిటీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్‌ ఇన్‌ నానోటెక్నాలజీ, అమెరికాలో పీజీనీ చదివా. పీజీ రెండో సంవత్సరంలో ఉండగానే ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు అవకాశమొచ్చింది. తర్వాత అమెరికాలోని నార్త్‌కరోలినా విశ్వవిద్యాలయంలో నానో మెటీరియల్స్‌పై పీహెచ్‌డీ చేశా. తర్వాత అమెరికాలో స్థిరపడ్డ హైదరాబాద్‌ అబ్బాయి శామ్యూల్‌ను పెళ్లి చేసుకున్నా’ అంటారు షీబా.

నిండు గర్భంతోనే..  

షీబా తన పరిశోధనలను ఆచరణలో పెట్టి వాటికి మార్కెట్లో విలువని తేవాలనుకున్నారు. ‘మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, డిజిటల్‌ కెమెరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల్లోని బ్యాటరీలు లిథియం మూలకంతోనే నడుస్తాయి. దీన్ని సంప్రదాయ పద్ధతిలో వెలికితీస్తే వాతావరణం కలుషితం అవుతుంది. ఉప్పు నీటి నుంచి కూడా తీయొచ్చు. కాకపోతే అనేక రసాయనాలు వాడుతూ, నెలల తరబడి కష్టపడాలి. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేలా వాతావరణానికి చేటు చేయకుండా, మూడు రోజుల్లో నీటి నుంచి లిథియంను వెలికి తీసే ‘నానో మోసాయిక్‌ అబ్జర్వెంట్‌’ను ఆవిష్కరించా. ఈ విధానంలో అదనంగా నీరు కూడా శుద్ధి అవుతుంది’ అంటూ వివరించారు. అమెరికాలో ఇటీవల ‘టెక్‌ క్రంచ్‌’ అనే అంకుర సంస్థల పోటీల్లో షీబా ఆవిష్కరణ మొదటి స్థానంలో నిలిచి రూ.80 లక్షల నగదు పురస్కారాన్ని అందుకుంది. ‘విన్‌స్టన్‌ స్టార్ట్‌’, వాషింగ్టన్‌ డీసీలో ‘డిఫెన్స్‌ టెక్‌ కనెక్ట్స్‌’ అనే అంకురాల పోటీల్లోనూ తన ఆవిష్కరణ విజేతగా నిలిచింది. తన ఆలోచనకి వ్యాపార రూపం ఇచ్చేందుకు ‘మినర్వా లిథియం’ అంకుర సంస్థను స్థాపించారామె. ‘అమెరికాలో అంకుర సంస్థ పెట్టి, నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. పెట్టుబడులు రూ.కోట్లలో వస్తే కానీ లక్ష్యం నెరవేరదు. అందుకే రెండేళ్లుగా చాలా కష్టపడ్డాను. గర్భవతిగా ఉండీ... కనీసం 200 మంది సీఈవోలు, పారిశ్రామికవేత్తల్ని కలిసి నా ఆలోచనలను వివరించాను. గత జనవరిలో బాబు పుట్టాడు. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నెల రోజుల బాబుని ఎత్తుకుని ఎనిమిది రాష్ట్రాలు తిరిగాను. నా శ్రమ కొంతవరకూ ఫలించింది. ‘అమెరికా నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌’ నుంచి రూ.40 లక్షల వరకు సీడ్‌ఫండ్‌ అందింది. పలు పోటీల్లో నా ఆవిష్కరణకు నగదు పురస్కారాలు దక్కాయి. అలా రూ. 4.5 కోట్లు సమకూరాయి. ప్రస్తుతం మా సంస్థలో పది మంది పని చేస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే నా లక్ష్యం’ అంటున్నారు షీబా.

-గుండు పాండురంగశర్మ, వరంగల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్