సేంద్రియ ఉత్పత్తులు నేరుగా ఇంటికే పంపిస్తోంది!

మార్కెట్లో ప్రిజర్వేటివ్స్‌ లేని ఆహార ఉత్పత్తుల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఆఖరికి బియ్యం, పప్పులు పురుగులు పట్టకుండా రసాయనాలతో కూడిన కొన్ని పొడులను కలుపుతుంటారు. ఇలాంటి నిత్యావసరాల్ని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది.

Published : 29 Sep 2023 12:21 IST

(Photos: Instagram)

మార్కెట్లో ప్రిజర్వేటివ్స్‌ లేని ఆహార ఉత్పత్తుల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఆఖరికి బియ్యం, పప్పులు పురుగులు పట్టకుండా రసాయనాలతో కూడిన కొన్ని పొడులను కలుపుతుంటారు. ఇలాంటి నిత్యావసరాల్ని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ సమస్యను దూరం చేయడానికి కంకణం కట్టుకుంది ముంబయికి చెందిన శ్రీయ నహేతా వాధ్వా. రైతులు పండించిన పంట చేతులు మారి.. ప్రిజర్వేటివ్స్‌తో కలుషితం కాకముందే జాగ్రత్తపడుతోందామె. ఈ క్రమంలోనే ఆ ఆహార ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారులకు చేరువ చేస్తోంది. పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, నిత్యావసరాలు, మసాలాలు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తోందామె. మరి, ఆమె వ్యాపార ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..

ముంబయిలో పుట్టి పెరిగిన శ్రీయకు చిన్న వయసు నుంచే ఆరోగ్య స్పృహ ఎక్కువ. ఈ క్రమంలోనే సహజసిద్ధంగా పండించిన ఆహారోత్పత్తులు, ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికే ప్రాధాన్యమిచ్చేదామె. 2015లో ‘యూనివర్సిటీ ఆఫ్‌ సౌతర్న్‌ క్యాలిఫోర్నియా’లో ‘బిజినెస్‌ - ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌’ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన శ్రీయ.. చదువు పూర్తయ్యాక ముంబయి తిరిగొచ్చింది. అయితే కాలేజీలో ఉన్నప్పుడే సేంద్రియ ఉత్పత్తులపై మరింత అవగాహన పెరిగిందంటోందామె.

అది చూశాకే ఆలోచన!

‘లాస్‌ ఏంజెల్స్‌లో చదువుకునేటప్పుడు.. మా యూనివర్సిటీ క్యాంపస్‌లో వారానికోసారి రైతు బజార్‌ ఏర్పాటుచేసేవారు. రైతులు నేరుగా పండించిన పంటల్ని ఇక్కడ అమ్మేవారు. ఇక ఇండియాకు తిరిగొచ్చాక మా అక్కతో కలిసి కొన్ని వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించాను. ఇవన్నీ చూశాక.. మన దేశంలో ఎన్ని రకాల పంటలు పండుతున్నాయో, వాటినీ ఎంత సహజసిద్ధంగా పండిస్తున్నారో నాకు అర్థమైంది. అయితే వాటిలో నేరుగా వినియోగదారులకు అందేవి చాలా తక్కువ. చాలా వరకు పంటలు సహజసిద్ధంగానే పండించినా.. అవి చేతులు మారడం, వాటితో తయారుచేసిన వివిధ రకాల పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్‌ కలపడం వల్ల అవి వాటి సహజత్వాన్ని కోల్పోతున్నాయి. తద్వారా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికీ నష్టమే! కాబట్టి ఎలాగైనా ఈ సమస్యను దూరం చేయాలనుకున్నా. ఆపై దీని గురించి మరింత లోతుగా పరిశోధనలు చేశా. వీటన్నింటి ఫలితంగానే 2018లో ‘జామా ఆర్గానిక్స్‌’ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించా..’ అంటోన్న శ్రీయ.. సేంద్రియ ఉత్పత్తుల్ని, సహజసిద్ధంగా తయారుచేసిన నిత్యావసరాల్ని తన సంస్థ ద్వారా వినియోగదారులకు అందిస్తోంది.

ప్రతిదీ న్యాచురల్‌గానే!

ప్రతి ఆహార ఉత్పత్తికి మూలం పంటలే! అందుకే రైతులతో మమేకమై పనిచేస్తోంది శ్రీయ. ఈ క్రమంలో సహజసిద్ధంగా రైతులు పండించిన కాయగూరలు, పండ్లు, ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులన్నీ.. తన సంస్థ వేదికగా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు అందిస్తోందామె. ఇక మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకమైన పంట పండుతుంది. అంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లో యాపిల్స్‌; ఉత్తరాఖండ్‌లో చెస్ట్‌నట్స్‌, లిచీ; కశ్మీర్‌లో బాదంపప్పు, కారప్పొడి; మహారాష్ట్రలో పొద్దుతిరుగుడు నూనె, ఆంధ్రప్రదేశ్‌లో రైస్‌బ్రాన్‌ ఆయిల్‌.. వంటివి ఎక్కువగా ఉత్పత్తవుతాయి. కాబట్టి ఆయా పదార్థాల్ని అక్కడి రైతుల నుంచి కొనుగోలు చేస్తోందామె. వాటిని కస్టమర్లకు నేరుగా అందించడమే కాదు.. ఎలాంటి ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా వాటితో సాస్‌లు, స్నాక్స్‌, మసాలాలు, బేకరీ ఉత్పత్తులు, పచ్చళ్లు, జామ్స్‌.. వంటివన్నీ ఆరోగ్యకరంగా తయారుచేస్తోంది శ్రీయ. వీటినీ తన వెబ్‌సైట్‌ ద్వారా విక్రయిస్తూనే.. మరోవైపు మార్కెట్లోనూ అందుబాటులో ఉంచుతోంది.

రైతులకు పాఠాలూ!

ప్రస్తుతం ఆన్‌లైన్‌, యాప్‌ ద్వారా తమ ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోన్న శ్రీయ.. పుణే, బెంగళూరు, దిల్లీ.. వంటి మహా నగరాల్లోనూ ప్రత్యేక స్టోర్లను ఏర్పాటుచేసింది. ఇక్కడితో ఆగిపోకుండా.. తన సంస్థ ద్వారా రైతులకు సేంద్రియ వ్యవసాయ పాఠాలు, వివిధ రకాల ఆహారోత్పత్తుల్ని తయారుచేసే వారికి.. ప్రిజర్వేటివ్స్‌ ఉపయోగించకుండా వాటినెలా తయారుచేయాలన్న విషయాల్లో శిక్షణ కూడా ఇస్తోంది.

‘అన్ని రకాల సేంద్రియ వ్యవసాయోత్పత్తులు, కిచెన్‌కు సంబంధించిన నిత్యావసర వస్తువులు, ధాన్యాలు, సీజనల్‌ కాయగూరలు-పండ్లు.. ఇలా ఆహారోత్పత్తులన్నీ ఆరోగ్యకరంగా అందించే ఏకైక వేదికగా మా సంస్థను నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. నిత్యం మాకు వందలాది ఆర్డర్లొస్తుంటాయి. గోధుమలు, పసుపు, టొమాటో.. వంటివి మా వద్ద ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. ఇక పండగలప్పుడు ప్రత్యేక గిఫ్ట్‌ హ్యాంపర్లు కూడా అందిస్తున్నాం. వాటికీ మంచి స్పందన వస్తోంది.. కరోనా సంక్షోభ సమయంలో చాలామంది ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడంతో చాలామంది మా ఉత్పత్తుల్ని కొనుగోలు చేశారు..’ అంటోన్న శ్రీయ తన వ్యాపారంతో ఏటికేడు కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ ఫుడ్‌ బ్రాండ్‌కు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా కపూర్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. శ్రీయ సర్టిఫైడ్‌ హెల్త్‌ కోచ్‌ కూడా! ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల్ని అందించడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, హెల్త్‌ టిప్స్‌ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ఎంతోమందిలో ఆరోగ్య స్పృహ పెంచుతోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్