Srujana Adusumilli: అమెరికా చదువు కాదని.. ఎడిటర్‌నయ్యా!

చిత్రపరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. తెలిసిన వాళ్లూ పెద్దగా లేరు. సినిమాలు చూడటం ఇష్టమన్న ఒక్కకారణంతో ఈ రంగంలోకి వచ్చింది సృజన అడుసుమిల్లి. విదేశీ చదువూ పక్కనపెట్టి ‘మేమ్‌ ఫేమస్‌తో’ తొలి తెలుగు మహిళా ఎడిటర్‌గా పరిచయమైంది.

Updated : 27 May 2023 07:29 IST

చిత్రపరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. తెలిసిన వాళ్లూ పెద్దగా లేరు. సినిమాలు చూడటం ఇష్టమన్న ఒక్కకారణంతో ఈ రంగంలోకి వచ్చింది సృజన అడుసుమిల్లి. విదేశీ చదువూ పక్కనపెట్టి ‘మేమ్‌ ఫేమస్‌తో’ తొలి తెలుగు మహిళా ఎడిటర్‌గా పరిచయమైంది. వసుంధర పలకరించగా తన ప్రయాణాన్ని పంచుకుందిలా..

అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి.. ఈ పనులే చేయాలన్న నియమాలు పెట్టకుండా ఉంటే చాలు.. ఏ రంగంలోనైనా రాణించగలుగుతారని నమ్ముతా. ఆడవాళ్లు పెద్దగాలేని రంగంలో అడుగుపెట్టానంటే నిలదొక్కుకోగలనన్న నమ్మకం, ఆసక్తే కారణం. మాది గుంటూరు. అమ్మ ఆంధ్రాకుమారి, వైద్యురాలు. నాన్న జగన్నాథరావు, నాగార్జున విశ్వవిద్యాలయంలో విశ్రాంత జాయింట్‌ రిజిస్ట్రార్‌. బీటెక్‌ చదివాక ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లా. చిన్నప్పట్నుంచీ సినిమాలు బాగా చూసేదాన్ని. రెండున్నర గంటలు ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి. అయిపోయాక మాత్రం తెలియని వెలితి ఆవరించేది. అలాగని ఈ రంగంలోకి రావాలనేమీ అనుకోలేదు.

అప్పుడూ సినిమానే!

అమెరికాలో యువత చదువుతోపాటు పెయింటింగ్‌, క్లే, మోడలింగ్‌ ఇలా వివిధ అంశాల్లో ప్రతిభ కనబరచడం చూశా. ఉన్నది ఒక్కటే జీవితం. నేనూ నచ్చిందే ఎందుకు చేయకూడదు అనుకున్నా. అప్పుడు నాకు గుర్తొచ్చింది సినిమానే! దీనిలోనే ఏదైనా సాధించాలనుకున్నా. అదే అమ్మానాన్నలకు చెబితే కంగు తిన్నారు, ‘నీకేం తెలుసని వెళతా’వని వారించారు. వాళ్లకి దర్శకులు శేఖర్‌ కమ్ముల, నగేశ్‌ కుకునూరు, అడవిశేషు, సందీప్‌ వంగల ప్రయాణాన్ని వివరించాను. నా మొండి పట్టుదల చూసి కాదనలేకపోయారు. వెంటనే చదువు పక్కనపెట్టి భారత్‌కి తిరిగొచ్చేశా. ‘ఏం చేయాలి?’ అన్నదే తట్టలేదు. అప్పుడే ‘ద కటింగ్‌ ఎడ్జ్‌’ అనే డాక్యుమెంటరీ నా కంట పడింది. అది చూశాక సినిమా చూసేప్పుడు కలిగే అనుభూతి.. ఎడిటింగ్‌ ద్వారా అందరికంటే ముందే పొందొచ్చు కదా అనిపించింది. దీంతో ఎడిటర్‌ అవ్వాలనుకున్నా. మార్గాలను వెదుకుతోంటే పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనిపించింది. కానీ దేశీయంగా 10 సీట్లే.. పోటీ ఎక్కువ. అప్పటికి అడ్మిషన్లూ పూర్తయ్యాయి. ఏడాదంతా ఊరికే ఉండటం ఇష్టం లేక ముంబయిలో ఓ ప్రొడక్షన్‌ సంస్థలో పనిచేస్తూ 2016లో సీటూ సాధించా.

ఆ స్పందన చూసి..

కోర్సు పూర్తయ్యాక సీనియర్‌ ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌ గారి దగ్గర చేరా. రెండు సినిమాలకు సహాయకురాలిగా పనిచేశా. ఆ సమయంలో ‘కలర్‌ ఫొటో’ సినిమా చూశా. దానికి పనిచేసింది ‘ఛాయ్‌ బిస్కెట్‌’ ఛానెల్‌ వాళ్లే. నా రెజ్యూమె పంపితే ఆ సంస్థ నిర్మాతల్లో ఒకరైన అనురాగ్‌ ఫోన్‌ చేసి ‘సినిమాకి ఎడిటర్‌గా చేస్తారా’ అనడిగారు. అదే పూర్తిస్థాయిలో నేను పనిచేసిన తొలిచిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఎన్నో గంటల కష్టమది. టీజర్‌, ట్రైలర్‌లకు వచ్చిన స్పందన చూసి ఆనందం పట్టలేకపోయా. సినిమా.. ఒత్తిడి ఉండే రంగమే! ఇష్టం వల్లే పెద్ద కష్టంగా తోచలేదు. మావారు చైతన్య సాగర్‌. బీటెక్‌లో నా సహాధ్యాయి. 2019లో మాకు వివాహమైంది. తన ప్రోత్సాహం వల్లే రాణించగలుగుతున్నా. అమ్మాయిలకు సినిమా, ఎడిటింగ్‌ తగదు అన్నమాటల్ని అంగీకరించను. ప్రతిభ ఉన్న ఎవరైనా నిరూపించుకోవచ్చు. ఆసక్తి ఉందా.. శిక్షణ, అనుభవం సంపాదించుకోండి. నా వరకూ మంచి ఎడిటర్‌ అనిపించుకోవాలని కోరిక.

- సతీష్‌ దండవేణి, ఈటీవీ, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్