Updated : 03/02/2023 04:42 IST

ట్యూషన్లు చెప్పి.. రూ.80లక్షలు

అమ్మాయిలను చదివించడమే గొప్ప అని భావించే ఊర్లో పుట్టి ఎంబీఏ చేసిందామె. ఇంటింటికీ తిరిగి ట్యూషన్లు చెప్పిన ఆ అమ్మాయి నేడు లక్షల టర్నోవర్‌ సంస్థకు అధిపతి. పట్టుదల ఉంటే ప్రతికూల పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చు అంటోంది నేహా ముజాదియా..

నేహది మధ్యప్రదేశ్‌లోని మెల్‌ఖేద గ్రామం. జనాభా రెండు వేలకు మించదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేహ నలుగురు తోబుట్టువుల్లో రెండోది. తండ్రికి గ్రామంలో విత్తనాలు, ఎరువులు అమ్మే దుకాణం ఉంది. ఆ ఊర్లో ఎనిమిదో తరగతి తర్వాత చదువుకోవాలంటే మరో గ్రామానికి వెళ్లాల్సిందే. నేహా ధైర్యం చేసి ముందడుగు వేసింది. ఎకనామిక్స్‌లో బీఏ, ఇందౌర్‌లో ఎంబీఏ చేసింది. వాళ్ల ఊర్లో డిగ్రీ చదివిన మొట్టమొదటి అమ్మాయి కూడా తనే. ‘నేను మహిళా దినోత్సవం రోజు(మార్చి 8)పుట్టాను. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజున ప్రపంచ వ్యాప్తంగా విజయాలు సాధించిన మహిళల గురించి టీవీలో చూసేదాన్ని. అదే నాకు సాధించాలన్న స్ఫూర్తినిచ్చింది’ అంటుంది నేహా చదువెందుకన్నారు..

‘ఎంబీఏ చేయడానికి మా ఊరు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందౌర్‌ వెళ్లాను. అందుకోసం అమ్మానాన్నలను బతిమాలి ఒప్పించాను. బంధువులు, చుట్టుపక్కల వాళ్లు నేనేదో పెద్ద నేరం చేసినట్టు చూసేవారు. ఎంత చదివించినా అమ్మాయిలు పెళ్లి చేసుకుని ఓ ఇంటికి వెళ్లాల్సిందేగా అని వెటకారమాడేవారు. అందుకే ఎలాగైనా కష్టపడి చదవాలనుకున్నా. హిందీ మీడియంలో చదవటం వల్ల ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. కాలేజీ అయ్యాక సాయంకాలాల్లో స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. తర్వాత ఓ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్యూటర్‌గా చేరా. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదని అర్థమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాలనుకున్నా. అలా వచ్చిన ఆలోచనే ‘ట్యూటర్‌ కాబిన్‌’. 2018లో ఈ ఎడ్యుటెక్‌ కంపెనీ ప్రారంభించా. మొదట 20మంది విద్యార్థులతో ఇంట్లోనే మొదలైంది.  కరోనా సమయంలో ఆన్‌లైన్‌ కోచింగ్‌ తరగతులను ప్రారంభించా. పాఠశాల, కాలేజీ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు చెప్తున్నా. గతేడాది మా సంస్థ రూ.50లక్షల టర్నోవర్‌కు చేరుకుంది. ఈ ఏడాది రూ.80 లక్షలకు పెరిగింది. తాజాగా మా కంపెనీ ‘కుబేరన్స్‌ హౌజ్‌ స్టార్టప్‌’ పోటీలో విజేతగా నిలిచి 82,000 రూపాయల బహుమతినీ అందుకుంది. తక్కువ సమయంలో నాణ్యమైన విద్యను అందించినందుకే గాక, కొవిడ్‌ సమయంలో 24గంటలూ విద్యను అందించినందుకు ఈ అవార్డు వచ్చింది. మా గ్రామస్థులు వాళ్ల కూతుళ్లకు నన్ను ఉదాహరణగా చూపిస్తున్నారు’ అంటుందామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి