Repaka Eswari Priya: కల తీరింది... ప్యాకేజీ అదిరింది!

చదువులమ్మ సాయంతో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ నాన్న కల... అమ్మ చిన్నప్పుడే దూరమవడంతో ఆయన ఆశా దూరమైంది... కానీ ఆయన కడుపున పుట్టిన కూతురు నాన్న ఆశయాన్ని బతికించింది... చదువులో మేటిగా నిలవడమే కాదు.. ఏడాదికి రూ.84 లక్షల ప్యాకేజీ సాధించి ఆ తండ్రి గర్వపడేలా చేసింది... ఆమే విశాఖపట్నం అమ్మాయి రేపాక ఈశ్వరి ప్రియ.

Updated : 06 Feb 2023 07:26 IST

యువ హవా!

చదువులమ్మ సాయంతో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ నాన్న కల... అమ్మ చిన్నప్పుడే దూరమవడంతో ఆయన ఆశా దూరమైంది... కానీ ఆయన కడుపున పుట్టిన కూతురు నాన్న ఆశయాన్ని బతికించింది... చదువులో మేటిగా నిలవడమే కాదు.. ఏడాదికి రూ.84 లక్షల ప్యాకేజీ సాధించి ఆ తండ్రి గర్వపడేలా చేసింది... ఆమే విశాఖపట్నం అమ్మాయి రేపాక ఈశ్వరి ప్రియ.

నాన్న శ్రీనివాసరావు ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు అమ్మే చిరు వ్యాపారి. అమ్మ రాధ గృహిణి. అన్నయ్య సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌. మధ్యతరగతి కుటుంబం మాది. మా నాన్నకు బాగా చదువుకోవాలని కోరిక. కానీ ఆయన చిన్నప్పుడే వాళ్లమ్మ చనిపోవడంతో.. ఆర్థిక పరిస్థితులు సహకరించక పెద్దగా చదువుకోలేకపోయారు. ఈ విషయం ఎప్పుడూ మాతో చెప్పి బాధపడేవారు. ‘నేనెలాగూ చదువుకోలేకపోయా. మీరైనా బాగా చదువుకోవా’లనేవారు. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. నేను సాధించి ఆయన కళ్లలో ఆనందం చూడాలనుకున్నా. ఇంటర్‌ నారాయణలో చదివా. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌లో సీటొచ్చింది.  నాన్న అయితే ఆయనకే వచ్చినంత ఆనందపడ్డారు. మర యంత్రాలకు అర్థమయ్యే ప్రోగ్రామింగ్‌కు డిమాండు ఉండడంతో వాటిపై పట్టు సాధించాలని ఇంజినీరింగ్‌లో చేరిన మొదటి రోజే అనుకున్నా. అందుకు తగ్గట్టుగానే  మొదటి సంవత్సరంలోనే కోడింగ్‌ నేర్చుకునేందుకు రోజుకు మూడు గంటలు వెచ్చించేదాన్ని. మూడో ఏడాది నుంచీ ఆ సమయాన్ని మరికాస్త పెంచుకున్నా. రోజూ కొన్ని కోడింగ్‌ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకొని సాధించేదాన్ని. ఏ సమస్యనూ వదిలేయకుండా, తెలియని వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా పరిష్కారాలు అన్వేషించి వాళ్లెలా చేశారో తెలుసుకునే దాన్ని. అన్నయ్య సూచనలతో కొన్ని ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యా.

పెద్ద ప్యాకేజీ కావడంతో...

మూడో ఏడాది చదువుతున్నపుడు మోర్గాన్‌ స్టాన్లీ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేశా. ఆ సంస్థ కోడింగ్‌ పరీక్ష నిర్వహించి.. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం ఎంపిక చేసి నెలకు రూ.87 వేలు స్టైపెండ్‌ ఇచ్చింది. నా పనితీరు నచ్చడంతో రూ.28.7 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్‌ చేసింది. అలాగే అమెజాన్‌ సంస్థ కొద్ది నెలల కిందట కోడింగ్‌ పరీక్ష నిర్వహించి కొంతమందిని ఇంటర్న్‌షిప్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కు తీసుకుంది. నేను దానికీ ఎంపికయ్యా. నెలకు రూ.1.4 లక్షల అందిస్తున్నారు. ఇప్పటికి నెల పూర్తయింది. అట్లాషియన్‌లో రూ.84.5 లక్షల పెద్ద ప్యాకేజీకి ఎంపికవుతానని ఊహించలేదు. మిగిలిన వాటికి సిద్ధమయినట్టే దీనికి వెళ్లా. కానీ పెద్ద ప్యాకేజి అని చెప్పడంతో కొంత ఒత్తిడికి లోనయ్యా. నేను ఏ విషయమైనా నాన్నతో పంచుకుంటా. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అసలు సాధిస్తానో లేదో భయంగా ఉందని చెబితే ఆయన ‘మరేం ఫర్వాలేదు.. ఇదొక్కటే జీవితం కాదు. అంతా మన మంచికే. నీ వంతు ప్రయత్నించు’ అని భరోసా ఇచ్చారు. ఆ మాటలు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. ఇంటర్వ్యూ అయిన రోజే అపాయింట్‌మెంట్‌ లెటర్‌ మెయిల్‌ చేశారు. ఈ కంపెనీలో ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. గత ఏడాది అక్టోబరులో కోడింగ్‌ పోటీలు నిర్వహించారు. 300 మందిని తుది దశ పోటీలకు ఎంపిక చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. టెక్నికల్‌ సిస్టమ్‌ డిజైన్‌, హెచ్‌ఆర్‌ దశల్లో పరీక్షించి పది మందిని ఉద్యోగాలకు, చదువుతున్న మరో పది మందిని ఇంటర్న్‌షిప్‌లోకి తీసుకున్నారు. ఈ ఉద్యోగానికి ఏపీ నుంచి నేనొక్కదాన్నే ఎంపికయ్యా. ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్నీ కల్పించిందీ సంస్థ. ఇంత పెద్ద ప్యాకేజీని అందుకోవడం ఏయూ చరిత్రలోనే మొదటిసారట. ఇదే విషయం నాన్నతో చెబితే సంతోషించారు. కానీ ఇంటి నుంచే పనిచేస్తా అని చెప్పినపుడు అంతకంటే ఎక్కువ ఆనందించారు. ఆయనే కళ్ల ముందే ఉంటానని ఆయన సంతోషమంతా.

నచ్చిందే చేయమన్నారు..

కష్టపడితే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకుంటాం. నా విజయానికి కారణం అమ్మానాన్నలే. ఇంట్లో వాళ్ల నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండేది కాదు. నచ్చిందే చేయమనేవారు. చదువులో మునిగిపోతే అప్పుడప్పుడూ అమ్మే నన్ను బయటకు తీసుకెళ్లేది. ఉద్యోగంలో చేరాక సమయం కుదిరినప్పుడలా మిగిలిన స్నేహితులతో కలిసి ఒక క్లబ్‌గా ఏర్పడి విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తా. అలాగే యువత ఉపాధి అవకాశాల కోసం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంపస్‌లో కాకుండా బయట రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టిసారించాలి. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన, చదువుతున్న యువతకు అనేక అవకాశాలు ఉన్నాయి.

-రావివలస సురేశ్‌, విశాఖపట్నం


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్