దేశ దేశాల్లో రంగుల రెపరెపలు

ఈ వర్ణాలు ఫ్యాషన్‌కు అద్దంపడతాయి. తాత్కాలికంగా శిరోజాలను క్షణాల్లో రెండుమూడు వర్ణాల్లో మెరిసేలా ట్రెండీగా మార్చేస్తాయి. ఇలాంటి సెమీ పర్మనెంట్‌ హెయిర్‌ కలర్‌ ఉత్పత్తులను దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిందా అమ్మాయి.

Published : 20 Jan 2023 00:58 IST

ఈ వర్ణాలు ఫ్యాషన్‌కు అద్దంపడతాయి. తాత్కాలికంగా శిరోజాలను క్షణాల్లో రెండుమూడు వర్ణాల్లో మెరిసేలా ట్రెండీగా మార్చేస్తాయి. ఇలాంటి సెమీ పర్మనెంట్‌ హెయిర్‌ కలర్‌ ఉత్పత్తులను దేశంలోనే తొలిసారిగా తీసుకొచ్చిందా అమ్మాయి. ప్రారంభించిన ఏడాదికే రూ.కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్న యుషికాజోలి స్ఫూర్తికథనమిది.

సోషల్‌ మీడియా ఖాతాల్లో యుషికా రంగురంగుల శిరోజాలతో కనిపించేది. నెలలోనే అన్ని వర్ణాలెలా సాధ్యమనే అందరూ ఆశ్చర్యపోయే వారు. అలా అందరినీ ఆకర్షించిన ఆ రంగులన్నీ ఆమె తనపై తాను చేసుకొనే ప్రయోగాలే. యుషికా వాళ్లది గుజరాత్‌. అంక్లేశ్వర్‌ ప్రాంతానికి చెందిన యుషికా తండ్రి హెయిర్‌డైల ముడిసరకులు తయారు చేసేవారు. దీంతో చిన్నప్పటి నుంచి డైలకు సంబంధించిన ఉత్పత్తుల గురించి ఆమెకు అవగాహన ఉండేది. నిఫ్ట్‌లో డిగ్రీ, తర్వాత డిజైన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌కి యుషికా లండన్‌లో చేరింది. అక్కడందరూ రంగురంగుల డైలు వేసుకోవడం చూసినప్పుడు రకరకాల రంగుల్లో శిరోజాలు మరింత అందంగా కనిపించాయి. కాకపోతే అవి దీర్ఘకాలం అలా ఉండి పోకుండా కొద్దిరోజుల్లోనే తిరిగి శిరోజాలు యథాస్థితికి వచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించింది.

సహజంగా..

2019లో ఇండియాకు తిరిగొచ్చిన యుషికా ఈ తరహా హెయిర్‌ డైలు మార్కెట్‌లో ఉన్నాయేమో పరిశీలించింది. ‘కొద్ది రోజుల్లో వెలిసిపోయే వర్ణాలు మార్కెట్‌లో లేకపోవడం గుర్తించా. నా ఆలోచనను ఆచరణలోకి తేవడానికిదే సరైన సమయమనుకున్నా. పరిశోధనాశాల ఏర్పాటుతో, కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన నా సోదరుడి చేయూతతో ప్రయోగాలు ప్రారంభించా. ఈ వర్ణాలవల్ల శిరోజాలకు హాని కలగకుండా చేయాలనుకొన్నా. రెండు మూడు రంగుల ఛాయలూ ఒకేసారి వచ్చేలా కూడా ఉత్పత్తులు అందించాలనుకొన్నా. వీటిలో రసాయనాలను కాకుండా సహజ సిద్ధమైన భృంగరాజ్‌, కలబంద వంటివి తీసుకొన్నాను. వీటిని నాతోపాటు స్నేహితులు, కుటుంబసభ్యుల శిరోజాలకు వేసే దాన్ని. ఓసారి ప్రత్యేకంగా కనిపిస్తుందని పసుపు వర్ణం హెయిర్‌డై తయారుచేస్తే వేసుకోవడానికి ముందుకెవరూ రాలేదు. దాంతో నా జుట్టుకే వేసుకొన్నా. అలా నా పెళ్లి ముహూర్తానికి పసుపు రంగు హెయిర్‌డైతోనే పీటలపై కూర్చున్నా. నేననుకున్నట్లుగా ఫార్ములాలు సిద్ధమవడంతో ‘పారాడైస్‌’ ప్రారంభించా’ అంటుంది యుషికా. వీళ్లకు అహ్మదాబాద్‌లో తయారీ యూనిట్‌ ఉంది.

తాత్కాలికంగా..

పారాడైస్‌ వేసుకొన్న తర్వాత శిరోజాలు రకరకాల కలర్‌ కాంబినేషన్‌లో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే నెలన్నరలోపు జుట్టుకు ఆ రంగులు పోతాయి. ఎక్కువకాలం ఈ వర్ణాలు అంటుకొని ఉండవు. తాత్కాలిక అందాన్ని మాత్రమే ఇస్తాయి. ఇందులోని కండిషనర్‌ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ‘పారాడైస్‌లో 20రకాల ఉత్పత్తులున్నాయి. యువతను ఎక్కువగా ఆకర్షించడంతో మార్కెటింగ్‌ తేలికైంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేయడంతో అతికొద్ది కాలంలోనే అందరికీ మా ఉత్పత్తుల గురించి తెలిసింది. రసాయనరహితమే కాకుండా, హాని కలిగించే పదార్థాలు లేకుండా చేస్తున్న పారాడైస్‌ తాజాగా షార్క్‌టాంక్‌ సీజన్‌-2లో ఆర్థిక చేయూతనందుకోవడానికి అర్హత సాధించింది. ఈ నగదుతో మరిన్ని ప్రయోగాలు చేపడతా. వీటితో ఆధునికత మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన శిరోజాలతో అందంగా మెరిసిపోవాలనేదే నా లక్ష్యం. సీరం, నూనెలు వంటివీ ఉత్పత్తి చేయనున్నాం. త్వరలో మార్కెట్‌కు మా పారాడైస్‌ తరఫున నలుపు, బ్రౌన్‌ శాశ్వత హెయిర్‌ డైస్‌ కూడా పరిచయం చేస్తాం. గతంలో మన దేశంలో చాలామంది జుట్టుకు రకరకాల రంగులద్దడానికి ఇష్టపడేవారుకాదు. మరికొందరు తమ శిరోజాలు పాడవుతాయేమో అనుకొనేవారు. పారాడైస్‌ వారి అభిప్రాయాలను మార్చింది. మా వినియోగ దారుల్లో యువతే ఎక్కువ’ అనే యుషికా గతేడాది రూ.3.5కోట్లు వార్షికాదాయాన్ని అందుకొంది. ఎన్నో దేశాలకూ డైలను ఎగుమతి చేస్తున్న 26 ఏళ్ల యుషికా ప్రయత్నం బాగుంది కదూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్