ఈతతో ప్రేమలో పడదాం..!

‘‘ నేను ప్రతి ఒక్క మనిషికీ ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే అందరికీ ఈదగలిగే సామర్థ్యాన్ని ఇస్తా’’ అంటారు వరల్డ్‌ క్లాస్‌ స్విమ్మర్‌ లూయీస్‌ పగ్‌. ఈ మండే ఎండల ఉబ్బరం నుంచి తప్పించుకోవాలన్నా, శరీరానికి వ్యాయామం అందాలన్నా ఈత కంటే ఉత్తమ క్రీడ మరేమీ ఉండదేమో! ఒక్కసారి దీన్లోకి అడుగుపెడితే చాలు. ఇదే మీకు ఇష్టమైన క్రీడగా మారిపోతుంది. అంతలా ఏముంది ఈతలో అంటారా? అయితే, చదివేయండి. 

Updated : 24 May 2024 04:20 IST

‘‘ నేను ప్రతి ఒక్క మనిషికీ ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే అందరికీ ఈదగలిగే సామర్థ్యాన్ని ఇస్తా’’ అంటారు వరల్డ్‌ క్లాస్‌ స్విమ్మర్‌ లూయీస్‌ పగ్‌. ఈ మండే ఎండల ఉబ్బరం నుంచి తప్పించుకోవాలన్నా, శరీరానికి వ్యాయామం అందాలన్నా ఈత కంటే ఉత్తమ క్రీడ మరేమీ ఉండదేమో! ఒక్కసారి దీన్లోకి అడుగుపెడితే చాలు. ఇదే మీకు ఇష్టమైన క్రీడగా మారిపోతుంది. అంతలా ఏముంది ఈతలో అంటారా? అయితే, చదివేయండి. 

శైలి ఏదైనా...

ఈత వల్ల బొటనవేళ్ల నుంచి తలదాకా శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. శరీరానికి కావాల్సిన శక్తినీ, ఫ్లెక్సిబిలిటీనూ అందించడంతోపాటు హృద్రోగాలు దరిచేరకుండా ఉంటాయి. మిగతా క్రీడలతో పోలిస్తే, ఈతలో గాయాలయ్యే అవకాశమూ తక్కువే. ఒకేసారి శరీరం మొత్తాన్ని ట్యూన్‌ చేసే క్రీడ ఇదే మరి. మీరు ఏ శైలిలో స్విమ్‌ చేసినా సరే... ప్రతిదానికీ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఫ్రీస్టైల్‌ స్విమ్మింగ్‌లో భుజాలు, వెనకభాగం దృఢపడితే, బ్రెస్ట్‌స్ట్రోక్‌ శైలిలో ఛాతీ, ట్రైసెప్స్, క్వాడ్‌ కండరాలపై సానుకూల ప్రభావం పడుతుంది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధనల ప్రకారం రన్నింగ్‌ చేస్తే ఎన్ని కెలొరీలు కరుగుతాయో దానికి సమానంగా స్విమ్మింగ్‌లోనూ కరుగుతాయట. పైగా కీళ్లు, కండరాలపై ఒత్తిడీ అంతగా ఉండదు. 

ఒయాసిస్‌లా...

ఈత కొట్టడం వల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ అన్నే ప్రయోజనాలు దక్కుతాయట. ఈదాలంటే ఏకాగ్రతతో ఒక రిథమ్‌లో శరీరాన్ని కదిలించాల్సి ఉంటుంది. అంటే ఒకవిధంగా ధ్యాన ప్రక్రియే ఇది. అందుకే ఈత... ఒత్తిడి తగ్గించే ఆయుధమంటారు నిపుణులు. ‘‘నేను ఈత  కొడుతున్నప్పుడు నా ఆలోచనలన్నీ పక్కనపెట్టి ప్రశాంతంగా ఉంటాను. ఇది ఒకరకంగా నేను కదులుతూ చేసే ధ్యానం’’ అంటారు ఒలింపియన్, మైఖేల్‌ ఫెల్ప్స్‌.

అలవాటు చేసుకుందామిలా...

ఇన్ని ప్రయోజనాలున్న ఈతను అలవాటు చేసుకోవాలంటే ముందుగా ఒక స్థిరమైన షెడ్యూల్‌ను ఏర్పాటుచేసుకోండి. మూడు వారాలపాటు రోజుకో అరగంట చొప్పున సాధన చేయండి. ఓపిగ్గా మొదలుపెట్టి క్రమంగా ఈదే దూరాన్నీ, సమయాన్నీ పెంచుకుంటూ వెళ్లండి…. ఒక గాడిలో పడ్డాక రకరకాల స్విమ్మింగ్‌ స్ట్రోక్స్‌తో దాన్ని ఎంజాయ్‌ చేయడం మొదలుపెడతారు. అప్పుడు బోర్‌ అన్న ప్రశ్నా ఉండదు. నిదానంగా ఈ రొటీన్‌లో కిక్‌బోర్డ్‌ ల్యాప్స్, స్విమ్మింగ్‌ డ్రిల్స్, అక్వాటిక్‌ వ్యాయామాలనూ భాగం చేసుకోండి. స్విమ్మింగ్‌ను ఆస్వాదించాలంటే మరో ముఖ్యమైన చిట్కా... స్నేహితులతో కలిసి సాధన చేయడం. ఎందుకంటే నలుగురితో కలిసి సాధన చేస్తే, సరదాగానూ ఉంటుంది. స్నేహితులతో కుదరకపోతే, స్విమ్‌ క్లబ్బుల లాంటి వాటిల్లో చేరి గ్రూప్‌ వర్కవుట్లు, కమ్యూనిటీలతో కలిసి మీ నైపుణ్యాలనూ పెంచుకోవచ్చు. మరి ఈ జీవితకాలపు ఫిట్‌నెస్‌ సహచరిని మనమూ ఆహ్వానిద్దామా! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్